Begin typing your search above and press return to search.

బొత్స వద్ద ఉన్న చంద్రబాబు రహస్యాలేంటి?

By:  Tupaki Desk   |   26 Sep 2016 9:05 AM GMT
బొత్స వద్ద ఉన్న చంద్రబాబు రహస్యాలేంటి?
X
మైకు పట్టుకుంటే చాలు ముందూవెనుకా చూడకుండా మాట్లాడే టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు తాజాగా పొంతన లేని మాటలు చెప్పి చంద్రబాబును హీరోను చేయాలని చూసి అందుకు బదులుగా కొత్తకొత్త అనుమానాలను లేవనెత్తారు. వైసీపీ నేత బొత్స సత్యనారాయణ పదేపదే చంద్రబాబును విమర్శిస్తున్నారని.. కానీ, ఆయనకు ఆ అర్హత లేదని.. ఎందుకంటే చంద్రబాబు దయ వల్ల ఆయన బయట ఉన్నారని, లేదంటే జైల్లో ఉండేవారని గాలి చెప్పుకొచ్చారు. చంద్రబాబు తలచుకుంటే బొత్స సత్యనారాయణ ఈపాటికి జైల్లో ఉండేవారని .. లిక్కర్‌ సిండికేట్‌, ఇసుక మాఫియా, వోక్స్‌వ్యాగన్‌ కేసుల్లో ఉన్న బొత్సను చంద్రబాబు దయతలచి వదిలిపెట్టారని చెప్పారు. కక్షసాధింపు ఎందుకన్న ఉద్దేశంతోనే చంద్రబాబు అలా చేశారని చెప్పారు. అలాంటి చంద్రబాబును పట్టుకుని బొత్స సత్యనారాయణ విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.

అయితే... గాలి చెబుతున్నదంతా బాగానే ఉన్నా మిగతావారి విషయంలో చంద్రబాబు ఎందుకలా దయ చూపించలేదు, ఒక్క బొత్స పైనే దయ చూపించారెందుకన్న ప్రశ్న వినిపిస్తోంది. అందుకు ఉదాహరణలు కూడా చూపిస్తున్నారు. జగన్ పైన కేసులు... చెవిరెడ్డిని బయటకు రాగానే అరెస్టు చేయిస్తూ జైళ్లోనే వారాల తరబడి ఉండేలా చేయడం.. రోజాను ముప్పతిప్పలు పెట్టడం వంటివన్నీ ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పార్టీ ఫిరాయించక ముందు భూమానాగిరెడ్డిని జైలుకు పంపడం.. రౌడీ షీట్ తెరవడం.. లేటెస్ట్‌గా భూమన కరుణాకర్ రెడ్డిపై సీఐడీ విచారణ విషయంలో ఆ జాలి, దయ ఏమయ్యాయంటున్నారు.

చంద్రబాబు కేవలం బొత్సనే వదిలేశారంటే అందుకు ఏదో కారణం ఉందని.. బొత్స వద్ద చంద్రబాబుకు సంబంధించిన కీలక రహస్యాలు ఉండొచ్చేమోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు. బొత్స పదేపదే సింగపూర్ లో చంద్రబాబు పెట్టుబడుల కథంతా తనకు తెలుసని చెబుతుంటారు. బహుశా అది నిజమే కావొచ్చని.. అందుకే చంద్రబాబు బొత్స జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారని అంటున్నారు.