బాబు ప్రచారం రేంజ్..భోజనాన్ని కూడా వదలట్లే

Mon Jul 16 2018 13:27:30 GMT+0530 (IST)

నిరుపేదలకు తక్కువ ధరకే నాణ్యమైన ఆహారాన్ని అందించే 'అన్న క్యాంటీన్లు' ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమయ్యాయి. విజయవాడలో అన్న క్యాంటీన్లను ప్రారంభించిన చంద్రబాబు.. క్వాలిటీ - క్వాంటిటీ విషయంలో రాజీలేకుండా పేదలకు ఆహారాన్ని అందిస్తామన్నారు. పేదలకు కడుపునిండా అన్నం పెట్టిన ఎన్టీఆర్ పేరుతో క్యాంటీన్లు నిర్వహిస్తున్నామని సీఎం చెప్పారు. అన్న క్యాంటీన్లను చక్కగా ఉంచాల్సిన బాధ్యత ప్రజలు తీసుకోవాలని సూచించారు. ప్రతి క్యాంటీన్ దగ్గర 300 మందికి ఆహారం అందేలా ఏర్పాట్లు చేశామన్నారు. పేదలు - వృద్ధులకు అన్న క్యాంటీన్లు ఒక వరమని - ఎన్ని ఇబ్బందులు వచ్చినా క్యాంటీన్ల నిర్వహణ కొనసాగిస్తామని చంద్రబాబు తెలిపారు.ముఖ్యమంత్రి చంద్రబాబు వివరణ బాగుంది. పేదలకు పట్టెడన్నం పెట్టేందుకు - అందులోనూ నామమాత్రపు ధరకు అందజేసేందుకు ప్రభుత్వం ముందుకు రావడం సంతోషకరమే కాదు...అభినందనీయం కూడా. అయితే ఈ పథకాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సహా ఆ పార్టీ నేతలు రాజకీయంగా వాడుకుంటున్న తీరు - పట్టెడన్నం పెట్టే కార్యక్రమాన్ని సైతం ప్రచారం కోసం ఉపయోగించుకుంటున్న విధానాన్ని చూసే..పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పైగా అక్కడ సామాన్యులు పడుతున్న అవస్థలను చూసి ఆవేదన చెందుతున్నారు. అన్న క్యాంటీన్ విషయానికి వస్తే...ఎన్నికల వేళ దగ్గర పడితే గాని పేదలకు ఆహార భద్రత సంగతి గుర్తు రాలేదు చంద్రబాబుకు. సాక్షాత్తు అధికార పార్టీకే చెందిన ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తీ శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో దీనిపై ప్రశ్నించారు. ఎన్నాళ్లుగానో అన్న కాంటీన్లను నిర్లక్ష్యం చేస్తున్నారని అడిగినా ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. కానీ ఎన్నికల ముంచుకు వస్తున్న నేపథ్యంలో అన్న క్యాంటీన్ల హామీని ఇప్పుడు లైన్లోకి తెచ్చారు చంద్రబాబు. నిజానికి ఈ పథకం తమిళనాడులో జయలలిత అమ్మ కాంటీన్ల నుంచి స్ఫూర్తి పొందింది. బాబు స్ఫూర్తి నిజమైనదైతే ఈ పాటికే రాష్ట్రమంతా అన్న క్యాంటీన్లు పని చేస్తూ ఉండాలి. కానీ బాబు లెక్కలే వేరు కదా! అందుకే నాలుగేళ్లుగా విషయం మూలనపెట్టి...ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు హఠాత్తుగా తెరమీదకు వచ్చిందని చెప్తున్నారు.

మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్రలో చంద్రబాబు ఇచ్చిన హామీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. 600 హామీల మేనిఫెస్టో ఏది చంద్రబాబూ అంటూ నిత్యం ప్రశ్నిస్తున్నారు. ఇన్నేళ్లుగా బాబు మర్చిపోయిన అన్న క్యాంటీన్లను గుర్తు చేసేందుకు - ఈమధ్యనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి 4రూపాయిలకే సంచార భోజన పథకాన్ని రాజన్న కాంటీన్ ద్వారా  ప్రారంభించారు. బాబు చేసిన మోసాన్ని ఎండగట్టేందుకే మంగళగిరి సెంటర్లో సంచార భోజన పథకాన్ని ప్రారంభించారు. ఇది జరిగిన కొన్నాళ్లకే బాబు అన్న క్యాంటీన్లను మళ్లీ తెరమీదకు తెచ్చారని పలువురు చర్చించుకుంటున్నారు.

ఇక అన్న క్యాంటీన్లు పేదల క్షుద్బాధను పూర్తి స్థాయిలో తీర్చలేకపోతున్నాయని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 300 మందికి భోజన - టిఫిన్ సదుపాయాలు కల్పించిన ప్రభుత్వం వారికి కూడా కడుపునిండా పెట్టలేకపోతోందని పేర్కొంటున్నారు. పలు మీడియా సంస్థలు క్యాంటీన్ల పనితీరును తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి పర్యటన చేయగా ఈ విషయం బయటపడింది. ఇక ఆహారం కోసం వచ్చే వారి సంఖ్య 500 పైచీలుకు ఉంటుండగా కేవలం 300 మందికి మాత్రమే సిద్ధం చేస్తుండటంతో తోపులాటలు - తొక్కిసలాటలు సహజమైపోయాయని క్యాంటీన్లను గమనిస్తున్నవారి మాట. తక్కువ ధరకే కడుపు నిండా భోజనం దొరుకుతుందని ఎక్కడినుంచో క్యాంటీన్ వరకూ వస్తే...భోజనం అయిపోయిందని అంటున్నారని సమయం ముగిసిందని చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతు కూలీలు - ఆటో డ్రైవర్లు - బీదా బిక్కీ జనం ఎందరో. కేవలం `ఎన్నికల హామీని అమలు చేశాం` అని చెప్పేందుకు మాత్రమే అన్న క్యాంటీన్లు ప్రారంభించారే తప్ప ప్రజల అవసరాలను తీర్చేందుకు కాదని అనేక మంది నిట్టూరుస్తున్నారు.