Begin typing your search above and press return to search.

7వేల మందితో టెలి కాన్ఫరెన్స్ ఏంటి బాబు..?

By:  Tupaki Desk   |   25 Nov 2015 4:54 AM GMT
7వేల మందితో టెలి కాన్ఫరెన్స్ ఏంటి బాబు..?
X
ఏపీలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపడుతున్న కార్యక్రమాలు చూసి పలువురు విస్తుపోతున్నారు. మంగళవారం వరంగల్ ఉప ఎన్నిక ఫలితం వెలువడిన నేపథ్యంలో ఏపీ వ్యవహారాల్ని తెలంగాణ రాష్ట్రంలోని తెలుగు వారితో సహా.. ఏపీలోని వారు కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. బాబుగారు రికార్డు స్థాయి టెలికాన్ఫరెన్స్ పెట్టి వార్తల్లోకి వచ్చారు.

ఇటీవల చోటు చేసుకున్న భారీ వర్షాల కారణంగా తీసుకోవాల్సిన చర్యల గురించి.. ఇతర అంశాల గురించి ఒక సమీక్షా సమావేశాన్ని ఏపీ ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ కార్యదర్శి నుంచి కార్యదర్శి వరకూ టెలికాన్ఫరెన్స్ ను నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్ అంటే ఏ పది మందో.. ఇరవై మందో కాకుండా ఏకంగా 7వేల మందితో అంటూ ఏపీ సర్కారు వెల్లడించింది.

అయినా.. టెక్నాలజీ పెరిగి పోయిన ఈ రోజుల్లో టెలికాన్ఫరెన్స్ పెట్టటం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? దానికి బదులుగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినా ఎంతో కొంత ఫలితం ఉంటుందేమో. అయినా.. ఏడు వేల మందితో టెలికాన్ఫరెన్స్ ఏమిటో అర్థం కాక పిచ్చెక్కి పోయే పరిస్థితి. ఒకే దఫా భారీగా తన సందేశం చేరాలని భావించటం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అనుకోవటం తప్పు లేదు. కానీ.. అది ప్రాకిక్టల్ గా వర్క్ వుట్ అయ్యేలా ఉండాలే తప్పించి.. చేశామంటే చేశామన్నట్లుగా ఉండకూడదు. తాజాగా.. 7వేల మందితో బాబు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ అదే రీతిలో ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మాట్లాడేది పది మందితో అయినా.. తాను ఏం చేయాలనుకుంటున్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పగలిగితే సరిపోతుంది. అంతేకాదు.. మంది లెక్కల మోజు ఉండకూడదన్న విషయాన్ని చంద్రబాబు ఎప్పుడు గుర్తిస్తారో..?