Begin typing your search above and press return to search.

బాబు డైలాగ్ మారిపోయింది

By:  Tupaki Desk   |   26 Oct 2016 12:27 PM GMT
బాబు డైలాగ్ మారిపోయింది
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మ‌రోమారు అధికారులు, ప్ర‌జాప్రతినిధుల‌కు త‌న‌దైన శైలిలో హిత‌బోధ చేశారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి బీసీ - ఎస్సీ - ఎస్టీ - ముస్లిం - మైనారిటీ - మహిళా సంక్షేమ శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సంక్షేమంపై టెలీ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ‘పేదరికంపై గెలుపు’ ఒక మహత్తర కార్యక్రమం అంటూ, ఇందులో భాగస్వాములు కావడం అదృష్టంగా ప్రతి అధికారి - ప్రజాప్రతినిధి భావించాలనిపేర్కొన్నారు. దేశంలో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం నిర్వహిస్తున్న రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని చంద్ర‌బాబు వివ‌రించారు. ప్రతినెలా ప్రతివ్యక్తికి 5 కిలోల బియ్యం - రూ.1000 పింఛన్, 24గం. విద్యుత్ - 100% గ్యాస్ కనెక్షన్ లు - నీటి భద్రత - ఆరోగ్య భద్రత ఇస్తున్నామన్నారు. చంద్రన్నబీమా సదుపాయం కల్పించామని, ఏడాదికి 5 లక్షలు ఇళ్లు నిర్మిస్తున్నామని, ఇంటింటికీ మరుగుదొడ్లు ఉండేలా చూస్తున్నామన్నారు. నెలకు రూ.149కే కేబుల్ - ఫోన్ - ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తున్నామని, నరేగా కింద కనీసవేతనం రోజుకు రూ.194 అందజేస్తున్నామని వివరించారు. ఎస్సీ - ఎస్టీలకు 50 యూనిట్ల వరకు కరెంటు బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తున్న విషయం గుర్తుచేశారు.

ఆర్థిక సంస్కరణల్లో అగ్ర ప్రాధాన్యం సంక్షేమ రంగానికేనని ముఖ్యమంత్రి చంద్ర‌బాబు గుర్తు చేశారు. ఈ వాస్తవాన్ని అన్ని శాఖల అధికారులు గ్రహించాలన్నారు. సాధికారత రావాలంటే నిర్ధిష్టమైన ఆలోచన, దానికి తగ్గ కార్యాచరణ ఉండాల‌ని బాబు తెలిపారు. సంక్షేమం గత ప్రభుత్వాలు సక్రమంగా అమలు చేయనందునే పేదల జీవన ప్రమాణాలు పెరగలేదని పేర్కొంటూ ప్రతి కుటుంబానికి నెలకు కనీసం రూ.10వేలు ఆదాయం రావాలనేదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంగా స్ప‌ష్టం చేశారు. చదువు పేదరికాన్ని తొలగిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు సోదాహరణంగా వివరించారు. మామూలు కుటుంబాలనుంచి వచ్చిన గాంధీజీ - అంబేద్కర్ - ఎన్టీఆర్ - అబ్దుల్ కలాం స్వయంకృషితోనే అత్యున్నత స్థానం అందుకున్నారని గుర్తుచేశారు. బడుగు బలహీనవర్గాల పిల్లలను బాగా చదివించాలని, తద్వారా పేదరికాన్ని నిర్మూలించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూములను ఏర్పాటు చేస్తున్నట్లు చంద్ర‌బాబు ఈ సందర్భంగా ప్రకటించారు. దీని ద్వారా విద్యార్ధులలో కంప్యూటర్ పరిజ్ఞానం చిన్నవయస్సులోనే గణనీయంగా పెరుగుతుంద‌ని చంద్ర‌బాబు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఇంక్యుబేషన్ సెంటర్లు నెలకొల్పుతామన్నారు. రూ.2000 కోట్లతో వంద స్కూళ్ళను అప్ గ్రేడ్ చేస్తున్నట్లు చెప్పారు. బీసీ విద్యార్ధులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లు 75% విడుదల చేశారని, ఎస్సీ విద్యార్ధులకు ప్రీమెట్రిక్ స్కాలర్ షిప్ లు 62% విడుదల చేశారని, మిగిలింది కూడా త్వరితగతిన విడుదలచేయాలని ఆదేశించారు. ప్రతి సంక్షేమ హాస్టల్ వార్డెన్ బాధ్యతగా ఉండాలని, మంచి ఫలితాలు సాధించాలని చంద్ర‌బాబు దిశా నిర్ధేశం చేశారు.

ప్రతి డ్వాక్రా మహిళ డిజిటల్ లిటరేట్ కావాలని చంద్ర‌బాబు ఆకాంక్షించారు. ఇప్పటికే 4500 మంది మహిళలకు శిక్షణ ఇచ్చామని, సంక్రాంతిలోపు 54లక్షల మందికి డిజిటల్ లిటరసీలో శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సేవారంగం - తయారీరంగం - వ్యవసాయం - పర్యాటకరంగాలలో డ్వాక్రా మహిళలను భాగస్వాములను చేయాలన్నారు. దీనివల్ల వారి కుటుంబాల ఆదాయాలు గణనీయంగా మెరుగుబడతాయన్నారు. చంద్రన్నబీమా కింద ఇంకా 50 లక్షల మంది నమోదు చేయించు కోవాల్సి ఉందంటూ, మున్సిపల్ ప్రాంతాలలో, ఏజెన్సీ ప్రాంతాలలో నమోదు కార్యక్రమం మరింత వేగవంతం చేయాలని చంద్ర‌బాబు ఆదేశించారు. ఎన్టీఆర్ విదేశీ విద్యకు 174 మంది బీసీ విద్యార్ధులు, 361 మంది కాపు విద్యార్ధులను ఎంపికచేశారని, ఎన్టీఆర్ విద్యోన్నతికి 240 మంది గిరిజన విద్యార్ధులను ఎంపిక చేశారని అంటూ, నిర్ణయించిన లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. అంబేద్కర్ ఓవర్ సీస్ విద్యానిధి పథకం అమలుపై ముఖ్యమంత్రి అసంతృప్తి ప్రకటించారు. ఎస్సీ,ఎస్టీ విద్యార్ధులు మరింతమంది ఈపథకాన్ని సద్వినియోగం చేసుకునేలా అధికారులు శ్రధ్ధ వహించాలని చంద్ర‌బాబు సూచించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/