Begin typing your search above and press return to search.

బాబు కోడ్ ఉల్లంఘించార‌ట‌!..మ‌రి చ‌ర్య‌లేమిటో?

By:  Tupaki Desk   |   18 April 2019 4:15 PM GMT
బాబు కోడ్ ఉల్లంఘించార‌ట‌!..మ‌రి చ‌ర్య‌లేమిటో?
X
ఈ సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ది సుదీర్ఘ షెడ్యూల్‌. దేశ‌వ్యాప్తంగా ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఏకంగా రెండు నెల‌ల పాటు ఈ ప్రక్రియ‌ను నిర్వ‌హించేలా కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ ఖ‌రారు చేసింది. ఈ షెడ్యూల్ ప్ర‌కారం... తొలి విడ‌త‌లోనే పోలింగ్ ముగిసిన ఏపీ అసెంబ్లీ ఫ‌లితాలు మే 23న విడుద‌ల కానున్నాయి. అంటే పోలింగ్ కు - ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు ఏకంగా 43 రోజుల గ్యాప్ ఉంద‌న్న మాట‌. ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైన నాటి నుంచి ఫ‌లితాలు వెలువ‌డే దాకా ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్న‌ట్లే లెక్క‌. ఈ కాలంలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీల‌తో పాటు కేంద్రంలోని అధికార పార్టీ కూడా ప‌రిపాల‌న‌లో కీల‌క నిర్ణ‌యాలు తీసుకోరాదు. కొత్త నిర్ణ‌యాలు అస‌లే తీసుకోరాదు. ఇక సాధార‌ణ ప‌రిపాల‌న‌కు సంబంధించి ప‌ర్య‌వేక్ష‌ణ మాత్ర‌మే ఉండాలి. మొత్తంగా షెడ్యూల్ విడుద‌లైన త‌ర్వాత ప్ర‌భుత్వాలు ఆప‌ద్ధ‌ర్మ ప్ర‌భుత్వాలుగా మారిపోతాయ‌న్న‌మాట‌.

ఇలాంటి ప‌రిస్థితే ఇప్పుడు ఏపీలో ఉంది. అయితే ఎన్నిక‌ల కోడ్ ను ఉల్లంఘిస్తూ టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు వ్య‌వ‌హ‌రించార‌న్న వార్త ఇప్పుడు వైర‌ల్ గా మారిపోయింది. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్న స‌మ‌యంలో ఆయ‌న నిన్న‌, నేడు అధికారుల‌తో స‌మీక్ష‌లు నిర్వ‌హించారు. కోడ్ ఉన్న విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూనే... ఫ‌లితాల‌కు నెల‌న్న‌రు పైగా స‌మ‌యం ఉంటే... సాధార‌ణ పాల‌న సాగాలా? వ‌ద్దా? అంటూ ప్ర‌శ్నించి మ‌రీ స‌మీక్ష‌లు నిర్వ‌హించారు. చంద్ర‌బాబు నిర్వ‌హించిన స‌మీక్ష‌ల్లో తాగు నీటి స‌ర‌ఫ‌రా, పోల‌వ‌రం, సీఆర్డీఏ త‌దిత‌ర అంశాలున్నాయి. ఈ స‌మీక్ష‌లకు అధికారులు కూడా హాజ‌ర‌య్యారు. ఈ విష‌యంపై స్పందించిన ఏపీ ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి గోపాల‌కృష్ణ ద్వివేదీ... చంద్ర‌బాబు కోడ్ ఉల్లంఘించిన‌ట్లుగానే చెప్పుకొచ్చారు.

తాగునీటి స‌మీక్ష వ‌ర‌కు ఓకే గానీ... పోల‌వ‌రం - సీఆర్డీఏల‌పై చంద్ర‌బాబు స‌మీక్ష నిర్వ‌హించ‌డం కోడ్ ఉల్లంఘించ‌డం కింద‌కే వ‌స్తుంద‌ని కూడా ద్వివేది చెప్పుకొచ్చారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌పైనా స‌మీక్ష నిర్వ‌హించాల‌ని భావించిన చంద్ర‌బాబు... ఎందుక‌నో గానీ... ఆ స‌మీక్ష‌ను ర‌ద్దు చేసుకున్నారు. అయితే పోల‌వ‌రం, సీఆర్డీఏల‌పై చంద్ర‌బాబు జ‌రిపిన స‌మీక్ష‌లకు సంబంధించి ద్వివేది... కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి నివేదిక పంపే అవ‌కాశాలున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదే జ‌రిగితే.. చంద్ర‌బాబుపై ఈసీ కొర‌డా ఝుళిపించే అవ‌కాశాలున్నాయ‌న్న విశ్లేష‌ణ‌లు జ‌రుగుతున్నాయి. మ‌రి అలాంటి చ‌ర్య‌ల‌కే ఈసీ నిర్ణ‌యిస్తే... చంద్ర‌బాబుపై ఏ త‌ర‌హా చ‌ర్య‌లు తీసుకుంటార‌న్న విష‌యం ఆస‌క్తి రేకెత్తిస్తోంది.