Begin typing your search above and press return to search.

చెట్లు.. సున్నితం.. చంద్రబాబు

By:  Tupaki Desk   |   29 July 2016 9:46 AM GMT
చెట్లు.. సున్నితం.. చంద్రబాబు
X
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చెట్ల మీద.. వాటి సంరక్షణ మీద విపరీతమైన అవగాహన.. ఆసక్తి పెరిగిన విషయం తెలిసిందే. పర్యావరణ పరిరక్షణ అన్న కాన్సెప్ట్ కొత్తదేం కాదు. చాలా పాతది. కానీ.. ఇంతకాలం పట్టించుకోని చంద్రుళ్లు ఇద్దరు చెట్ల పెంపకంపై ప్రత్యేక కార్యక్రమంగా ఏర్పాటు చేసి మరీ చెట్లను నాటుతున్నారు. తాజాగా ఒక రోజులో కోటి మొక్కలు నాటాలన్న కార్యక్రమాన్ని ఏపీ సర్కారు చేపట్టిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నూజివీడు సమీపంలోని సుంకొల్లు వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మొక్కల గురించి చంద్రబాబు చెప్పిన మాటలు కాస్త ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పాలి. చెట్లు చాలా సున్నితంగా ఉంటాయని.. వాటికి ప్రాణం ఉంటుందని.. నర్సరీల నుంచి తెచ్చినప్పుడు అవి తేరుకోవటానికి మూడు నాలుగు రోజులు పడుతుందని.. సున్నితమైన చెట్లను కాపాడుకోవాలంటూ చాలానే విషయాలు చెప్పుకొచ్చారు. దీనికి ముందు ఆయన రావి.. వేప మొక్కల్ని నాటారు.

చెట్లకు మనోభావాలు ఉంటాయని.. వాటిని గుర్తించాలని.. జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పారు. పర్యావరణం సమతుల్యంగా లేకపోతే కరవు.. వరదలు వంటివి వస్తాయని.. బహుమతులుగా చెట్లను ఇవ్వాలని సూచించారు. ఉన్నట్లుండి చెట్ల గురించి ఇన్ని కొత్త కబుర్లు చెబుతున్నచంద్రబాబు.. ఇకపై ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు.. సన్మాన కార్యక్రమాల్లో పూల దండలు వినియోగించకుండా.. కేవలం మొక్కలు ఇవ్వాలంటూ అధికారిక నిర్ణయం తీసుకోవచ్చు కదా. ప్రభుత్వ పరంగానే కాదు.. పార్టీ పరంగా కూడా ఏ స్థాయిలో సమావేశం జరిగినా పూలదండలు వాడకుండా మొక్కల్ని ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్న తర్వాత.. ఈ ‘‘సున్నితపు’’ మాటలు చెబితే బాగుంటుందేమో..?