Begin typing your search above and press return to search.

బాబుకు అధ్య‌క్ష ప‌ద‌వుల ర‌చ్చ మొద‌లైంది

By:  Tupaki Desk   |   19 Jun 2017 9:24 AM GMT
బాబుకు అధ్య‌క్ష ప‌ద‌వుల ర‌చ్చ మొద‌లైంది
X
ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడుకు సొంత పార్టీ నేత‌ల నుంచే ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులు ఎదురవుతున్నాయి. ఇప్ప‌టివ‌రకు మంత్రుల స్థాయి నేత‌లు ప‌ర‌స్ప‌రం అవినీతి ఆరోప‌ణ‌లు చేసుకోవ‌డం - యువ మంత్రి అఖిల‌ప్రియ‌కు వ్య‌తిరేకంగా తెలుగుత‌మ్ముళ్లు తిరుగుబాటు జెండా ఎగ‌ర‌వేయ‌డం - ఎంపీగా ఉన్న సీనియ‌ర్ నేత జేసీ దివాక‌ర్ రెడ్డి ఎయిర్‌ పోర్ట్ సిబ్బందితో గొడ‌వ‌ప‌డ‌టం వంటి ఎపిసోడ్‌ల‌తో బాబు చిక్కుల్లో ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ త‌ల‌నొప్పుల‌కు టీడీపీ జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వుల ఎంపిక జ‌త‌క‌లిసిన‌ట్లు క‌నిపిస్తోంది.

పార్టీ జిల్లా సార‌థుల ఎంపికను ప్ర‌జాస్వామ ప‌ద్ద‌తిలో అభిప్రాయాల‌ను సేక‌రించి పూర్తి చేసేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్ర‌య‌త్నం చేశారు. ఐవీఆర్‌ఎస్‌ సర్వే ద్వారా జిల్లా అధ్యక్ష - ప్రధాన కార్యదర్శులను ఎంపిక చేశారు. అయితే దాదాపు పాత వారినే కొనసాగించడంతో ఆశావహులకు నిరాశ ఎదురైంది. దీనికి తోడు స్థానిక రాజ‌కీయాలు సైతం అధ్య‌క్ష అభ్య‌ర్థుల‌పై అసంతృప్తులు రేగేందుకు కార‌ణం అవుతున్నాయి. ఏపీ టీడీపీ నూత‌న జిల్లా అధ్య‌క్షుల్లో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా నామన రాంబాబు - పశ్చిమగోదావరికి తోట సీతరామలక్ష్మి - గుంటూరు జిల్లాకి జీవీఎస్‌ ఆంజనేయులు - ప్రకాశం జిల్లాకి దామచర్ల జనార్దన్‌ - నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా బీద రవిచంద్రయాదవ్‌ నియమితులయ్యారు. కృష్ణాజిల్లాకి బచ్చుల అర్జునుడును నియమించగా విజయవాడ అర్బన్‌ టీడీపీ అధ్యక్ష - ప్రధాన కార్యదర్శులను ప్రకటించలేదు. రాయలసీమలో కడప జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్‌ రెడ్డి - అనంతపురానికి బీకే పార్థసారథి - కర్నూలుకి సోమిశెట్టి వెంకటేశ్వర్లు - చిత్తూరుకి పులివర్తి మణిప్రసాద్‌ లను ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా అధ్యక్షురాలిగా గౌతు శిరీష - విజయనగరం జిల్లాకి మహంతి చిన్నమనాయుడు - విశాఖ అర్బన్‌ కి వాసుపల్లి గణేష్ - విశాఖ రూరల్‌ కి పంచకర్ల రమేష్‌ బాబు‌ను నియమించారు.

ఉత్తరాంధ్రలో ఒకరిద్దరిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలుస్తోంది. స్థానికేతరుడైన రమేశ్‌ బాబు‌ను విశాఖ రూరల్‌ అధ్యక్షుడిగా ఎలా నియమిస్తారని ప‌లువురు పార్టీ నేత‌లు ప్రశ్నిస్తున్నట్లు స‌మాచారం. అలాగే విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా చిన్నమనాయుడును సైతం పలువురు వ్యతిరేకిస్తున్నారని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. మండలస్థాయి నేతకు జిల్లా అధ్యక్ష పదవి ఎలా ఇస్తారని సీనియర్లు కొంద‌రు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు పార్టీ అధినేత చంద్ర‌బాబు సొంత జిల్లా అయిన‌ చిత్తూరులో కూడా అసంతృప్త జ్వాల‌లు రేగాయని స‌మాచారం. జిల్లాలో పదవులన్నీ ఒకే సామాజికవర్గానికి ఇవ్వడంపైనా అసంతృప్తి వ్యక్తమవుతోందని అంటున్నారు. మొత్తంగా ఒకింత సుదీర్ఘ క‌స‌ర‌త్తు చేసిన త‌ర్వాతే ప్ర‌క‌టించిన జిల్లా అధ్యక్షుల నియామకాలపై ఏపీ టీడీపీలో అసంతృప్తి స్వరం వినిపిస్తుండటంపై పార్టీ వ‌ర్గాలే అసంతృప్తికి లోన‌వుతున్నారు. మ‌రోవైపు ఏపీలో జిల్లా అధ్యక్షుల నియామక ప్రక్రియ పూర్తవడంతో త్వరలోనే తెలంగాణ జిల్లాల అధ్యక్షులను ప్రకటించేందుకు కసరత్తు జరుగుతోందని స‌మాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/