Begin typing your search above and press return to search.

ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వంలో చంద్రుళ్లు ఎక్క‌డెక్క‌డంటే?

By:  Tupaki Desk   |   25 July 2017 8:07 AM GMT
ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వంలో చంద్రుళ్లు ఎక్క‌డెక్క‌డంటే?
X
రాష్ట్రప‌తి ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వంలో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. అతిర‌థ మ‌హార‌థులు విచ్చేసిన ఈ కార్య‌క్ర‌మంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కూడా హాజ‌రు కావ‌టం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యేందుకు ప్ర‌త్యేకంగా ఢిల్లీ వెళ్లారు ఇద్ద‌రు చంద్రుళ్లు.

రాష్ట్రప‌తి ఎన్నిక‌ల నామినేష‌న్ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన సంద‌ర్భంలోనూ తెలుగు రాష్ట్రాల ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన హ‌డావుడి అంతా ఇంతా కాదు. వాస్తు ప్ర‌కారం కోవింద్ ను కూర్చో బెట్టే విష‌యంలో బీజేపీ పెద్ద‌ల‌కు ఆయ‌న చేసిన సూచ‌న‌ల్ని వారు తూచా త‌ప్ప‌కుండా పాటించారు.

ద‌ళిత అభ్య‌ర్థిని రాష్ట్రప‌తిగా ఎంపిక చేయాల‌ని తాను చేసిన సూచన‌ను ప్ర‌ధాని మోడీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న‌ట్లుగా కేసీఆర్ చెప్పుకోవ‌టం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజా ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మంలో ఇద్ద‌రు చంద్రుళ్ల‌కు ల‌భించిన స్థానాలు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి.

పార్ల‌మెంటు భ‌వ‌నంలో జ‌రిగిన వేడుక‌లో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు రెండో వ‌రుస‌లోని సీటులో కూర్చోగా.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాత్రం మొద‌టి వ‌రుస‌లో కూర్చోవ‌టం క‌నిపించింది. ఇద్ద‌రు చంద్రుళ్లు వేర్వేరు వ‌రుస‌ల్లో కూర్చోవ‌టం ప‌లువురు తెలుగువాళ్ల మ‌ధ్య ఆస‌క్తిక‌ర చ‌ర్చగా మారింది.