Begin typing your search above and press return to search.

త‌మ్ముళ్ల డిమాండ్ల‌ను బాబు నెర‌వేరుస్తారా?

By:  Tupaki Desk   |   26 Feb 2017 5:26 AM GMT
త‌మ్ముళ్ల డిమాండ్ల‌ను బాబు నెర‌వేరుస్తారా?
X
తెలుగుదేశం పార్టీ అధినేత‌ - ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్రేమ పూర్వ‌క ఒత్తిడిని ఎదుర్కుంటున్నార‌ని అంటున్నారు. మండలిలో స్థానిక సంస్థల కోటా కింద నామినేషన్‌ దాఖలకు గడువు ఈ నెల 28తో ముగిస్తున్న నేప‌థ్యంలో అధికార పార్టీలో ఎమ్మెల్సీ ఎన్నికలు చిచ్చురాజేస్తున్నాయి. గతంలో ఎన్నడూలేనిస్థాయిలో ఈసారి తెలుగుదేశం నుంచి అభ్యర్థిత్వం కోసం పెద్దసంఖ్యలో పోటీ పడుతున్నారు. ఇటీవల పలు తటస్థ నాయకుల్తో పాటు తెలుగుదేశం మాజీ నేతల్ని కూడా పార్టీలోకి చేర్చుకున్నారు. వీరితోపాటు గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ లభించని కొందరు, ఓటమిపాలైన మరికొందరు కూడా మండలి టికెట్లను ఆశిస్తున్నారు. దీంతో ఇక అభ్యర్థుల ఖరారుకు ముహూర్తం ముంచుకొస్తోందని భావించిన అధినేత ఆదివారం ప్రత్యేకంగా పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులోనే స్థానిక సంస్థల కోటాతో పాటు ఎమ్మెల్యే కోటా నుంచి కూడా అభ్యర్థుల ఎంపికకు కసరత్తులు చేస్తారు.

ఇప్పటికే ఎమ్మెల్యే కోటా నుంచి త‌న త‌న‌యుడు నారా లోకేష్‌ పేరును చంద్ర‌బాబు ఖరారు చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.స్థానిక సంస్థల కోటాలో ఇప్పటికే కడప జిల్లా అభ్యర్థిగా బీటెక్‌ రవి పేరును చంద్రబాబు ఖరారు చేశారు. ఆ జిల్లాకు చెందిన ఇతర నాయకులంతా కూడా రవికే మద్దతుగా నిలబడ్డారు. మరో ఇద్దరు అభ్యర్థులు బలంగా పోటీలో ఉన్నప్పటికీ రవికున్న మద్దతును వారు సాధించలేకపోవడంతో దాదాపుగా రవి పేరే ఖరారైంది. కాగా మిగిలిన 8స్థానాలకు సంబంధించి విస్తృతస్థాయి చర్చ జరగనుంది. ఇటీవల పార్టీలో చేరిన ఆనం బ్రదర్స్‌ నెల్లూరు జిల్లా నుంచి అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. వీరితో పాటు ప్రస్తుతం పదవీ విరమణ చేయనున్న ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి కూడా అభ్య‌ర్థిత్వం కోసం పోటీలో ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ మరోసారి అవకాశం దక్కించుకునే పరిస్థితు లున్నాయి. కాగా ఇప్పుడు మరోస్థానానికి పోటీ అధికంగానే ఉన్నప్పటికీ క్షత్రియ సామాజిక వర్గం నుంచి అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు అభ్యర్థిత్వం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. వరుసగా రెండుసార్లు పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన జ్యోతుల చంటబ్బాయి కూడా గట్టిగానే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ జిల్లా నుంచి ప్రస్తుతం చౌదరి సామాజికవర్గీయుడు ఈ కోటాలో ఎమ్మెల్సీగా ఉండగా ఈసారి కాపు సామాజిక వర్గీయునికే కేటాయించాలని పార్టీ నిర్ణయిం చినట్లు సమాచారం. శ్రీకాకుళం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావు - అప్పలనాయుడుల మధ్య పోటీతీవ్రంగా ఉంది.

