నందమూరి ఫ్యామిలి ని బజార్ కి ఈడ్చిన నారా

Tue Dec 11 2018 15:09:38 GMT+0530 (IST)

"శాలికో గ్రుహ నాశాయ:" అన్నారు పెద్దలు... అంటే అల్లుడుని ఇంట్లో పెట్టుకుంటే ఆ గృహం నాశనం అవుతుందని అర్దం. ఈ నానుడి చంద్రబాబు నాయుడి విషయంలో నిజమైంది. మహానటుడు - తెలుగుదేశం పార్టీ వ్యవస్దాపకుడు ఎన్టీఆర్ కుటుంబం బాబు బారిన పడింది. పదవి కోసం స్వయాన పిల్లనిచ్చిన మామగారిని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు నారా చంద్రబాబు నాయుడు.ఆ తర్వాత దివంగత  మహా నటుడు  ఎన్టీఆర్ పై పోటీ చేసి - మామగారు స్దాపించిన పార్టీ పేరునే తన మనుగడగా మార్చుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను 9 సంవత్సరాలు పరిపాలించారు. తన అవసరానికి బావమరుదల్ని - తోడల్లుడిని వాడుకుని - వారివైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. తన క్యాబినెట్ లో ఎన్టీఆర్ కుటుంబీకులకు ఎవరికీ కూడా ఎటువంటి పదవులు ఇవ్వలేదు. ఎన్టీఆర్ ను గద్దె దించే ప్రయత్నంలో ఆయన కుమారులైన హరిక్రిష్ణ - బాలక్రిష్ణను తనవైపు తిప్పుకుని కుటిల చాణక్యంతో ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డితో పోటీకి హరిక్రిష్ణ కుమారుడు - యూత్ లో బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జూ.ఎన్టీఆర్ ను ఎన్నికల ప్రచారంలో వాడుకుని - తర్వాత ఆయనకు కూడా హాత్ ఇచ్చిన ఘనత బాబుగారికే దక్కింది.

ప్రస్తుతం తెలంగాణ ముందస్తు ఎన్నికలలో కూకట్‌పల్లి నియోజకవర్గంలో తెరాసా అభ్యర్దిపై గెలుపుకోసం తన రాజకీయాన్ని ప్రదర్శించారు చంద్రబాబు నాయుడు. కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి మొదట పెద్దిరెడ్డికి హామీ ఇచ్చారు. ఆయన ఆ నియోజకవర్గంలో ప్రచారం కూడా మొదలు పెట్టేసుకున్నారు. అయితే తెలంగాణలో కనుక తెరాస తిరిగి విజయం సాధిస్తే బయట అభ్యర్ది అయితే తెరాసలో చేరే అవకావం ఉంటుంది కనుక చివరి నిమిషంలో చుండ్రు సుహాసినికి టిక్కెట్టు ఇచ్చారు. అయితే ఆమెను చుండ్రు సుహాసినిగా కాకుండా నందమూరి సుహాసినిగా పరిచయం చేయడం బాబు రాజకీయంలో భాగమే.

మొదట్లో కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి స్వర్గీయ నందమూరి హరిక్రిష్ణ కుమారులైన కల్యాణ్ రామ్ ను గాని జూ. ఎన్టీఆర్ ను గాని పోటీచేయాల్సిందిగా కోరినట్లు సమాచారం. దీనికి వారు అంగీకరించకపోవడంతో నందమూరి హరిక్రిష‌్ణ వియ్యంకుడు - కాంగ్రెస్ నాయకుడు అయిన చుండ్రు శ్రీహరితో ఉన్న స్నేహన్ని తన రాజకీయానికి ఉపయోగించుకున్నారు బాబు. అయితే నందమూరి వారి పరువు ప్రతీసారి కూడా నారా వారివల్లే పోతోందని వారు వాపోతున్నారు. ఇక నారా చంద్రబాబు నాయుడు వియ్యంకుడు - హిందూపురం ఎమ్యెల్యే అయిన బాలక్రిష్ణ బాబు చేతిలో రబ్బర్ స్టెంప్ అన్న సంగతి అందరికీ తెల్సిందే కదా. ఇన్ని విధాలుగా నారా చంద్రబాబు నాయుడు తన లబ్ది కోసం మూడు తరాల నందమూరి వంశీకులను వాడుకున్నారు. ఇంకా ఎంత వాడుకుంటారో !