బాబు భయానికి సీ-ఓటర్ సర్వేనే కారణమా?

Sun Jan 21 2018 23:00:01 GMT+0530 (IST)

టీడీపీ అధినేత చంద్రబాబు మూడు జిల్లాల్లోని టీడీపీ ఎమ్మెల్యేలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. పనితీరు మార్చుకోకపోతే తాను స్వయంగా ఆయా నియోజకవర్గాల్లో నిరాహార దీక్ష చేస్తానన్నారు. చిత్తూరు - శ్రీకాకుళం - అనంతపురం జిల్లాల్లో ఎమ్మెల్యేలు పనిచేయడం లేదని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
    
కాగా రీసెంటుగా వెల్లడైన సర్వే ఫలితాలను చూసి ఆందోళన చెందడం వల్లే చంద్రబాబు ఆ మూడు జిల్లాల టీడీపీ ఎమ్మెల్యేలను హెచ్చరించినట్లు భావిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడం కష్టమంటూ రిపబ్లిక్ టీవీ-సీఓటర్ సర్వే రీసెంటుగా తేల్చడం తెలిసిందే. అయితే చంద్రబాబు ఆ సర్వేను బూటకమంటూ కొట్టిపారేశారు. కానీ.. చంద్రబాబు తాజాగా చేసిన తీవ్ర వ్యాఖ్యలు చూస్తుంటే ఆ సర్వే వాస్తవమేనని చంద్రబాబు నమ్ముతున్నట్లుగానే ఉంది. చంద్రబాబు సొంత సర్వేల్లో కూడా పార్టీ బలహీనపడిన సంగతి తేలిందని ఇప్పుడు మీడియా సర్వేలూ అదే విషయం వెల్లడించడంతో ఆయన పనితీరు కనబరచని ఎమ్మెల్యేలను హెచ్చరిస్తూ పరిస్థితులను చక్కదిద్దే పనిలో పడ్డారని తెలుస్తోంది.
    
ఆ క్రమంలోనే ఆయన చిత్తూరు - అనంతపురం - శ్రీకాకుళం జిల్లాల ఎమ్మెల్యేలను హెచ్చరించినట్లుగా చెప్తున్నారు.   అక్కడి ఎమ్మెల్యేలకు ఇక కష్టకాలమేనని పనిచేయకపోతే మీకు ఇబ్బందులు వస్తాయనిఆయన అన్నారు. ‘నేనే వచ్చి మీ దగ్గర నిరహార దీక్ష చేస్తా... అప్పుడైన మీమీద ఒత్తిడి పెరుగుతుంది. గతంలో గాంధీగారు ఇదే పద్దతి అనుసరించార’ని చంద్రబాబు అన్నారు.  అంతేకాదు.. ప్రజలు ఎంతో నమ్మకంతో మనల్ని గెలిపిస్తే పనిచేయకపోతే ఎలా... అని ప్రశ్నించారు. ఆ మూడు జిల్లాల పార్టీ ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాలన్నారు.