Begin typing your search above and press return to search.

ప్రతి నిరుద్యోగికీ బాబు రూ.90 వేలు బాకీ!

By:  Tupaki Desk   |   24 Feb 2018 4:46 PM GMT
ప్రతి నిరుద్యోగికీ బాబు రూ.90 వేలు బాకీ!
X
ఇచ్చిన మాట తప్పడం అంటే అప్పు ఎగ్గొట్టడం కిందే లెక్క. పైగా మాట ఇచ్చినది కూడా ఆర్థిక అంశానికి సంబంధించి అయినప్పుడు.. సదరు మాట తప్పడం ఖచ్చితం తప్పు మరియు అప్పు అవుతుంది. అందుకే .. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగ యువకుడికీ.. చంద్రబాబునాయుడు 90 వేల రూపాయల వంతున అప్పు ఉన్నాడంటూ విపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలియజెబుతున్నారు. ఏ రకంగా అప్పు పడి ఉన్నాడో కూడా ఆయన చాలా లాజికల్ గా విమర్శిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు పండగే పండగ అని.. అదరికీ ఉద్యోగాలు వచ్చేస్తాయిన చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలోనే హామీ ఇచ్చారు. బాబు వస్తే జాబు వస్తుంది అంటూ ప్రచారం చేసుకున్నారు. అలాగే.. నిరుద్యోగ యువతకు ప్రతినెలా రూ.2వేలు భృతి ఇస్తాం అని కూడా అప్పట్లో వారు వెల్లడించారు.

ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. నిరుద్యోగులకు భృతి పేరుతో ఆశ కల్పించి సొమ్ము ఇవ్వకుండా మోసం చేసిన చంద్రబాబు నాయుడు.. అధికారంలోకి వచ్చిన ఇన్నేళ్లలో అంత మొత్తం బాకీ ఉన్నట్లే అంటూ.. ప్రతి నిరుద్యోగికి ఆయన 90 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

బాబు వస్తే జాబు వస్తుంది హామీ లాగానే నిరుద్యోగ భృతి హామీని నమ్మిన యువతరాన్ని తెలుగుదేశం ప్రభుత్వం నట్టేట ముంచిందనేది విపక్ష నాయకుడి ఆరోపణ. అయితే.. జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించిన వెంటనే.. ఈ విషయంలో తమకు ఇక ప్రజాప్రతిఘటన తప్పదని గుర్తించిన తెలుగుదేశం సర్కారు. హడావుడిగా నిరుద్యోగ భృతి గురించి కొంత కసరత్తు చేస్తున్నట్లుగా నాటకం నడిపించిందని ప్రజలు అంటున్నారు. అప్పట్లో ఏదో కమిటీలు వేసి.. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల లెక్కలుతీస్తున్నాం అని.. దానికి సంబంధించి విధివిధానాలను రూపొందిస్తున్నాం అని చంద్రబాబు మరియు లోకేష్ పలుమార్లు ప్రకటించారు. అంతే.. నెలలు గడిచిపోయాయి గానీ.. ఇప్పటిదాకా భృతికి సంబంధించి అతీ గతీ లేదు. కనీసం ఏదశలో ఉందో కూడా ఎవ్వరూ పెదవి విప్పడం లేదు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు యువతకు బాకీ ఉన్నారని జగన్ ఆరోపించడంలో తప్పేం ఉంది అని జనం అనుకుంటున్నారు.