Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబుకు కుప్పం తిప్ప‌లు....

By:  Tupaki Desk   |   31 Aug 2015 6:36 AM GMT
చంద్ర‌బాబుకు కుప్పం తిప్ప‌లు....
X
తెలుగుదేశం అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు కొత్త స‌మ‌స్య మొద‌ల‌యింది. న‌వ్యాంద్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ఏపీ ప్ర‌పంచ స్థాయి రాజ‌ధాని నిర్మాణానికి సుమారు 36,000 ఎక‌రాల భూమిని సేక‌రించిన బాబుకు ఇపుడు దాదాపు 400 ఎక‌రాలు చుక్క‌లు చూపిస్తున్నాయి. అది కూడా రాజ‌ధాని విష‌యంలోనో లేదా రాజ‌ధానికి భూములు ఇవ్వ‌డంలోనే అనుకునేరు. కానే కాదు. బాబు ఏక‌చ‌త్రాధిప‌త్యంగా ఏలుతూ వ‌స్తున్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో కుప్పం నియోజకవర్గం పరిధిలోని శాంతిపురం మండలం కడపల్లి ప్రాంతానికి ఆనుకుని ఉన్న వ్యవసాయ, డీకేటి భూముల్లో ఎయిర్ పోర్టు నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం భూ సేక‌ర‌ణ‌ను చంద్ర‌బాబు నేతృత్వంలోని ఏపీ స‌ర్కారు మొద‌లుపెట్టింది. ఈ క్రమంలో గడచిన ఆరు నెలల నుంచి అక్కడ స్థల సేకరణ జరుగుతూనే ఉంది. భూములు ఇవ్వాల్సిన స్థానికులు అధికారులను అడ్డుకుంటూనే ఉన్నారు. దీంతో విమానాశ్రయానికి స్థల సేకరణ ఇప్పుడు అధికారులకు తలప్రాణం తోకకు వచ్చిందంటే ఇక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ప్రజలు వ్యతిరేకిస్తున్నారో అర్థం చేసుకోవ‌చ్చు.

తాజాగా ఎయిర్ పోర్ట్ అధికారులు ఎయిర్ ట్రాఫికింగ్, సిగ్నలింగ్ వ్యవస్థకు సంబంధించిన ఎయిర్‌ ట్రాఫిక్ కంట్రోల్ క‌వ‌ర్ (ఏటిసి) టవర్ నిర్మాణం పనుల పరిశీలనకు వచ్చిన అధికారులకు చుక్కెదురైంది. ప్రధానంగా ఇక్కడ ఉన్న రైతులు తమ విలువైన భూముల్ని ఇచ్చేది లేదంటు ఎదురు తిరుగుతున్నారు. తమ ప్రాణాలైనా ఇస్తాం కానీ తమ భూముల్ని ఇవ్వ‌బోమ‌ని తెగేసి చెప్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఉన్న తమకు ఎయిర్ పోర్ట్ నిర్మాణం పేరుతో మనశ్శాంతి లేకుండా చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. గ్రామానికి సరఫరా చేస్తున్న త్రాగునీటిలోనే కాస్త విషమిచ్చి తమను చంపేసిన తర్వాత తమ భూములు లాక్కోవాలంటున్నారు. మొత్తంగా కుప్పం నియోజకవర్గంలో ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన భీష్మ ప్రతిజ్జ నెరవేరేట్టు కన్పించడం లేదు.