Begin typing your search above and press return to search.

ఏ సీఎంకు ప‌డని క‌ష్టం అనుభ‌వించిన బాబు

By:  Tupaki Desk   |   21 Oct 2016 10:23 AM GMT
ఏ సీఎంకు ప‌డని క‌ష్టం అనుభ‌వించిన బాబు
X
ఒక్కసారి ప్రారంభం అయితే 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసే కాన్వాయ్‌, దేశంలోనే అతి కొద్ది మందికి ఉండే జెడ్ ప్ల‌స్ సెక్యురిటీ భ‌ద్ర‌త‌, రాష్ట్ర ముఖ్య‌మంత్రి హోదా...ఇది ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు భ‌ద్ర‌త‌-ప్ర‌యాణం గురించి కాస్త ప‌రిచ‌య వ్యాఖ్య‌లు. కానీ ముఖ్యమంత్రి అయినా ట్రాఫిక్ తో తంటాల‌కు గుర‌వ్వాల్సిందే అని తేలింది. అయితే అది నిత్య‌న‌ర‌కంలాగా మారిన హైద‌రాబాద్‌లో జ‌రిగిందని అనుకునేరు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌స్తుత ప‌రిపాల‌న రాజ‌ధాని విజయవాడలో ఈ ప‌రిస్థితి ఎదురైంది. ఏకంగా ప‌ది నిమిషాల పాటు బాబు కాన్వాయ్ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది.

సాధారణంగా ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖుల కాన్వాయ్‌ బయలుదేరితే, మధ్యలో ఎక్కడా ఆగకూడదు. దీన్ని భద్రతా విధానాల్లో అతి ముఖ్యమైన అంశంగా పరిగణిస్తారు. ఇప్పటివరకు ఇలా ఒక ముఖ్య మంత్రి కాన్వాయ్‌ ఆగిపోయిన ఘటనలు కూడా ఎక్కడా కనిపించలేదు. కానీ బాబుకు ఆ చేదు అనుభ‌వం ఎదురైంది. ఉండ‌వ‌ల్లిలోని నివాసం నుంచి బయలుదేరిన తరువాత ప్ర‌కాశం బ్యారేజీకి వ‌చ్చిన స‌మ‌యంలో సాధారణ జనం మధ్య బాబు కాన్వాయ్ చిక్కుకుపోయిది. అలా కీలకమైన ప్రకాశం బ్యారేజిపై పది నిముషాలకు పైగా ఆగిపోయింది. ప్రకాశం బ్యారేజిపై సాధారణ ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండడం, దానిని క్రమబద్ధీకరిరచకుండా ముఖ్యమంత్రి కాన్వాయ్‌ బయలుదేరిపోవడంతో చంద్ర‌బాబుకు ట్రాఫిక్ క‌ష్టాలు త‌ప్ప‌లేదు. ట్రాఫిక్‌ సిబ్బంది కూడా స‌రిప‌డినంతగా లేకపోవడంతో చిక్కులు ఎదుర‌య్యాయి. పోలీసుల వైఖరిపై ముఖ్యమంత్రి కార్యాలయం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు స‌మాచారం.