అనంతపురంలో దీపక్‌ రెడ్డి - అబ్దుల్‌ ఘని - గడ్డం సుబ్రహ్మణ్యంలు పోటీపడుతున్నారు. ఇక్కడ్నుంచి రెడ్డి సామాజిక వర్గీయులకే అవకాశం కల్పించాలన్న ఆలోచన వ్యక్తమౌతోంది. కర్నూలు జిల్లాలో ప్రస్తుత ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణినే కొనసాగించే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఈ జిల్లాలో గ్రూపు తగాదాలధికంగా ఉండడంతో కొత్త సమస్య తలకెత్తుకునేందుకు పార్టీ ప్రయత్నించదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే సోమిశెట్టి వెంకటేశ్వర్లు కూడా కర్నూలు నుంచి టికెట్‌ ఆశిస్తున్నారు. కానీ శిల్పా వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయి. చిత్తూరు జిల్లాలో నరేష్‌ కుమార్‌ రెడ్డి - హేమలతల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఈ జిల్లాలో మహిళకే ఎక్కువ అవకాశాలుంటాయని అంచనాలేస్తున్నారు.ఇలా ఉంటే ఎమ్మెల్యే కోటా నుంచి అభ్యర్థిత్వం కోసం సీనియర్ల ఒత్తిడి తీవ్రంగా ఉంది. మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావుతోపాటు దివి శివరాం - వర్ల రామయ్య - గొట్టిపాటి రామకృష్ణ - పొంగినేని వికాస్‌ - ముళ్ళపూడి రేణుక - పంచుమర్తి అనురాధ - శోభా హైమావతి - పుష్పరాజ్‌ తదితరులు ఎమ్మెల్సీ స్థానాల్ని ఈ కోటా నుంచి ఆశిస్తున్నారు. ఇటీవలె కరణం బలరాం ముఖ్యమంత్రిని కలసి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాల్సిందిగా కోరారు.

ప్రస్తుతం స్థానిక సంస్థల్నుంచి తొమ్మిది స్థానాలకు సభ్యుల్ని ఎన్నుకోవాలి. ఇందులో పశ్చిమగోదావరి నుంచి రెండు స్థానాలుంటే తూర్పుగోదావరి - శ్రీకాకుళం - నెల్లూరు - కర్నూల్‌ - కడప - అనంతపురం - చిత్తూరు జిల్లాల్నుంచి ఒక్కో స్థానానికి అభ్యర్థిని ఖరారు చేయాలి. అలాగే ఏడు స్థానాలు ఎమ్మెల్యే కోటా నుంచి ఖాళీ అవుతుంటే తిరిగి ఎన్నికల్లో ఖచ్చితంగా ఐదు స్థానాలు తెలుగుదేశానికి లభిస్థాయి. ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని బట్టి ఒక స్థానం వైకాపా ఖాతాలో చేరుతుంది. కాగా వైకాపా నుంచి తెలుగుదేశంలో చేరిన ఎమ్మెల్యేల ఓట్లు ఏడో అభ్యర్థి విషయంలో కీలకంగా మారతాయి. కానీ మొత్తం స్థానాల్ని కైవసం చేసుకుంటామన్న ధీమాకు అనుగుణంగానే పావులు కదుపుతోంది. ఈ నేప‌థ్యంలో పార్టీ నేత‌లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఇప్పటికే 160కిపైగా దరఖాస్తులొచ్చిపడ్డాయి. వీటిని ప్రాథమికంగా పరిశీలించే బాధ్యతను పార్టీ కార్యాలయ కార్యదర్శికి అప్పగించారు. వీటిపై ఆదివారం ఉదయమే చంద్రబాబు స్వయంగా పరిశీలన జరుపుతారు. అనంతరం పొలిట్‌ బ్యూరో సమావేశంలో ఈ దరఖాస్తుదార్ల వివరాల్ని వెల్లడించి ఆ తర్వాత చర్చలు జరుపుతారు. ఈ నేప‌థ్యంలో మిగిలిన అభ్యర్థుల పేర్లను ఆదివారం ఖరారు చేసినప్పటికీ వెంటనే ప్రకటించే అవకాశాలైతే లేవు. మరోసారి పరిశీలన జరిపి సోమవారం సాయంత్రంలోగా ప్రకటన చేయాలని పార్టీ అధిష్ఠానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/