Begin typing your search above and press return to search.

ఇక ఏపీలో కూటమి గోల

By:  Tupaki Desk   |   19 Dec 2018 4:23 AM GMT
ఇక ఏపీలో కూటమి గోల
X
తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని గద్దె దించేందుకు కలిసి బొక్కా బోర్లాపడ్డ తెలుగుదేశం - కాంగ్రెస్ పార్టీలు మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో కలిసేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఇందుకోసం ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీల కూటమిని తెలంగాణ ప్రజలు చితక్కొట్టినా ఆంధ్రప్రదేశ్ లో కలిసి పోటీ చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం పొత్తు వైపే పరుగులు తీస్తున్నారు. ఈ పొత్తుపై తెలుగుదేశం పార్టీలో తీవ్ర వ్యతిరేకత వస్తున్నా దాన్ని కాదని - తన సొంత ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుుడు ఈ పొత్తుకు ముందుకు వస్తున్నారని అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులతో పొత్తుపై చర్చించేందుకు రావాలంటూ సందేశాలు కూడా పంపుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉందంటున్నారు.

2019 సంవత్సరంలో లోక్‌ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతాయి. దీంతో కాంగ్రెస్ పార్టీకి 10 నుంచి15 శాసనసభ స్ధానాలు - ఒకటి - రెండు లోక్‌ సభ స్ధానాలు కేటాయించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారన్న హామీతో ప్రజల వద్దకు వెళ్లాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అయితే, తెలంగాణలో కాంగ్రెస్ తో కలిసి చేసిన ప్రజాకూటమి ప్రయోగం తీవ్రంగా దెబ్బతిందని - ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కూడా తలెత్తుతుందని తెలుగు తమ్ముళ్లు కంగారు పడుతున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు - తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు - మజ్లీస్ పార్టీ నేత అసదుద్దీన్ ఒవైసీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఆంధ్రప్రదేశ్ లో అభిమానులున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ లో సొంతంగా పోటీ చేస్తే విజయం సాధించడం అసాధ్యమే. అయితే ఆ పార్టీ అండదండలుంటే మాత్రం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు తహతహలాడుతున్నారు. అయితే తెలంగాణలో వచ్చిన ఫలితమే ఆంధ్రప్రదేశ్ లో కూడా వస్తుందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.