తమ్ముళ్లకు బాబులోకేష్ వరుస షాకులు

Mon Mar 20 2017 19:22:02 GMT+0530 (IST)

ఏపీ టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు - ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలతో టీడీపీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. తమ నాయకుడు - భవిష్యత్ నేత తీరు పార్టీని-ప్రభుత్వాన్ని పదిమందిలో పలుచన అయ్యే రీతిలో ఉన్నాయని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. ఇంతకీ బాబు-చినబాబుపై ఏకకాలంలో అంత ఆగ్రహం వ్యక్తం చేసేందుకు కారణం ఏమిటంటే వేదిక అయిన చంద్రబాబు - లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలే.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఒకింత అనర్గళ ఉపన్యాసంలో నోరు జారారు. “ఈ రోజు భారతదేశం మొత్తంమీద ఒకసారి చూస్తే అవినీతిలో గానీ - అభివృద్ధిలో గానీ మొదటిస్థానంలో మనం ఉన్నాం” అన్నారు. ఈ ప్రకటనతో షాక్ తిన్న ఎమ్మెల్యేలు చంద్రబాబు వైపు చూశారు. ఎక్కడో తేడా కొట్టిందనే విషయాన్ని గమనించిన సీఎం చంద్రబాబు అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. అవినీతిని దూరం చేశామని ప్రకటించారు. సమర్థవంతమైన పరిపానలకు ఏపీ కేరాఫ్ అడ్రస్ అయిందని ప్రకటించుకున్నారు.

కాగా తన ఘనతను చాటుకునేందుకు ప్రకటన చేసి ఇరుకున పడటం చంద్రబాబు విషయంలో ఇదే మొదటి సారి కాదు. గతంలో తిరుపతి ఎన్నికల సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను భారతదేశంలో నెంబర్ వన్ అవినీతి రాష్ట్రంగా నిలబెడతానని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా అవాక్కవడం హాజరైన వారి వంతు అయింది. తాజాగా అదే పరిస్థితి ఎదురయింది. ఇదిలాఉండగా...గతంలో చంద్రబాబు కుమారుడు లోకేష్ కూడా పార్టీ సభలో మాట్లాడుతూ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. “ అవినీతి-బంధుప్రీతి-కులపిచ్చి- మతపిచ్చి ఉన్న పార్టీ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీయే” అని ప్రకటించిన సంగతి తెలిసిందే. అలా వ్యాఖ్యానించడంతో అంతా షాక్ తిన్నారు. మొత్తంగా ఇపుడు అటు లోకేష్ మాట్లాడిన వీడియో ఇటు బాబు మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి నెటిజన్లు నవ్వుకునేలా చేస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/