భారీ భవనం ఓకే.. ఖర్చు లెక్కేంది బాబు?

Thu May 18 2017 11:18:57 GMT+0530 (IST)

కలలకేం ఎన్నైనా కనేయొచ్చు. ఎంత విచ్చలవిడిగా కలలు కనేసినా పోయే నష్టమేమీ లేదు. కానీ.. ఆ కలల్ని సాకారం చేసుకోవాలన్నప్పుడే అసలు సమస్య. అయితే.. భారీగా కష్టపడాలి.. లేదంటే ఆ స్థాయిలో ఖర్చు చేయాలి. కలల్ని సాకారం చేసుకునేందుకు వీలుగా భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం ఇప్పుడు ఏపీకి ఉందా? అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. అవసరం ఉన్న దాని కోసం ఎంత ఖర్చు చేసినా ఫర్లేదు. కానీ.. ఆర్భాటం కోసమో.. అద్భుతంగా ఉండాలని ఆవిష్కరించే ప్రయత్నంలో భాగంగా వేలాది కోట్ల రూపాయిల విలువైన ప్రజాధనాన్ని ఖర్చు చేయటంలో అర్థం లేదు.  

కానీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజా మాటలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటాయి. విభజన నేపథ్యంలో ఏపీ ఎదుర్కొంటున్న తీవ్రమైన నిధుల సమస్య ఆయన ఓ పట్టాన పట్టించుకోరు. మొన్నటివరకూ రాజధానిలో తాత్కాలిక కట్టడాల కోసం వందల కోట్లు ఖర్చు చేసిన ఆయన ఇప్పుడు శాశ్విత నిర్మాణాల కోసం వేలాది కోట్లు ఖర్చు చేసే ప్రయత్నాల్ని షురూ చేశారు.

అమరావతిలో నిర్మించాలని భావిస్తున్న అసెంబ్లీ భవనం మకుటాయమానంగా తీర్చి దిద్దాలని ఏపీ సర్కారు భావిస్తోంది. నిజానికి ఇదేమీ తప్పు ఆలోచన ఎంతమాత్రం కాదు. కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో నిధుల కొరత తీవ్రంగా వెంటాడుతున్న తరుణంలో భారీ కలల్ని ఆవిష్కరించటంలో అర్థం ఉందా? అన్నదే అసలు ప్రశ్న.

అమరావతిలో నిర్మించాలని భావిస్తున్న అసెంబ్లీ భవనానికి సంబంధించిన ఆలోచనల్ని తాజాగా ఆయన బయటపెట్టారు. ఏపీ అసెంబ్లీని 160 ఎకరాల్లో నిర్మించనున్నారని.. ఇందులో కేవలం 20 శాతం మాత్రమే భవనాల నిర్మాణం చేసేసి.. మిగిలిన 140 ఎకరాల జల.. హరిత వనరుల కోసం వినియోగిస్తారని చెబుతున్నారు. ఏపీ అసెంబ్లీ భవనం అత్యంత ఆకర్షణీయంగా.. రాష్ట్రానికి వన్నె తెచ్చేలా ఉండాలన్న బాబు తీరుకు తగ్గట్లే త్వరలోనే పలు డిజైన్లను సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు.

సెక్రటేరియట్ భవనాన్ని ఎనిమిది నుంచి పది అంతస్థులతో నిర్మించాలని.. కనీసం ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సుమారు 26 వేల మంది ఉద్యోగులు సౌకర్యవంతంగా పని చేసుకోవటానికి వీలుగా నిర్మాణాలు నిర్మించాలని  భావిస్తున్నట్లు చెబుతున్నారు. నగర ముఖ్య కూడలి నుంచి సచివాలయం వరకూ డ్రైవర్లు లేని ఎలక్ట్రికల్ బస్సులు ఉంటాయని.. ఆడ్మినిస్ట్రేటివ్ నగరంలో ఒక చోట నుంచి మరో చోటుకు మధ్య దూరం కేవలం ఐదు నిమిషాల కాలినడకే ఉంటుందంటున్నారు.

రాజధానిలో ఫ్లైఓవర్లు లేనిదే నగరానికి ఆకర్షణ ఉండదంటూ చెబుతున్న అధికారులు.. ప్రపంచంలో అత్యుత్తమంగా ఉన్న తొలి వంద ఫైఓవర్లను పరిశీలించి.. అత్యుత్తమ డిజైన్లను తీసుకోవాలన్న మాటను బాబు అండ్ కో చెప్పటం కనిపిస్తుంది. రాజధాని నగరం ఎలా ఉంటుందో కళ్ల ముందు సినిమా కనిపించేలా మాటలు చెబుతున్నదంతా బాగానే ఉన్నప్పటికీ.. ఇలాంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు ఎంత? వాటికి సంబంధించిన నిధుల్ని ఎక్కడ నుంచి తెస్తారన్నది అసలు ప్రశ్న. దీనికి సంతృప్తికర సమాధానం చెప్పిన తర్వాత.. ఈ భారీ ఆకృతుల గురించి కలలు కంటే బాగుంటుందేమో. లేకుంటే.. బాబుగారి భారీ ముచ్చట తీర్చటానికి వేల కోట్ల రూపాయిల విలువైన ప్రజాధనం అవసరమవుతుందన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది.