Begin typing your search above and press return to search.

అమరావతికి అసలెన్ని వేల ఎకరాలు కావాలి?

By:  Tupaki Desk   |   24 May 2016 7:53 AM GMT
అమరావతికి అసలెన్ని వేల ఎకరాలు కావాలి?
X
ఏపీ ప్రజల కలల రాజధాని అమరావతికి ఎన్ని ఎకరాలు కావాలి? ఈ ప్రశ్నకు ఎవరికి వారు చాలానే సమాధానాలు చెబుతుంటారు. అయితే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లుగా 40వేల ఎకరాల వరకూ అవసరమన్న మాటకు ఎక్కువమంది సీమాంధ్రుల నుంచి ఆమోదం లభించిందనే చెప్పాలి. అమరావతి అంటే నాలుగు ప్రభుత్వ భవనాల ఏర్పాటు ఎంతమాత్రం కాదన్న బాబు మాటను అందరూ అవుననేవాళ్లే. అందుకే.. అమరావతి కోసం చంద్రబాబు చేపట్టిన భూసమీకరణ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించటంతో పాటు వేలాదిమంది రైతుల నుంచి ఆమోదం లభించి.. తమ భూముల్ని ఇచ్చేసిన పరిస్థితి. చాలా కొన్ని ప్రాంతాల్లో తప్పించి.. అమరావతి పరిధిలోని మిగిలిన ప్రాంతాల రైతులు వేలాది ఎకరాలు ఇచ్చేయటం మర్చిపోకూడదు.

ఏపీ ప్రభుత్వ అంచనాలకు తగ్గట్లే అమరావతి రైతుల నుంచి ఆశించినంత స్థాయిలో భూమి రావటం ఒక ఎత్తు అయితే.. ఇన్నేసి వేల ఎకరాల భూసమీకరణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. శాంతియుతంగా పూర్తి కావటం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఇదిలా ఉంటే.. ఏపీ సర్కారు తాను మొదటి నుంచి చెప్పినట్లు 40 వేల ఎకరాలకు పరిమితం కాకుండా మరో 32 వేల ఎకరాల అటవీ భూముల మీద దృష్టి పెట్టటం గమనార్హం.

ఇక్కడే ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏపీ సర్కారు చేపట్టిన భూసమీకరణకు వ్యతిరేకంగా ఉండవల్లి.. పెనుమాక గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన చేస్తున్న వేళ.. వారి వాదనను వినేందుకు వెళ్లిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రైతులను ఉద్దేశించి ప్రసంగించే సమయంలో ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు. సార్వత్రిక ఎన్నికల వేళ.. చంద్రబాబుకు తాను మద్దుతు ఇచ్చే సమయంలో.. రాజధాని విషయంలో భూసేకరణ ఎలా చేస్తారన్న విషయానికి.. తాను రైతుల నుంచి ఒక్క ఎకరా కూడా తీసుకోనని.. కేంద్రం నుంచి ప్రత్యేక ఆదేశాలు జారీ అయ్యేలా చేసి.. అటవీ భూముల్ని రాజధాని నిర్మాణం కోసం చేపడతానని చెప్పారన్నారు.

అంటే.. బాబు మొదటి ప్లాన్ ప్రకారం.. అమరావతి దగ్గర్లోని అటవీ భూముల్ని రాజధాని నిర్మాణానికి వినియోగించుకోవాలని అనుకున్నట్లు అర్థమవుతుంది. కానీ.. ఆ ప్లాన్ ఎందుకు మారిందో కానీ.. అమరావతి ప్రాంత రైతుల నుంచి భూసేకరణను మొదలు పెట్టారు. అది విజయవంతంగా పూర్తి అయ్యాక.. మొదట నుంచి చెప్పినట్లుగా రైతుల నుంచి సేకరించిన భూమిలో రాజధాని నిర్మాణం పూర్తి చేయకుండానే.. మరో 32 వేల ఎకరాల అటవీ భూములు కోసం కేంద్రంతో మంతనాలు మొదలు పెట్టటం ఆసక్తికరంగానే కాదు.. ఆశ్చర్యాన్ని రేకెత్తించక మానదు. అటవీ భూముల వినియోగం కోసం ఏపీ సర్కారు చేస్తున్న ప్రయత్నాలకు జాతీయ అటవీ సలహా మండలి మోకాలడ్డుతోంది. ఇప్పటికే కొర్రీల మీద కొర్రీలు పెడుతూ ఏపీ సర్కారుకు చెక్ పెడుతున్న పరిస్థితి.

తాజాగా రాజధాని కోసం అటవీ భూముల్ని ఎందుకు వాడాలనుకుంటున్నారంటూ ప్రశ్నించటమే కాదు.. దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నల్ని సంధించింది. నిజానికి ఈ రీతిలో ప్రశ్నలు అడగటం.. దానికి ఏపీ సర్కారు తరఫున సీఆర్డీఏ సమాధానాలు చెప్పటం ఒక అలవాటుగా మారింది. జాతీయ అటవీ సలహా మండలి అడిగిన ప్రశ్నలకు సీఆర్డీఏ సూటిగా సమాధానాలు చెప్పలేని వైనం కనిపిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. అమరావతికి దగ్గర్లోని అటవీ భూముల్ని రాజధాని వినియోగానికి ఇచ్చిన పక్షంలో.. ప్రత్యామ్నాయంగా కడప - ప్రకాశం జిల్లాల్లోని 13వేల హెక్టార్లలో అడవుల్ని పెంచుతామంటూ ఏపీ సర్కారు ప్రతిపాదిస్తోంది. ఈ ప్రతిపాదనల సంగతి ఎలా ఉన్నా.. ముందు రైతుల నుంచి సేకరించిన వేలాది ఎకరాల్ని రాజధాని అవసరాల కోసం వినియోగిస్తూ.. మరోవైపు తానిప్పుడు చెబుతున్న ప్రకాశం.. కడప జిల్లాల్లో అడవుల్ని వృద్ధి చేస్తే బాగుంటుంది. రైతుల నుంచి సేకరించిన భూముల్ని పూర్తిస్థాయిలో వినియోగించిన తర్వాత.. అటవీ భూములకు సంబంధించి ప్రాజెక్టు పనులు.. విధివిధానాల్ని తెర మీదకు తెస్తే బాగుంటుంది. అంతేకానీ.. అదే పనిగా వేలాది ఎకరాలు రాజధాని కిందకు సేకరించుకుంటూ వెళ్లటం కొత్త సందేహాలకు తావిస్తుందన్న కీలక విషయాన్ని చంద్రబాబు గుర్తిస్తే మంచిది.