Begin typing your search above and press return to search.

తానా నిధుల వివాదం ముగిసినట్లేనా?

By:  Tupaki Desk   |   24 Oct 2016 5:09 PM GMT
తానా నిధుల వివాదం ముగిసినట్లేనా?
X
డైరెక్టుగా పాయింటుకు వచ్చేస్తే... ప్రవాసాంధ్రుల తరపున రూ.4.50 కోట్ల చెక్‌ ను అమెరికాలో ఏపీ ప్రతినిధి జయరాం కోమటి వైజాగ్‌ లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు‌కు అందజేశారు. అయితే... ఈ భారీ విరాళం వెనుక పెద్ద మతలబు ఉందని, వేరే ఉద్దేశం కోసం గతంలో సేకరించిన నిధులను తానా సభ్యుల అనుమతి - అంగీకారం లేకుండా ఈ విధంగా డైవర్ట్ చేశారనే ఆరోపణలు బలంగా వినిపించాయి. ఈ విషయాలపై తానా తాజాగా స్పందించింది!!

పూర్వపు విద్యార్థులంతా కలిసి విశాఖ హుదూద్ తుపాను బాధిత ప్రాంతాల్లో గృహాలు - పాఠశాలల నిర్మాణానికి తానా మాజీ అధ్యక్షుడు నన్నపనేని మోహన్ హయాంలో సుమారు రూ. 2 కోట్లు నిధులు సేకరించి తానా ఫౌండేషన్‌ కు అందజేశారు, ఇదే సమయంలో ఆ సొమ్ములు ఇప్పటికీ ఆయా ఖాతాల్లో పదిలంగానే ఉన్నాయని తానా అధ్యక్షుడు జంపాల చౌదరి తెలిపారు. ఈ నిధుల్లో సగం డిజిటల్ తరగతులకు - మిగిలిన సొమ్ము అంగన్‌ వాడీ కేంద్రాలకు వెచ్చించాలని తానా కార్యవర్గం జులై 13న నిర్ణయించినట్టు ఆయన చెబుతున్నారు. దీనికితోడు అమెరికా వ్యాప్తంగా పర్యటించిన తానా మాజీ అధ్యక్షుడు జయరాం మరో లక్షా 5 వేల డాలర్లను ప్రవాసుల నుంచి సేకరించగా - ఇదే క్రమంలో మరో 75 వేల డాలర్లకు ఎన్నారైల నుండి హామీలు కూడా లభించాయి.

ఇదిలావుండగా భారతదేశం - అమెరికా ప్రభుత్వాల నుండి సేవా కార్యక్రమాల నిర్వహణ కోసం తానాకు పన్ను మినహాయింపు వర్తిస్తుంది. దీంతో ఆ లక్షా 5వేల డాలర్లను తానా ఫౌండేషన్ ద్వారా భారత్‌ కు తరలించిన జయరాం... ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా తొలివిడతలో ఏపీలో 1000 పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ఏర్పాటు చేయాలని సంకల్పించారు. అంటే 1000 పాఠశాలలకు ఒక్కో స్కూలుకీ 45 వేల చొప్పున రూ.4.5 కోట్లన్న మాట. ఈ మేరకు హామీరూపంలో ఆ చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు. అంటే ఆ రూ.4.5 కోట్లు భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలకు ముందస్తు హామీ మాత్రమే!! ప్రభుత్వానికి ఆ రోజున విశాఖలో ఇచ్చిన అసలు మొత్తం సుమారు రూ.75లక్షలు (లక్షా 5 వేల డాలర్లు) మాత్రమే. ఈ క్రమంలో ఈ లక్షా 5వేల డాలర్లు కాకుండా అమెరికాలో తన పర్యటనల్లో ప్రవాసులు మరో 75 వేల డాలర్లు అందిస్తామని జయరాంకు వాగ్దానాలు చేశారట. ఆ నిధులు సేకరించిన అనంతరం వాటిని కూడా ప్రభుత్వానికి అందిస్తారని జంపాల చౌదరి వివరించారు. దీంతో ఏపీలో ప్రభుత్వ పాఠశాల్లో డిటిజల్ తరగతుల కోసం ఎన్నారైలు ఇచ్చిన విరాళాలపై మొదలైన రగడకు ఫుల్‌స్టాప్ పడిందని అంటున్నారు!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/