Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తి డిజైన్లపై బాబు మాట‌ల అర్థ‌మేంటో?

By:  Tupaki Desk   |   22 April 2017 4:52 AM GMT
అమ‌రావ‌తి డిజైన్లపై బాబు మాట‌ల అర్థ‌మేంటో?
X
అంతా ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తున్న న‌వ్యాంధ్ర‌ప్రదేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తిలో నిర్మాణం ఇప్ప‌టికీ అడుగు ముందుకు ప‌డ‌ని సంగ‌తి తెలిసిందే. ఇంకా డిజైన్ల‌ను ఖ‌రారు చేయ‌డ‌మ‌నే ద‌శ‌నే పూర్తికాక‌పోవ‌డంతో ఎప్ప‌టికీ ఈ ప్ర‌క్రియ కొలిక్కివ‌చ్చేను...నిర్మాణాలు ఎప్పుడు ప్రారంభం అయ్యేను అంటూ కొంద‌రు పెద‌వి విరుస్తున్నారు. అయితే మంత్రిమండలి సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. రాజధాని డిజైన్ల ఖరారు విషయంలో తాను అనుకున్న రూపు వచ్చేవరకూ మెరుగైన మరిన్ని డిజైన్లను పరిశీలిస్తూనే ఉంటానని చంద్ర‌బాబు స్పష్టం చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. కేబినెట్ స‌మావేశం ఆయన రాజధాని డిజైన్లు - ఉద్యోగుల బదిలీలు - ఇటీవల కేంద్రహోం శాఖ ఉన్నత విద్యామండలి విభజనపై ఇచ్చిన ఆదేశాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

కేబినెట్ స‌మావేశంలో రాజధాని డిజైన్లపై గంట సేపు చర్చ జరిగిందని స‌మాచారం. ఇటీవల లండన్ వెళ్లి డిజైన్లపై అధ్యయనం చేసి వచ్చిన ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ దానిపై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ ను మంత్రులు ఆసక్తిగా తిలకించారు. నార్మన్ ఫోస్టర్స్ డిజైన్లపైనా చర్చ జరిగింది. తర్వాత దానిపై బాబు మాట్లాడుతూ తాను ఏ విషయంపైనా ఒకపట్టాన తృప్తి పడనని చెప్పారు. తాను సీఎంగా ఉన్నప్పుడు కట్టిన హైటెక్ సిటీ కూడా అనేక డిజైన్లను పరిశీలించి, సంతృప్తి చెందిన తర్వాతే ఇప్పటి హైటెక్ సిటీ రూపొందిందని చెప్పారు. రాజధాని నగర నిర్మాణానికి ఇంకా మెరుగైన డిజైన్లపై అధ్యయనం చేయాలని సూచించారని స‌మాచారం. దీంతో డిజైన్ల ద‌శ‌లోనే ఇప్ప‌టికి జాప్యం జ‌రిగింద‌ని భావిస్తుండ‌గా..మ‌రింత లేటు ఖాయ‌మ‌ని తాజాగా బాబు కామెంట్ల‌తో అర్థ‌మ‌వుతోంది. కాగా, విశ్వసనీయ సమాచారం ప్రకారం.. 9,10వ షెడ్యూల్‌లో ఉన్నత విద్యామండలి ఆస్తుల పంపకాలపై ఇటీవల కేంద్ర హోం శాఖ ఇచ్చిన ఉత్తర్వులపై చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. ముందు ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి ఒత్తిడి చేద్దామని అన్న‌ట్లు స‌మాచారం. మనం మిత్రపక్షంగా ఉన్నా అన్నింటికీ ఆమోదించాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ప్రయోజనాలు కూడా ముఖ్యమని బాబు అన్న‌ట్లుగా తెలుస్తోంది. అవ‌స‌ర‌మైతే కోర్టుకైనా వెళ్దామని ప్ర‌తిపాదించిన‌ట్లు స‌మాచారం.

కాగా ఉద్యోగుల బదిలీల గురించి చంద్ర‌బాబు మాట్లాడుతూ బదిలీ సీజన్ వస్తుందంటేనే భయమేస్తోందని బాబు నవ్వుతూ అన్నారని స‌మాచారం. ఈసారి బదిలీలు పారదర్శకంగా ఉండాలని, ఎక్కడా అవినీతి ఆరోపణలను తావివ్వకూడదని, అలా చేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని బాబు స్ప‌ష్టం చేశారు. ``మంత్రులు నేరుగా జోక్యం చేసుకోకపోవచ్చు కానీ వారు పేరుమీద సన్నిహితులో, ఇంకెవరో బదిలీల్లో జోక్యం చేసుకోవచ్చు. అందుకే నేను రోజూ మానిటరింగ్ చేస్తాను` అని బాబు చెప్పిన‌ట్లు స‌మాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/