Begin typing your search above and press return to search.

తెరపైకి ఓటుకు నోటు : ‘బాబు’ దూత షాక్ ఇస్తాడా?

By:  Tupaki Desk   |   23 Feb 2018 4:23 PM GMT
తెరపైకి ఓటుకు నోటు : ‘బాబు’ దూత షాక్ ఇస్తాడా?
X
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటును కొనుగోలు చేయడానికి అయిదు కోట్ల రూపాయలు ఆఫర్ చేయడం - అందులో కొంత మొత్తం క్యాష్ గా ఇవ్వడానికి వెళ్లి... తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు దొరికిపోవడం అనేది తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పటికీ మరచిపోరు. ఇదే కేసులో చంద్రబాబునాయుడు ఆడియో సంభాషణ కూడా బయటకు రావడంతో.. ఆయన కూడా ఎంతగా కూరుకుపోయారో అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో.. కేసులో కీలక నిందితుడు జెరూసలెం మత్తయ్య ఇప్పుడు తెరమీదికి వచ్చారు. తాను ‘పార్టీ ఇన్ పర్సన్’ గా సుప్రీం కోర్టులో విచారణకు హాజరై తనకు తెలిసిన విషయాలు వెల్లడించడానికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు.

నిజానికి ఈ కేసులో జెరూసలెం మత్తయ్య చాలా కీలకం అని నిపుణులు తొలినుంచి చెబుతూనే వస్తున్నారు. ఆయన ద్వారానే నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు డబ్బు ఆఫర్ చేసే ప్రతిపాదన వెళ్లినట్లుగా అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. మత్తయ్య మొబైల్ ఫోన్ లోని కాల్ రికార్డులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఇంతకంటె కీలక సమాచారం ఉన్నట్లుగా కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి.

అయితే మత్తయ్య మాత్రం పోలీసులకు దొరకకుండా అజ్ఞాతంలో గడుపుతూ వచ్చారు. కేసులో డబ్బు ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన రేవంత్ రెడ్డి.. సుదీర్ఘకాలం జైల్లో ఉండి ప్రస్తుతం బయటే ఉన్నారు. కాకపోతే.. తెలుగుదేశం పార్టీలో ఉండగా.. ఈ అనైతిక చర్యకు పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయిన రేవంత్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని ఉన్నారు.

ఇన్నాళ్లూ హైకోర్టు పరిధిలో విచారణ జరుగుతున్న కేసు ప్రస్తుతం సుప్రీం కు మారిందని - కేసు సుప్రీంకు వెళ్లిన తర్వాత.. తనకు సమాచారం తెలియడం లేదని అందుకని తానే నేరుగా పార్టీ ఇన్ పర్సన్ గా సుప్రీం ఎదుట హాజరవుతానని మత్తయ్య సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి రాసిన 4 పేజీల లేఖలో పేర్కొన్నట్లుగా సాక్షి దినపత్రికలో వార్త ప్రచురితం అయింది.

మత్తయ్య తెలుగుదేశానికి అనుకూలమైన వ్యక్తిగానే తొలినుంచి ప్రచారం జరుగుతోంది. ఆయన మాత్రం ఈ లేఖలో ఓటుకు నోటు కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. తాను కేవలం క్రిస్టియన్ సమస్యల మీద చర్చించేందుకు మాత్రమే కలిశానని కూడా రాసినట్లుగా తెలుస్తోంది.

తనకు పలు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని కూడా మత్తయ్య గతంలో పలుమార్లు ఆరోపించారు.

అయితే ఓటుకు నోటు కేసుతో పాటు - దీనితో లింక్ ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసునుకూడా సీబీఐ కు అప్పగించాలని మత్తయ్య కోరడం విశేషం. విచారణలో ఆయన ఏం వివరాలు చెబుతారో.. ఎవరెవరు ఎంత లోతుగా ఈ ఊబిలో కూరుకుపోతారో వేచిచూడాలి.