సర్వేలకు భయపడొద్దు..చంద్రబాబు

Sun Jan 21 2018 11:57:54 GMT+0530 (IST)

టీడీపీకి వ్యతిరేకంగా వస్తున్న సర్వే నివేదికలను చూసి ఆందోళన చెందొద్దని జాగ్రత్తపడాలని టీడీపీ అధినేత చంద్రబాబు మంత్రులకు - పార్టీ శ్రేణులకు హితబోధ చేశారు. అంతేకాదు... వైసీపీ నుంచి ఒక్కొక్కరిని వందలమందిని టీడీపీలోకి తీసుకొచ్చేయాలనీ సూచించారు. ఎంతమంది వచ్చినా ఫర్వాలేదు - ఇవ్వడానికి పదవులున్నాయంటూ ఇప్పటివరకు అనుసరించిన తాయిలాల రాజకీయ వ్యూహాన్ని మరోసారి అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు.
    
మొన్నటి రిపబ్లిక్ టీవీ సర్వేతో చంద్రబాబు నుంచి సాధారణ కార్యకర్త వరకు టీడీపీలో అందరికీ ఒక్కసారిగా వెన్ను వణికింది. దీంతో అందరిలో ఆత్మవిశ్వాసం కల్పించే పనిని చంద్రబాబు మొదలుపెట్టారు. ప్రస్తుతం ప్రజల్లో టీడీపీకి ఆదరణ ఉందని ఆయన చెప్పుకొచ్చారు. 120 నుంచి 130 నియోజకవర్గాల్లో తెలుగుదేశానికి సానుకూలంగా ఉందని ఇంచార్జులు ఉన్నచోటే ఇబ్బంది అని అన్నారు. ఇప్పుడు విపక్షం వైసీపీ ఒక్కటేనని - గత ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా 1.67 మాత్రమేనని - నంద్యాల - కాకినాడ ఎన్నికల్లో టిడిపికి 16 శాతం ఓట్లు అదనంగా వచ్చాయని రాబోయే ఎన్నికల్లో ఇదే ఫలితం రావాలని అన్నారు.
    
అదేసమయంలో ఆయన క్షేత్రస్థాయిలో పరిస్థితులనూ పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని... ఎమ్మెల్యేలు - ఇంచార్జులు తమ తప్పులతో పాడు చేసుకుంటే నేను ఏమీ చేయలేనంటూ చేతులెత్తేశారు. ఇష్టారీతిగా ఉంటే 128 ఏళ్ల కాంగ్రెస్ పరిస్థితి మనకు వస్తుందని - 130 నియోజకవర్గాల్లో ఎలాంటి ఇబ్బంది లేదని - కానీ నలభై - యాభై నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఇతర పార్టీల నుంచి కిందిస్థాయి నేతలు వచ్చినా తీసుకోవాలన్నారు. పార్టీలోకి వచ్చే వారు ఇప్పుడున్న వారికి పోటీ కాదని - సర్దుబాటు చేసేందుకు చాలినన్ని పదవులు ఉన్నాయని చెప్పారు.