Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తి బాండ్లు..మ‌రో 500 కోట్ల‌కు స్కెచ్‌

By:  Tupaki Desk   |   20 Sep 2018 4:14 AM GMT
అమ‌రావ‌తి బాండ్లు..మ‌రో 500 కోట్ల‌కు స్కెచ్‌
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజధాని బాండ్ల అమ్మ‌కం మ‌రోమారు తెర‌మీద‌కు వ‌చ్చింది. అమ‌రావ‌తి బాండ్ల జారీపై ఎన్నో సందేహాలు ఉన్న సంగ‌తి తెలిసిందే. అప్పును సైతం సంతోషంగా త‌మ విజ‌యంగా టీడీపీ ప్ర‌చారం చేసుకుంటుంద‌నే విమ‌ర్శలు ఉన్న‌ప్ప‌టికీ....``అమ‌రావ‌తి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి (బీఎస్ ఈ) ద్వారా రూ. 1300 కోట్ల విలువైన బాండ్లను జారి చేసి విజయం సాధించింది. ఈ బాండ్ల ఇష్యూకు 1.5 రెట్ల స్పందన వచ్చింది. అంటే సుమారు రూ.2000 కోట్ల విలువైన బాండ్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో బాండ్ విలువ రూ.10 లక్షలు. కేవలం సంస్థాగత ఇన్వెస్టర్లకు మాత్రమే ఆఫర్ చేశారు. బాండ్ల ఇష్యూ ఓవర్ సబ్ స్క్రయిబ్ అయితే మరో రూ. 700 కోట్ల విలువైన బాండ్లను విక్రయించేందుకు సీఆర్డీఏ ముందే అనుమతి తీసుకుంది. దీంతో అదనపు బాండ్లు జారీ చేసి రూ. 2000 కోట్లను సమీకరించనుంది. ఈ లెక్కన ఇవాళ్టి ఇష్యూ ద్వారా రూ. 2000 కోట్లు సాధించిన సంస్థగా సీఆర్డీఏ రికార్డు సాధించింది`` అంటూ డ‌బ్బా కొట్టుకున్నారు.

ఓ వైపు అధికార తెలుగుదేశం పార్టీ ప్ర‌చారం చేసుకుంటుండ‌గా...మ‌రోవైపు ఈ ప్ర‌క్రియ‌పై అనేక అనుమానాలు - రాష్ట్ర ప్ర‌భుత్వం తీరుపై అనేక ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. రాజధాని నిర్మాణానికి అంటూ నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న అప్పులకు సంబంధించి కొన్ని సందేహాలు లేవనెత్తుతూ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప‌లు ప్ర‌శ్న‌లు సంధించింది.అదే స‌మ‌యంలో మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు సైతం ఘాటుగానే రియాక్ట‌య్యారు. ``అమరావతి బాండ్ల వడ్డీ 10. 3 2%. అది క్వార్టర్లీ బేసిస్ మీద. రాష్ట్ర ప్రభుత్వ హామీ ఈ అప్పుకు ఉంది. క్రితం వారం జిహెచ్ ఎంసి బాండ్లు 8. 9% వడ్డీతో సబ్ స్క్రయిబ్ అయినాయి. పూనా బాండ్లు 7. 5 9%. ఈ బాండ్ల కోసం మనం ఇస్తున్న కమీషను 17 కోట్ల రూపాయలు. ఏ రకంగా ఇది లాభదాయకమో అర్థం కావటం లేదు.`` అంటూ ఓ ట్వీట్‌ లో ప్ర‌భుత్వం ఎగిరి గంతు వేయాల్సిన సీనేమీ లేద‌ని తేల్చిచెప్పేశారు. ఇలా అన్ని వ‌ర్గాల నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చినా..బాబు స‌ర్కారు మ‌ళ్లీ అదే ప‌నిచేస్తోంది.

మ‌రో రూ.500 కోట్లను స‌మీకరించేందుకు రిక్వెస్ట్ ఫ‌ర్ కొటేష‌న్ల‌ను ఆహ్వానిస్తోంది. సెప్టెంబ‌ర్ 25వ తేదీన ప్రారంభ‌మ‌య్యే ఈ ప్ర‌క్రియ అక్టోబ‌ర్ 5వ తేదీతో ముగుస్తుంది. దీనికి సంబంధించిన వ‌డ్డీ రేటు స‌హా ఇత‌ర‌త్రా అంశాలు లీడ్ మేనేజ‌ర్ల‌ను ఎంపిక చేసిన త‌ర్వాత ప్ర‌క‌టించ‌నున్నారని ఏపీ అధికార వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. కాగా, ఇప్పటికే స‌మీక‌రించిన వాటిపైనే చ‌ర్చోప‌చ‌ర్చ‌లు ఉన్న స‌మ‌యంలో ఈ నిర్ణ‌యం ఆస‌క్తిక‌రంగా మారింది.