Begin typing your search above and press return to search.

నిల‌దీయ‌క‌.. ఈ అడుక్కోవ‌టాలు ఏంది బాబు?

By:  Tupaki Desk   |   24 April 2017 4:10 AM GMT
నిల‌దీయ‌క‌.. ఈ అడుక్కోవ‌టాలు ఏంది బాబు?
X
రెండే దారులు ఉన్నాయి. ఒక‌టి పోరాటం. రెండోది.. దీనంగా అడుక్కోవ‌టం. హ‌క్కులున్న‌ప్పుడు అడుక్కోవ‌టం స‌మంజ‌స‌మేనా? అన్న‌ది ఇక్క‌డ అస‌లు ప్ర‌శ్న‌. ఏపీ ఈ రోజు ఎలాంటి ప‌రిస్థితుల్లో అంద‌రికి తెలిసిందే. కాకుంటే.. నిత్యం గొప్ప‌లు చెప్పుకునే చంద్ర‌బాబు పుణ్య‌మా అని.. ఏపీకి ఎదురు లేదు.. తిరుగులేద‌న్న‌ట్లుగా క‌నిపించ‌టం.. వివిధ కార్య‌క్ర‌మాల్ని భారీగా.. ఆడంబ‌రంగా నిర్వ‌హించ‌టం ద్వారా రాంగ్ సిగ్న‌ల్స్‌ ను పంపిన ఘ‌న‌త బాబు సొంతం. మింగ మెతుకు లేదు కానీ మీసాల‌కు సంపెంగ నూనె అన్న పాత కాలం నాటి సామెత‌.. ఏపీ స‌ర్కారు విష‌యంలో క‌నిపిస్తుంది. విభ‌జ‌న నేపథ్యంలో ఏపీకి కేంద్రం ద‌న్ను త‌ప్ప‌నిస‌రి. లేకుంటే అంతే సంగ‌తులు. కానీ.. మోడీ లాంటి ప్ర‌ధాని ఉన్నంత కాలం ఏపీని ఎద‌గ‌నిస్తారా? అన్న‌ది డౌటే.

మోడీ లాంటి మ‌హానుభావుడి మీద అన్నేసి నింద‌లా? అని కొద్దిమందికి కోపం రావొచ్చు. నిజంగా అంత మంచి మ‌నిషే అయి ఉంటే.. ఏపీకి ప్ర‌త్యేక హోదాను ఇచ్చి.. గ‌డిచిన మూడేళ్లుగా నిజాయితీతో ఫోక‌స్ చేస్తే.. ఈ రోజు ఏపీ ఉన్న దారుణ ప‌రిస్థితి ఉండేది కాదు. దీనికి తోడు.. ఆడంబ‌రాల‌తో హ‌డావుడి చేసే చంద్ర‌బాబు కార‌ణంగా కూడా అందాల్సిన సాయం అంద‌కుండా పోతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

విభజ‌న కార‌ణంగా ఏపీకి జ‌రిగిన అన్యాయాన్ని కేంద్రానికి చెప్ప‌టంలో త‌ప్ప‌ట‌డుగులు వేసిన చంద్ర‌బాబు కార‌ణంగా.. గ‌డిచిన మూడేళ్లలో ఆర్థికంగా మ‌రింత దిగ‌జారింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. దీనికి తోడు.. హ‌క్కుగా ఉన్న వాటిని నేటికీ సాధించుకోలేని చేత‌కానిత‌నం.. ఏపీ వృద్ధికి ద‌న్నుగా నిలిచే అంశాల విష‌యంలో రాజీ పుణ్య‌మా అని.. ఏపీకి ఎంత న‌ష్టం జ‌ర‌గాలో అంత న‌ష్టాన్ని జ‌రిగేలా చేశారు చంద్ర‌బాబు. విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీకి ఏమేం చేయాల‌న్న విష‌యాన్ని విభ‌జ‌న చ‌ట్టాన్ని ఆమోదించే స‌మ‌యంలో నాటి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ ఇచ్చిన హామీల అమ‌లు మ‌న హ‌క్కు అన్న విష‌యాన్ని చంద్ర‌బాబు మ‌ర్చిపోవ‌టం ఏపీకి శాపంగా మారింది.

