జనసేన నుంచి వచ్చెయ్.. ఆయనకు బాబు పిలుపు!

Tue Mar 26 2019 22:29:07 GMT+0530 (IST)

జనసేన పార్టీలోకి చేరి.. ఏకంగా నాలుగు టికెట్లను పొందిన ఎస్పీవై రెడ్డికి చంద్రబాబు నాయుడు నుంచి పిలుపు అందింది. బహిరంగంగానే చంద్రబాబు నాయుడు ఎస్పీవై రెడ్డికి పిలుపునిచ్చారు. తిరిగి తెలుగుదేశం పార్టీలోకి రావాలని.. వచ్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయం కోసం పని చేయాలని ఎస్పీవై రెడ్డికి పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు. నంద్యాల ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఎస్పీవై రెడ్డికి ఈ మేరకు పిలుపునిచ్చారు.తెలుగుదేశం పార్టీలో తనకు తన కుటుంబీకులు ఎవరికీ టికెట్ దక్కకపోవడంతో ఎస్పీవై రెడ్డి జనసేనలోకి చేరిన సంగతి తెలిసిందే. జనసేనలోకి చేరిన ఆయన ఏకంగా నాలుగు టికెట్లను దక్కించుకున్నారు.

నంద్యాల ఎంపీ టికెట్ తో పాటు.. నంద్యాల ఎమ్మెల్యే - బనగానపల్లె - శ్రీశైలం ఎమ్మెల్యే జనసేన టికెట్లను సైతం ఎస్పీవై రెడ్డి కుటుంబీకులు దక్కించుకున్నారు. బనగానపల్లె - శ్రీశైలం నుంచి ఎస్పీవై రెడ్డి కూతుర్లు పోటీ చేస్తున్నారు. నిన్నలా మొన్న జనసేనలోకి చేరిన ఎస్పీవై రెడ్డి కుటుంబానికి ఇలా ఏకంగా నాలుగు టికెట్లు దక్కడంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు.

ఇంతలోనే.. చంద్రబాబు నాయుడు ఎస్పీవై రెడ్డిని తిరిగి రావాలని పిలవడం విశేషం. వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ల కోసం పని చేయాలని.. తగిన ప్రాధాన్యత అని బాబు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. మరి ఇప్పటికే ఫిరాయింపు నేతగా ముద్రపడింది ఎస్పీవైకి. ఆయన - వారి కుటుంబీకులు జనసేన తరఫు నుంచి  నామినేషన్లు కూడా దాఖలు చేశారు. ఇలాంటి నేపథ్యంలో బాబు పిలుపుకు ఎస్పీవై ఎలా స్పందిస్తారో!