Begin typing your search above and press return to search.

బాబు భ‌యం టీజీ నోట వినిపించింది

By:  Tupaki Desk   |   16 Aug 2017 5:01 AM GMT
బాబు భ‌యం టీజీ నోట వినిపించింది
X
నంద్యాల ఉప ఎన్నిక ఎపిసోడ్ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు మ‌హా ఇబ్బందిక‌రంగా మారింది. ఈ ఫ‌లితంలో ఏమాత్రం తేడా వ‌చ్చినా మొద‌టికే మోసం రావ‌టం ఖాయం. నంద్యాల ఉప ఎన్నిక విష‌యంలో తాను అనుకున్న దానికి భిన్న‌మైన ప‌రిణామాలు చోటు చేసుకోవ‌టం.. భూమా వ‌ర్గీయుల‌పై ఓట‌ర్ల‌లో అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతుంద‌న్న వాద‌న బాబు బ్యాచ్ కు మ‌హా ఇబ్బందిక‌రంగా మారింద‌ని చెబుతున్నారు.

నిజానికి నంద్యాల ఉప ఎన్నిక మొత్తం బాబు వ‌ర్సెస్ జ‌గ‌న్ అన్న‌ట్లుగానే సాగుతోంది. బాబు హామీలు.. ఆయ‌న వ్య‌క్తిత్వం.. విశ్వ‌స‌నీయ‌త‌ను ప్ర‌శ్నించేలా విప‌క్ష నేత జ‌గ‌న్ ప్ర‌సంగాలు ఉంటున్నాయి. జ‌గ‌న్ లేవ‌నెత్తుతున్న ప్ర‌శ్న‌ల‌కు బాబు అండ్ కో స‌మాధానం చెప్ప‌లేక‌పోతున్న వైనం టీడీపీ వ‌ర్గాల్లో నిరాశ‌.. నిస్పృహ‌ల‌కు గురి చేస్తోంది. నంద్యాలలో జ‌గ‌న్ నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో బాబు పాల‌న‌ను జ‌గ‌న్ ఏకి పారేశారు. బాబు బ్యాచ్ అంచ‌నాల‌కు భిన్నంగా ఊహించ‌ని రీతిలో జ‌గ‌న్ ఇచ్చిన హామీలు ద‌డ పుట్టించాయి.

మైనార్టీ నేత‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి.. ఆర్య‌వైశ్యుల‌కు ఫెడ‌రేష‌న్ ఏర్పాటు చేస్తామ‌ని చెప్ప‌టం ద్వారా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు జ‌గ‌న్‌. బాబు పాల‌న‌లో త‌మ‌కేమాత్రం ప్రాధాన్య‌త ల‌భించ‌టం లేద‌న్న వేద‌న‌లో ఉన్న వ‌ర్గాల‌కు జ‌గ‌న్ మాట‌లు సాంత్వ‌న క‌లిగించాయి. ఆ విష‌యాన్ని కాస్త ఆల‌స్యంగా గుర్తించిన ఏపీ అధికార‌పక్షం ఇప్పుడు కిందామీదా ప‌డుతోంది. జ‌రిగిన డ్యామేజ్ ను కంట్రోల్ చేయ‌టానికి ఏం చేస్తే బాగుంటుంద‌న్న ఆలోచ‌న చేసిన చంద్ర‌బాబు.. ఇప్పుడు ఆయా వ‌ర్గాల నేత‌ల్ని సీన్లోకి తెస్తున్నారు.

ప‌ద‌వి వ‌చ్చే వ‌ర‌కు హ‌డావుడి చేసి.. కిందామీదా ప‌డి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాన్ని తెచ్చుకున్న త‌ర్వాత నుంచి పారిశ్రామిక‌వేత్త‌.. మాజీ మంత్రి టీజీ వెంక‌టేశ్ కామ్ అయిపోవటం తెలిసిందే. వైశ్యుల‌కు ఫెడ‌రేష‌న్ హామీ జ‌గ‌న్ నోటి నుంచి రావ‌టం.. ఇంత కాలం త‌మ‌ను ప‌ట్టించుకోని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై ఆ వ‌ర్గంలో నెల‌కొన్న అసంతృప్తి నంద్యాల ఫ‌లితాన్ని కొంత‌మేర ప్ర‌భావాన్ని చూపిస్తాయ‌న్న మాట వినిపిస్తోంది. దీంతో.. టీజీని చంద్ర‌బాబు అలెర్ట్ చేశార‌ని చెబుతున్నారు.

నంద్యాల ఉప ఎన్నిక విష‌యంలో పెద్ద‌గా త‌ల‌దూర్చ‌కుండా ఉంటున్నార‌న్న విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న టీజీ వెంక‌టేశ్ తాజాగా గొంతు స‌వ‌రించుకున్నారు. జ‌గ‌న్ ఇచ్చిన హామీల్ని త‌ప్పు ప‌డుతూ.. తాము సైతం వైశ్యుల‌కు ఏదో చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా చెప్ప‌టం గ‌మ‌నార్హం. బాబు పాల‌న‌లో బీసీలు.. ఎస్సీల‌కు ప్ర‌భుత్వ స‌బ్సిడీలు అందుతున్నాయ‌ని.. ఆర్య‌వైశ్యుల కోసం కార్పొరేష‌న్ ఏర్పాటు చేయాల‌న్న ఆలోచ‌న‌లో సీఎం ఉన్న‌ట్లుగా చెప్పటం విశేషం.

అధికారంలో కొన‌సాగుతున్న మూడున్న‌రేళ్ల‌లో గుర్తుకు రాని వైశ్యుల కార్పొరేష‌న్ ఇప్పుడే బాబుకు ఎందుకు గుర్తుకు వ‌చ్చిందంటే అది జ‌గ‌న్ పుణ్య‌మేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. జ‌గ‌న్ హామీలు బాబును భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేశాయ‌న్న మాట ఇప్పుడు వినిపిస్తోంది. జ‌గ‌న్ హామీల ప్ర‌భావాన్ని త‌గ్గించేందుకు వీలుగా ఆయా వ‌ర్గాల నేత‌ల్ని రంగంలోకి దింపుతున్నట్లుగా చెబుతున్నారు. ఉప ఎన్నిక జ‌రుగుతున్న జిల్లాకు చెందిన ముఖ్య‌నేత‌ల్లో ఒక‌రైన టీజీకి ఉన్న‌ట్లుండి ఆర్య‌వైశ్యులు గుర్తుకు రావ‌టం.. ఆ వ‌ర్గానికి జ‌గ‌న్ ఇచ్చిన హామీని ఆయ‌న ప్ర‌స్తావిస్తున్నారంటే అదంతా బాబుకు క‌లిగిన భ‌యంగా అభివ‌ర్ణిస్తున్నారు. బాబు భ‌యం టీజీ నోట వినిపిస్తుంద‌న్న భావ‌న ఆయ‌న తాజా వ్యాఖ్యలు చెప్ప‌క‌నే చెప్పేస్తున్నాయ‌ని చెబుతున్నారు.