Begin typing your search above and press return to search.

ఏపీలో పాలిట్ బ్యూరో..అక్కడ క్యాబినెట్ భేటీ

By:  Tupaki Desk   |   22 Oct 2016 6:14 AM GMT
ఏపీలో పాలిట్ బ్యూరో..అక్కడ క్యాబినెట్ భేటీ
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు రెండు అధికారపక్షాలకు చెందిన కీలక భేటీలు చోటు చేసుకోవటం గమనార్హం. ఏపీలో అధికారపార్టీ పోలిట్ బ్యూరో సమావేశం జరగ్గా.. తెలంగాణలో మంత్రివర్గ సమావేశం జరిగింది. రెండు సమావేశాలు ఇద్దరు చంద్రుళ్ల నేతృత్వంలో జరిగిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదనుకోండి. మరి.. ఈ రెండు సమావేశాల్లో ఇద్దరు చంద్రుళ్లు ఫోకస్ చేసిన అంశాలను చూస్తే కూసింత ఆసక్తికరంగా ఉంటుందని చెప్పాలి.

తెలంగాణ మంత్రివర్గ సమావేశం నాలుగు గంటల పాటు సాగితే.. ఏపీ అధికారపక్షమైన టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశం రెండున్నర గంటల పాటు సాగింది. రెండు సమావేశాల్లో కొన్ని అంశాల మీద అధ్యయనం చేయాలని నిర్ణయించారు. తెలంగాణ విషయానికి వస్తే.. ఆదాయం పెరుగుతున్నా చెల్లింపుల విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఎందుకిలాంటి పరిస్థితి ఎదురవుతుందన్న అంశంపై అధ్యయనంనిర్వహించాలని కేసీఆర్ నిర్ణయిస్తే.. జాతీయ.. అంతర్జాతీయ అంశాలపై అధ్యయనం చేయటానికి పార్టీలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని పాలిట్ బ్యూరో నిర్ణయించింది.

ఇక.. సచివాలయ నిర్మాణం మీద తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో విస్తృతంగా చర్చ సాగింది. ఇప్పుడున్న సచివాలయం స్థానంలో కొత్త సచివాలయాన్ని ఏర్పాటు చేయాలన్న అంశాన్ని చర్చకు పెట్టిన కేసీఆర్.. కొత్త సచివాలయం అవసరం ఏమిటన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. కొత్త సచివాలయాన్ని వాస్తు లోపాల కారణంగా నిర్మిస్తున్నారన్న విమర్శకు చెక్ పెట్టేలా.. ఆయన వాదన సాగింది. సచివాలయాన్ని కొత్తగా నిర్మించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పేలా క్యాబినెట్ సమావేశంలో చర్చించారు. ఏపీకి చెందిన భవనాల మీద ఆయన నేరుగా ప్రస్తావించకున్నా.. తాము కోరినట్లుగా భవనాలు ఇస్తారంటూ నమ్మకంగా చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా నిర్మించాలని భావిస్తున్న సచివాలయం కోసం ఏపీకి కేటాయించిన సచివాలయాన్ని తెలంగాణ ప్రభుత్వానికి తిరిగి ఇచ్చే విషయం మీద చంద్రబాబు తన సానుకూల ధోరణిని పాలిట్ బ్యూరోలో వెల్లడించారు. ప్రభుత్వం ఘర్షణ కోరుకోవటం లేదని.. ఇరుగుపొరుగుతో మంచి సంబంధాలు కోరుకుంటుందని చెప్పిన ఆయన.. వెలగపూడికి సచివాలయాన్ని తరలించిన నేపథ్యంలో.. హైదరాబాద్ లో సచివాలయ భవనాల అవసరం లేదని.. దీనికి తోడు తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న అవసరం.. వారు కావాలని కోరుకుంటున్న నేపథ్యంలో తిరిగి ఇచ్చేయాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం గమనార్హం.

తెలంగాణ క్యాబినెట్ లో రాష్ట్ర అంశాల మీదా.. ప్రభుత్వ పథకాల మీదా.. మంత్రుల పనితీరు మీదా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చకు పెడితే.. టీడీపీ పాలిట్ బ్యూరోలో కేంద్ర సాయం గురించి.. ప్రభుత్వ పథకాలు.. విధానాలు.. నామినేటెడ్ పదవుల కేటాయింపు లాంటి అంశాలపైనా చర్చ సాగింది. ప్రతిపక్షాలు తమపై చేస్తున్న విమర్శల్ని తిప్పి కొట్టే విషయంలో మంత్రులు ఫెయిల్ అవుతున్నారన్న అసంతృప్తుని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తం చేస్తే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారశైలి మరోలా ఉంది. పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయటం.. పార్టీ నేతలకు వీలైనంత ఎక్కువగా నామినేటెడ్ పదవులు ఇవ్వటం లాంటివి చేసే అంశంపై చర్చ జరిగింది. ఇక.. తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ ససమావేశంలో మంత్రి కేటీఆర్ హాజరు కాలేదు. విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా ఆయన సమావేశానికి హాజరు కాలేదు. అయితే.. టీడీపీ పాలిట్ బ్యూరో లో చంద్రబాబు తనయుడు.. పార్టీ జాతీయకార్యదర్శి లోకేశ్ హాజరయ్యారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/