Begin typing your search above and press return to search.

బాబు కేరాఫ్ అడ్ర‌స్ బెజ‌వాడే..!

By:  Tupaki Desk   |   3 Sep 2015 5:48 PM GMT
బాబు కేరాఫ్ అడ్ర‌స్ బెజ‌వాడే..!
X
తెలంగాణ‌లో ప‌వ‌ర్‌ని చేజిక్కించుకున్న త‌ర్వాత మాత్ర‌మే హైద‌రాబాద్‌ను విడిచిపెట్టి వెళ‌తాన‌న్న ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తాజాగా మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప‌దిహేను నెల‌ల కింద‌ట హైద‌రాబాద్ మీద విప‌రీత‌మైన అభిమానాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న ఆయ‌న ఇప్పుడు.. తాను ఏపీకి మాత్ర‌మే ముఖ్య‌మంత్రిన‌న్న విష‌యాన్ని బాగానే గుర్తించిన‌ట్లున్నారు.

ఏపీ.. హైద‌రాబాద్‌ల‌తో రాజ‌కీయం చేయాల‌ని భావించిన బాబు.. ఇప్పుడు మాత్రం బెజ‌వాడే త‌న‌కు ముద్ద‌ని తేల్చేశారు. నిన్న‌మొన్న‌టివ‌ర‌కూ వారానికి ఐదు రోజులు బెజ‌వాడ‌లో బ‌స అన్న మాట‌ను కూడా మార్చేసి.. ఇక వారం రోజులూ బెజ‌వాడ‌లోనే బాబు మ‌కాం అన్న‌ట్లుగా మార‌నుంద‌ని చెబుతున్నారు.

హైద‌రాబాద్‌లో ఫ్యామిలీ.. బెజ‌వాడ‌లో బాబు ఉండ‌టం.. వీకెండ్‌లో వ‌చ్చి వెళ్ల‌టం చేస్తున్న ఆయ‌న‌.. ఇక‌పై హైద‌రాబాద్‌కు ఎప్పుడో త‌ప్ప రాకూడ‌ద‌ని డిసైడ్ అయిన‌ట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగా కృష్ణా క‌ర‌క‌ట్ట‌ పై ఉన్న లింగ‌మ‌నేని ఎస్టేట్ అతిధి గృహంలో ఫ్యామిలీ పెట్టేయ‌నున్నారు. ఇప్ప‌టికే ఇంట్లో పూజ చేసిన ఆయ‌న‌.. ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం ఉండేందుకు వీలుగా ఫ‌ర్నిచర్ కూడా కొనేశార‌ని చెబుతున్నారు.

అన్ని అనుకున్న‌ట్లు సాగితే.. సెప్టెంబ‌రు 9 నుంచి బాబు కేరాఫ్ అడ్ర‌స్ బెజ‌వాడ‌గా మారుతుంద‌ని చెబుతున్నారు. ఒక‌ప్పుడు భాగ్య‌న‌గ‌రాన్ని విడిచిపెట్టి వెళ్ల‌టానికి స‌సేమిరా అనే బాబు.. ఇప్పుడు మాత్రం బెజ‌వాడ‌ను దాటి వ‌చ్చేందుకు ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌టం చూస్తే.. కాలం ఎంత సిత్ర‌మైంద‌ని అనుకోవాల్సిందే.