Begin typing your search above and press return to search.

కొత్త బుకాయింపు : అడగకుండా ఇచ్చారంట

By:  Tupaki Desk   |   23 Nov 2017 1:00 PM GMT
కొత్త బుకాయింపు : అడగకుండా ఇచ్చారంట
X
పోలవరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలినుంచి కూడా అనేక అర్థ సత్యాలతో ప్రజలను ఒక రకమైన మాయలో ఉంచి మభ్యపుచ్చడానికి ప్రయత్నిస్తూ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. బుధవారం నాడు శాసనసభలో కూడా ఆయన మరోసారి ఇదే ప్రయత్నం చేశారు. పోలవరం ప్రాజెక్టు అనివార్యంగా ఆలస్యం అవుతున్నదనే సంగతి ఇప్పుడు దాదాపుగా ప్రజలందరికీ కూడా అర్థమైపోతోంది. ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేకుండానే.. వారు వాస్తవాల్ని గ్రహిస్తున్నారు. చంద్రబాబునాయుడు ఎన్ని మాటలు చెబుతున్నప్పటికీ.. శాసనసభలో ఎమ్మెల్యేలు అందరికీ లైవ్ లో పోలవరం ప్రాజెక్టు చూపించి.. ఏదో పనులు జరుగుతున్నట్లుగా నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ.. ప్రజలు మాత్రం ఆయన చెప్పిన గడువులోగా చెప్పినంత వరకు ప్రాజెక్టు పూర్తవుతుందనే విశ్వాసాన్ని కోల్పోయారు. కేంద్రం పోలవరం విషయంలో ఎలా స్పందిస్తున్నది. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నది అనే సంగతులు అందరికీ తెలుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పనులు నిలిపేయాల్సిందిగా పురమాయించిన సంగతి.. నిధులకు బ్రేకులు పడుతున్న సంగతి అన్నీ ప్రజలు గుర్తిస్తున్నారు. చంద్రబాబు చెబుతున్నంత వేగంగా పనులు జరిగే ఛాన్సులేదని గ్రహిస్తున్నారు.

ఇలాంటి నేపథ్యంలో జాతీయ ప్రాజెక్టు నిర్వహణను తాను నెత్తిన వేసుకున్న పాపానికి ఈ జాప్యం జరుగుతున్నదనే చెడ్డపేరు తలకు చుట్టుకుంటుందనే భయం చంద్రబాబులో మొదలైనట్టుంది. అందుకే ఆయన ఇప్పటినుంచే తప్పించుకునే ధోరణిని ప్రకటిస్తున్నారు. పోలవరం పనుల నిర్వహణ అనే బాధ్యతను తాను కేంద్రంనుంచి తీసుకోలేదని, తాను ఆ పనిచేస్తా అని తనంతగా అడగనేలేదని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. కేంద్రమే తనను సంప్రదించి.. రాష్ట్ర ఆధ్వర్యంలో పనులు జరుగుతూ ఉంటే.. స్పీడుగా జరుగుతాయని నచ్చజెప్పి.. పనులు నిర్వహించే పూచీ అప్పగించినట్లుగా ఆయన మాటలు ఉన్నాయి.

నిజానికి జాతీయ ప్రాజెక్టు - కేంద్రం నిధులిస్తోంటే.. నిర్మాణం రాష్ట్రం చేపట్టడం ఏంటనే విషయంలో కేంద్రానికి విపరీతమైన అసంతృప్తి ఉన్నట్లుగా గతంలో అనేక వార్తలు వచ్చాయి. అది నిజమే అయితే.. చంద్రబాబు చెబుతున్నది బుకాయింపు అవుతుంది. కేంద్రమే బతిమాలి.. నిర్మాణ బాధ్యత చూడాల్సిందిగా చంద్రబాబును కోరి ఉంటే.. కేవలం నిధుల విడుదలలో వారెందుకు పట్టించుకోకుండా ఉంటారు? కనీసం, నిర్మాణంలో ఆయన చెబుతున్న సలహాలను - ప్రతిపాదనలను ఎందుకు తిరస్కరిస్తూ ఉంటారు? అనేది అందరి మదిలో మెదలుతున్న సందేహంగా ఉంది. మరి వీటిని చంద్రబాబు ఎలా నివృత్తి చేస్తారో ఏంటో?