మోడీ లాంటి ప్ర‌ధానిని అడుక్కున్నా ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌న్న విష‌యం గ‌డిచిన మూడేళ్ల అనుభ‌వం చెప్ప‌క‌నే చెప్పింద‌ని చెప్పాలి. ఆయ‌న‌కు బుద్ధి పుడితే ఇస్తారు.. లేదంటే లేదంతే. చేదుమాత్ర లాంటి ఈ నిజాన్ని అంద‌రికి అర్థ‌మ‌య్యేలా చెప్ప‌టంలో బాబు ఫెయిల్ అయ్యార‌నే చెప్పాలి. హ‌క్కుల సాధ‌న వ‌దిలేసి.. దైన్యంతో అడుక్కోవ‌టం చూసిన‌ప్పుడు ఆంధ్రోడి గుండె మండిపోతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. విభ‌జ‌న కోరుకుంది ఆంధ్రోళ్లు కాదు. అలాంట‌ప్పుడు విభ‌జ‌న న‌ష్టాన్ని ఆంధ్రా ఎందుకు భ‌రించాల‌న్న న్యాయ‌మైన ప్ర‌శ్న‌ను జాతీయ స్థాయిలో ఎందుకు సంధించ‌రో ఎవ‌రికీ అర్థం కాదు.

నిత్యం త‌నంత పోటుగాడు ఈ ప్ర‌పంచంలోనే ఉండ‌ర‌ని చెప్పుకునే చంద్ర‌బాబు.. ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన నీతిఅయోగ్ స‌మావేశంలో ఏపీ దీన‌గాథ‌ను చెప్పుకున్న తీరు.. అడుక్కున్న వైనం చూసిన‌ప్పుడు మోడీ ప్రాప‌కం కోసం ఎంత‌గా ఎదురుచూస్తున్న‌ది అర్థ‌మ‌వుతుంద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు. డాబు మాట‌లు స్థానే.. నిజాలు చెప్పిన చంద్ర‌బాబు మాట‌ల్ని చూసిన‌ప్పుడు.. గ‌డిచిన మూడేళ్ల‌లో బాబు పాల‌న‌లో ఏపీకి ఏం ఒరిగింద‌న్న సందేహం రాక మాన‌దు.

మోడీ విదిల్చిన అర‌కొర సాయానికే మురిసిపోతూ.. ఎంతో సాయం చేశార‌న్న‌ట్లుగా మాట‌లు చెప్పి.. క‌ష్టాల్లో ఉన్న త‌మ‌ను ఆదుకోవాలంటూ అడుక్కున్న వైనం ఆంధ్రోడికి క‌డుపు మండ‌క మాన‌దు. క‌ష్టం ఎవ‌రి వ‌ల్ల వ‌చ్చింది? ఎందుకువ‌చ్చింద‌న్న‌ది ముఖ్యం. ఆ విష‌యాన్ని వ‌దిలేసి.. మీరు చేసిన సాయానికి ధ‌న్య‌వాదాలు.. కానీ.. మ‌మ్మ‌ల్ని మ‌రింద ఆదుకోండంటూ చెప్పే మాట‌ల్ని చూస్తే.. అడుక్కునే వాడికి.. మ‌న‌కీ పెద్ద తేడా లేద‌నిపించ‌క మాన‌దు.

ఎందుకంటే.. విభ‌జ‌న స‌మ‌యంలో ఇస్తాన‌న్న హామీల్ని నెర‌వేర్చాల‌ని బ‌లంగా నిల‌దీయాల్సిన వేదిక మీద‌.. ఏపీకి కేంద్రం ఒర‌గ‌బెట్టిందేమీ లేద‌న్న చారిత్ర‌క‌స‌త్యాన్ని చెప్పాల్సింది పోయి.. ఈ అడుక్కోవ‌టం ఏమిట‌న్న‌ది అస‌లు ప్ర‌శ్న‌. హ‌క్కుల గురించి ప్ర‌శ్నించే వారిని ఢిల్లీ పీఠం ప‌ట్టించుకుంటుందా? లేదంటే.. అడుక్కునే వారిని కేంద్రం అక్కున చేర్చుకుంటుందా? అన్న ప్ర‌శ్న వేసుకుంటే.. ఏపీ దారి ఎలా ఉండాలో ఇట్టే అర్థ‌మ‌వుతుంది. అలాంట‌ప్పుడు.. ఢిల్లీలో బాబు దైన్య‌పు మాట‌లు ఏపీకి ఎంత వ‌ర‌కూ లాభం చేకూరుస్తాయ‌న్న‌ది సందేహ‌మే. ఇలాంట‌ప్పుడు అడుక్కోవ‌టం ఆపేసి.. హ‌క్కుల సాధ‌న కోసం న‌డుం బిగిస్తే.. ఇప్పుడున్న ద‌రిద్ర‌పు పొజిష‌న్ కంటే దిగ‌జారి పోతామా? స‌మాధి చేసిన ఆత్మాభిమానాన్ని బ‌య‌ట‌కు తీసి.. పిడికిలి బిగిస్తే త‌ప్ప ఏపీకి ఎంత‌మాత్రం న్యాయం జ‌ర‌గ‌ద‌న్న వాస్త‌వాన్ని ఏపీ పాల‌కులు ఎప్ప‌టికి అర్థం చేసుకుంటారో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/