Begin typing your search above and press return to search.

ప్ర‌తిప‌క్ష నేత జిల్లాలో పాచిక పారట్లేదు బాబు

By:  Tupaki Desk   |   25 Oct 2016 5:30 PM GMT
ప్ర‌తిప‌క్ష నేత జిల్లాలో పాచిక పారట్లేదు బాబు
X
రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం అనేదే లేకుండా చేయాలి, తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల నాటికి క‌డ‌ప‌ జిల్లాలో అన్ని పార్లమెంట్ - ఎమ్మెల్యే స్థానాలు దక్కించుకునే విధంగా కష్ట‌ప‌డాలి అని టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ఇచ్చే స్టేట్‌ మెంట్ వ‌ర్క‌వుట్ కావ‌డం లేదా? జ‌గ‌న్ ల‌క్ష్యంగా చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ క‌డ‌ప‌లో విక‌టించిందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. వ‌ల‌స నేత‌ల‌కు పెద్ద‌పీట వేయ‌డంతో జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్లలో కుమ్ములాటలు మొదలై పార్టీ ప్రతిష్టను దిగజార్చే స్థాయికి చేరింద‌ని అంటున్నారు.

రాష్ట్ర భజన అనంతరం కాంగ్రెస్‌ పార్టీ కనుమరుగుకావడం - వైసీపీలో కొంతమేరకు అసంతృప్తి - టీడీపీలో ఆశించిన మేరకు జిల్లాలో కేడర్ లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ భారీ ఎత్తున వలసలు ప్రోత్స‌హించింది. అయితే కొత్త నేత‌ల‌ రాకతో పార్టీ స్థాపితం నుంచి పార్టీని నమ్ముకుని అన్ని ఒడుదుడుకులు ఎదుర్కొన్న అసలైన సిసలైన నేతలకు అన్యాయం జరగడంతో వారు ఏమీ దిక్కుతోచక బిక్కుబిక్కుమంటూ నలిగిపోతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో పార్టీ టికెట్ దక్కించుకున్నవారిలో కూడా అధికసంఖ్యలోనే వలస నేతలు ఉన్నారు. గతంలోనూ ప్రస్తుతం పార్టీని నమ్ముకుని ఉన్న వారు ప్రత్యర్థుల మద్య గత పదేళ్లుగా అనేక సమస్యలు ఎదుర్కొని సర్వం కోల్పోయి ఉన్నారు. కేవలం వైసిపి అధినేత ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి సొంత జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎదురుపడకూడదని పార్టీ హైకమాండ్ వివిధ పార్టీల నేతలను పార్టీలోకి తీసుకుంది. అయితే పార్టీని నమ్ముకుని ఉన్న నేతలు - మాజీ మంత్రులు - మాజీ పార్లమెంట్ సభ్యులు - మాజీ ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేక ప్రభుత్వం ఏర్పాటై దాదాపు 10 ఏళ్లుగా ప్రత్యర్థులతో సమస్యలు ఎదుర్కొంటూ వస్తున్నారు. ఇరువర్గాల్లో ఆధిపత్యం కొనసాగుతుండటంతో పార్టీ బలోపేతం అయిందని అధిష్టానం యోచిస్తున్నా అది బలుపేగానీ పార్టీ బలం కాదని పార్టీ వ‌ర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.

ప్రభుత్వ చౌకదుకాణాలు - వివిధ కాంట్రాక్టు పనులు - చివరకు నీరు-చెట్టు పనులు అసలైన టీడీపీ నేతలకు - కార్యకర్తలకు దక్కకుండా వలస నేతలకే దక్కుతుండటంతో టీడీపీ కేడర్ జీర్ణించుకోలేక పోతోంది. వచ్చేనెల 1 నుంచి జనచైతన్యయాత్రలు ప్రారంభం కావడంతో ఒకవర్గం నేతలు మాత్రమే యాత్రల్లో పాల్గొని, మరో వర్గం ఆ కార్యక్రమాలకు దూరంగా ఉండేందుకు ఉంది. పార్టీ సభ్యత్వ కార్యక్రమాల నమోదులో కూడా అసమ్మతి వర్గం అంటీ అంటనట్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరగనున్న సమావేశాల్లో పార్టీ అధిష్టానం దృష్టికి తమ అభిప్రాయాలు తీసుకువెళ్లేందుకు సమీక్ష సమావేశాల్లో జిల్లా - నియోజకవర్గ స్థాయిలో గళం విప్పి తాము ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు సర్వం సిద్దంచేసుకుంటున్నారు. కుల సామాజికవర్గాలో రాజకీయం పనిచేస్తుండటంతో అధికారపార్టీ నేతలు పార్టీని నమ్ముకున్న నేతలు వలస నేతల మధ్య తాడోపేడో తేల్చుకునేందుకు సర్వం సిద్దం చేసుకుని సమీక్షా సమావేశాలకు హాజరుకానున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు - జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్‌ జిల్లాలో పలుమార్లు పర్యటించి ఆధిపత్యపోరు - అసమ్మతి వాదులను హెచ్చరించినా తీరు మారలేదు. ప్రస్తుతం సమీక్ష సమావేశాల్లో తమకు జరిగిన అన్యాయాలను నేతలు - కార్యకర్తలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు సర్వం సిద్దం చేసుకుంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/