బాబు.. అమెరికాలోనూ మాకీ టార్చరేల?

Tue Sep 25 2018 14:47:22 GMT+0530 (IST)

బాబు అంతే. ఎక్కడికెళ్లినా.. ఏ వేదిక మీదనైనా.. ఒకసారి మైకు ముందుకెళితే చాలు.. తనను తాను మర్చిపోతారు. తానేం మాట్లాడుతున్న విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. తాను.. తన గొప్పతనం సీడీ స్టార్ట్ చేసేస్తారు. ఇవాల్టి రోజుకు తన మాటలు ఎంతవరకూ పనికి వస్తాయన్న కనీస విషయాన్ని సైతం లెక్క చేయరు.అంతేనా.. తన గొప్పల గురించి గొప్పగా చెప్పుకునే క్రమంలో ఎదుటివారిని చిన్నబుచ్చతున్నాన్న భావన కూడా ఆయన మదిలో మెదలదా? అన్న భావన కలుగక మానదు. తాజాగా ఇలాంటి అనుభవమే ప్రవాసాంధ్రులకు కలిగింది. ఏదో మన బాబు.. మన తెలుగోడు అన్న భావనతో వచ్చినోళ్లకు తన ప్రసంగంతో చుక్కలు చూపించటమే కాదు.. ఇప్పుడీ గొప్పలేంట్రా బాబు అనుకునేలా చేశారని చెబుతున్నారు.

బాబు డైహార్ట్ ఫ్యాన్స్ సైతం ఆయన మాటలకు కాస్తంత చిన్నబుచ్చుకున్నట్లుగా చెబుతున్నారు. ఎందుకలా అంటే.. బాబు గారి మాటలేనని చెబుతున్నారు. ఇవాల్టి రోజున మీరు ఇక్కడ ఉన్నారంటే అదంతా నా పుణ్యమే అన్నట్లుగా బాబు నోటి నుంచి మాటలు అవాక్కు అయ్యేలా చేశాయని చెబుతున్నారు. తమ కష్టంతో.. తమ కృషితో ఎదిగితే.. ఇదంతా నా పుణ్యమే.. మీ బతుకులన్నీ నేను పెట్టిన భిక్షే అన్న చందంగా బాబు గొప్పలు ఉన్నట్లుగా కొందరు ఆవేదన వ్యక్తం చేయటం గమనార్హం.

అప్పట్లో తాను ఐటీ రంగంపై పెట్టిన శ్రద్ధ కారణంగానే ఈ రోజు ఇంతమంది అమెరికాకు రాగలిగారని.. నాలెడ్జి ఎకానమీకి చిహ్నంగా సరిగ్గా 20 ఏళ్ల కిందట ఇదే రోజున (సెప్టెంబరు 24) హైదరాబాద్‌లో సైబర్ టవర్స్ ను ప్రారంభించిన వైనాన్ని గుర్తు చేశారు.

టెక్నాలజీతో అమెరికా కంటే ఏపీనే అనేక రంగాల్లో ముందు ఉందన్న ఆయన న్యూజెర్సీలో ప్రవాస తెలుగువారిని ఉద్దేశించి ప్రసంగించారు. రోటీన్ తరహాలోనే గొప్పలతోనూ.. తన దూరదృష్టితోనూ సాగిన బాబు ప్రసంగం విన్నోళ్లంతా అమెరికాకు వచ్చినా మాకీ టార్చర్ తప్పదా చంద్రబాబు అంటూ గుసగుసలాడుకోవటం గమనార్హం.

తెలుగు వారికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం గురించి చెప్పిన చంద్రబాబు.. ప్రవాసులు సొంత గ్రామానికి ఏం చేయాలో ఆలోచించాలన్నారు. ఆ ఆలోచనల్ని గ్రామస్తులతో పంచుకోవాలని.. గ్రామదర్శిని.. వార్డు దర్శినికి చేయూత ఇవ్వాలని కోరారు. ఈ ఏడాది ప్రవాసులకు ఓటుహక్కు వస్తుందని.. ఇందుకు సంబంధించిన బిల్లు లోక్ సభలో ఆమోదం పొందినట్లు బాబు చెప్పారు. రాజ్యసభ ముందుకు త్వరలో రానుందని.. ఉన్న చోటు నుంచే ఓటు వేసే అవకాశం ప్రవాసాంధ్రులకు ఉంటుందని చెప్పారు. త్వరలోనే ఎన్ ఆర్ ఐ టీడీపీ సేవా కేంద్రాన్ని ప్రారంభిస్తామని చెప్పిన బాబు ముచ్చట్లకు తెలుగు ఎన్ ఆర్ ఐలు తల పట్టుకున్నట్లుగా తెలుస్తోంది.