Begin typing your search above and press return to search.

బాబు బ‌ల‌హీన‌ప‌డుతున్నాడా?

By:  Tupaki Desk   |   27 July 2016 5:54 AM GMT
బాబు బ‌ల‌హీన‌ప‌డుతున్నాడా?
X
ఏపీ సీఎం - టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడులో పోరాట ప‌టిమ త‌గ్గిపోతోందా? స‌ందర్భం ఏదైనా సై అంటూ ముందుకువెళ్లి కార్య‌క‌ర్త‌ల‌ను న‌డిపించిన బాబు ఇపుడు ఎందుకు రాజీమార్గ‌మే...రాజ‌మార్గం అన్న‌ట్లుగా మాట్లాడుతున్నారు? ఏపీకి కీల‌క‌మైన ప్ర‌త్యేక హోదా - వివిధ అంశాలకు చెందిన నిధుల విష‌యంలో చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌ను చూసి ఇపుడీ కొత్త చ‌ర్చ మొద‌లైంది.

ఏపీ కేబినెట్ భేటీలో - అనంత‌రం మీడియా స‌మావేశంలో చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో పోరాడలేమని చంద్రబాబునాయుడు రాష్ట్ర మంత్రుల‌కు తెలిపారు. కేంద్రాన్ని అడగడం తప్ప మరోమార్గం లేదని ఆయన అన్నారు. హోదాతో పాటు ఆర్థికలోటును భర్తీ చేస్తామని రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంటు సాక్షిగా అందరూ హామీనిచ్చారని, వాటిని అమలు చేయాలని ప‌దేప‌దే పోరాటం చేయ‌నున్న‌ట్లు తెలిపారు. కేంద్రంతో పోరాటం చేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదని మీడియాతో చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని వెంకయ్యనాయుడు - జైట్లీ అప్పుడు గట్టిగా కోరారని, ప్రస్తుత ప్రభుత్వం వాటిని అమలు చేయాల్సిఉందని చెప్పారు. ప్రత్యేక హోదాతో పాటు, విభజన సందర్భంగా ప్రకటించిన ప్యాకేజీలన్నీ రాష్ట్రానికి ఇవ్వాలన్నారు. రాజధాని నిర్మాణానికి నిధులిస్తామన్నారని, వాటిని వెంటనే ఇవ్వాలని కోరారు. విశాఖపట్నం రైల్వేజోన్‌ - వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరుతున్నామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రమూ పడనన్ని ఇబ్బందులు ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే ఎందుకు పడాలని ఆయన ప్రశ్నించారు. వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని అన్నారు. అలాగే తమకు చట్టపరంగా ఇవ్వాల్సిన వాటిని ఇవ్వాలని గట్టిగా అడుగుతున్నామని అన్నారు. దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో సమానంగా వచ్చే వరకూ చేయూత నివ్వాలని కోరుతున్నామన్నారు.

పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా నిధులు రాలేదని చంద్ర‌బాబు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. అలాగే రెండు రాష్ట్రాల మధ్య ఉండే ఇబ్బందులు - తగాదాలను కేంద్రమే పరిష్కరించాలని కోరారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే ఉద్దేశంతోనే రాష్ట్రావతరణ దినోత్సవాలు జరుపుకోవడం లేదని బాబు తెలిపారు. పార్లమెంటులో కాంగ్రెస్‌ పార్టీ పెట్టిన ప్రైవేటు బిల్లు ఆర్థికపరమైంది కాదని, ఇది ఆమోదం పొందినా రాష్ట్రానికొచ్చేదేమీ ఉండదని ఆర్థికశాఖ చెబుతోందన్నారు. అన్ని పార్టీల కేంద్ర కార్యాలయాలన్నీ ఢిల్లీలోనే ఉన్నాయని, రాష్ట్రంలో ఉన్నవన్నీ బ్రాంచీ కార్యాలయాలేనని, అక్కడ అడగకుండా నన్ను అడగడం వల్ల ఉపయోగం లేదని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. కేంద్రం పుష్కరాలకు నిధులివ్వడం లేదని, నీతిఅయోగ్‌ కూడా తిరస్కరించిందని వ్యాఖ్యానించారు.