Begin typing your search above and press return to search.

చంద్రవిలాపం : వేమిరెడ్డి చేజారిపోయాడే!

By:  Tupaki Desk   |   25 Feb 2018 6:28 PM GMT
చంద్రవిలాపం : వేమిరెడ్డి చేజారిపోయాడే!
X
వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి.. రెగ్యులర్ మీడియాలో వచ్చే రాజకీయ వార్తలను మాత్రమే ఫాలో అయ్యే వారికి ఈ పేరు పెద్దగా తెలియదు. ఎందుకంటే ఈయన గరిష్టంగా తెరవెనుకకే పరిమితం అవుతూ ఉంటారు. ఏ పార్టీకి తాను దన్నుగా ఉన్నప్పటికీ.. ఆయన తెర ముందుకు వచ్చే ప్రయత్నం చేయరు. తన వ్యాపారాలు - పరిశ్రమలు - విదేశాలలో విస్తృతంగా ఉండే వ్యాపారాల మీదనే ఆయన కన్ను ఉంటుంది. అలాంటి ఆయన ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యారు. వైసీపీ తరఫున ఆయన రాజ్యసభ ఎంపీ కాబోతున్నారు. అయితే ఆయన అబ్యర్థిత్వం గురించి ప్రచారంలోకి వచ్చిన తర్వాత.. చంద్రబాబునాయుడు తెగ పశ్చాత్తాప పడుతున్నాడని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అనవసరంగా వేమిరెడ్డి మన చేజారి పోయాడే అని ఆయన అనుకుంటున్నారట.

ఇందుకు సరైన కారణాలే ఉన్నాయి. ఎలాగంటే..

నెల్లూరు జిల్లాకు చెందిన వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి సహజంగా వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితుడు. ఆయన మరణించిన తర్వాత.. జగన్ పార్టీకి అనుకూలంగానే పనిచేస్తూ ఉండేవారు. ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగడానికి ఆయన ఎన్నడూ ఉత్సాహం కూడా చూపించలేదు. అయితే కాలక్రమంలో తెలుగుదేశం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వేమిరెడ్డి వారికి దగ్గరయ్యారు. చంద్రబాబునాయుడు ఆయనకు పెద్దహామీలే ఇచ్చారని ప్రచారం కూడా జరిగింది.

అయితే గతంలో రాజ్యసభ ఎంపీ ఎన్నికలు జరిగిన సందర్భంలో తెలుగుదేశం ఇద్దరు అభ్యర్థులనే మోహరించింది. ఆ సమయంలో తనకు మూడో ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని వేమిరెడ్డి చంద్రబాబును అభ్యర్థించారు. వైసీపీలోని ఎంపీలను తాను తన వైపు మళ్లించుకుని వారి ఓట్లను సంపాదించుకోగలనని, వారి సంగతి తాను చూసుకుంటానని తన పేరు ప్రకటించి, తెదేపాకు మిగిలిన ఓట్లు వేస్తే చాలునని వేమిరెడ్డి చంద్రబాబును కోరారు. అయితే అప్పట్లో ఒకసీటుకు తగిన బలం వైకాపాకు ఉండడంతో చంద్రబాబు ఒప్పుకోలేదు. పైగా వేమిరెడ్డి ఇండిపెండెంటుగా దిగినా తమ పార్టీ మద్దతు ఇవ్వడానికి అంగీకరించలేదు. దీంతో ఆయన సైలెంట్ అయిపోయారు.

ఈసారి ఆయన తిరిగి జగన్ పార్టీలో చేరిపోయారు. తండ్రికి సన్నిహితుడు కూడా కావడంతో.. జగన్మోహన్ రెడ్డి ఆయన పేరును రాజ్యసభకు ఎంపిక చేశారు. ఆయన తన పార్టీలోనే ఉండిఉంటే.. ఇప్పుడు వైకాపానుంచి ఎమ్మెల్యేలను లాక్కోడానికి బాగా ఉపయోగపడి ఉండేవాడే.. అనవసరంగా వేమిరెడ్డిని చేజార్చుకున్నామే అని చంద్రబాబు మధన పడుతున్నట్లుగా తెలుస్తోంది.