Begin typing your search above and press return to search.

ఈ సోమవారం బాబుకు అసంతృప్తే మిగిలింది

By:  Tupaki Desk   |   25 Oct 2016 4:53 AM GMT
ఈ సోమవారం బాబుకు అసంతృప్తే మిగిలింది
X
కొత్త తరహా విధానాల్ని అనుసరించటంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు భిన్నంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ప్రాధాన్యత కలిగిన అంశాల విషయంలో ఆయనీ మధ్య కొత్తతరహా విధానాల్ని అమలు చేస్తున్నారు. కీలక అంశాలను రెగ్యులర్ గా మానిటర్ చేయటానికి.. పనుల పురోగతిని స్వయంగా సమీక్షించటం కోసం వారాల వారీగా వాటిపై దృష్టి సారిస్తున్న వైనం తెలిసిందే. సోమవారం వచ్చిందంటే చాలు.. పోలవరం ప్రాజెక్టును సమీక్షించటం.. పనులను పర్యవేక్షించటంతో పాటు.. వారాల వారీగా పనుల లక్ష్యాన్ని నిర్దేశించటం.. అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతున్నాయా? లేదా? అన్న విషయాన్ని క్రాస్ చెక్ చేయటంతో పాటు.. లోపాల్ని ఎప్పటికప్పడు సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

ఇందులో భాగంగా ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు పనుల్ని చంద్రబాబు స్వయంగా మానిటర్ చేస్తున్నారు. మొదటి రెండు వారాల్లో కాస్తంత తడబడినప్పటికీ.. ఇప్పుడిప్పుడే ఆయన పనులపై అవగాహన పెంచుకోవటంతో పాటు.. అధికారుల సాయం లేకుండానే.. జరగాల్సిన పనులేంటి? జరుగుతున్నది ఏంటి? ఎంత పని జరిగింది? లక్ష్య సాధనలో లోటుపాట్లు ఏంటి? కాంట్రాక్టర్ల పని తీరు ఎలా ఉందన్న విషయాలకు సంబంధించిన సంపూర్ణ అవగాహన చంద్రబాబుకు వచ్చేసిందని చెప్పొచ్చు.

గడిచిన మూడు వారాలుగా.. ఆయన పోలవరం పనులు జరుగుతున్న తీరుపై అసంతృప్తితో ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు కాస్త ముందుగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయించటం ద్వారా.. తన సత్తా చాటాలని భావిస్తున్న చంద్రబాబు.. అందుకు అనుగుణంగా పని మొత్తాన్ని వారాల కింద విడగొట్టారు. ఏ వారానికి ఆ వారానికి పని అయ్యేలా పక్కా ప్లాన్ రూపొందించిన చంద్రబాబుకు.. ఏ వారానికి ఆ వారం పూర్తి కావాల్సిన పనులు పూర్తి కాని దుస్థితి. దీంతో.. ఆయన తీవ్ర అసంతృప్తికి గురి కావటంతో పాటు.. కాంట్రాక్ట్ పొందిన సంస్థపైనా.. అధికారులపైనా ఫైర్ అవుతున్నారు. ఈ సోమవారం విషయానికే వస్తే.. పనుల్లో పురోగతి ఏ మాత్రం ఉండటం లేదని.. అనుకున్నంత వేగంగా పనులు జరగటం లేదన్న విషయాన్ని ఆయన మరోసారి స్పష్టం చేయటం కనిపించింది.

నిర్మాణ సంస్థల వైఫల్యం కారణంగా స్పిల్ వే.. స్పిల్ ఛానల్.. పవర్ హౌస్ తవ్వకం లాంటి పనులు ఆలస్యమైన విషయాన్ని కాంట్రాక్ట్ సంస్త దృష్టికి తీసుకెళ్లటంతో పాటు.. పనులు అనుకున్నంత వేగంగా జరగని పక్షంలో సహించేది లేదన్న వార్నింగ్ ను తాజాగా ఆయన ఇచ్చేశారు. ఏదైనా సమస్యలు.. ఇబ్బందులు ఉంటే ఎప్పటికప్పుడు తనను సంప్రదించి పరిష్కరించుకోవాలే తప్చి.. పనుల్ని పెండింగ్ పెడితే మాత్రం ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. రూ.110 కోట్ల పెండింగ్ బిల్లుల్ని విడుదల చేస్తున్నట్లు చెప్పిన చంద్రబాబు.. అనుకున్న పనుల్ని అనుకున్నట్లుగా పూర్తి చేయలేకపోవటంపై కాంట్రాక్టు సంస్థను నిలదీశారు. ఈ ఏడాది చివరి నాటికి గేట్ల డిజైన్లురూపొందించటం.. అనుమతులు పొందాలన్న లక్ష్యాన్ని గుర్తు చేసిన చంద్రబాబు.. అనుకున్న విధంగా పనులు జరగకపోవటంపై త్రివేణి సంస్థపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మొత్తంగా చూస్తే.. బాబు ఆలోచనలకు తగ్గట్లుగా పోలవరంలో పనులు జరగకపోవటంపై బాబు అసంతృప్తి వారం వారానికి పెరిగిపోతుంది. సోమవారం వస్తే చాలు.. చంద్రబాబు చికాకులు చూడలేకపోతున్నామని.. ఆయన అసంతృప్తిని భరించటం కష్టంగా మారిందని చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరు చూస్తుంటే.. రానున్న సోమవారాల్లోనూ బాబు అసంతృప్తి మరింత పెరుగుతుందే కానీ తగ్గేటట్లు కనిపించట్లేదన్న మాట వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/