Begin typing your search above and press return to search.

ఆ మీటింగ్‌ లో మోడీని బాబు క‌డిగేస్తార‌ట‌!

By:  Tupaki Desk   |   14 Jun 2018 5:38 AM GMT
ఆ మీటింగ్‌ లో మోడీని బాబు క‌డిగేస్తార‌ట‌!
X
మొన్న‌టివ‌ర‌కూ రాసుకుపూసుకు తిరిగిన మోడీ.. బాబుల మ‌ధ్య రిలేష‌న్ క‌ట్ కావ‌టం తెలిసిందే. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌న్న త‌మ డిమాండ్‌ను ప‌ట్టించుకోకుండా మొండిగా వ్య‌వ‌హ‌రిస్తున్న మోడీ తీరుపై తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తూ ఎన్డీయే కూట‌మి నుంచి బాబు బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. అప్ప‌టి నుంచి కేంద్ర స‌ర్కారు మీదా.. ప్ర‌ధాని మోడీ మీదా ఏ మాత్రం అవ‌కాశం చిక్కినా చెల‌రేగిపోతున్నారు చంద్ర‌బాబు.

నాలుగేళ్ల త‌న పాల‌నా వైఫ‌ల్యాల్ని మోడీ పేరుతో క‌వ‌ర్ చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న చంద్ర‌బాబు.. ప్ర‌ధానిపై ప‌రుష వ్యాఖ్య‌ల్ని చేసేందుకు సైతం వెనుకాడ‌టం లేదు. బ‌హిరంగ స‌భ‌ల్లో రోజుకో తీరుతో మోడీపై మండిప‌డుతున్న బాబు.. తాజాగా తాను వెళ్లే నీతి అయోగ్ మీటింగ్ లో ప్ర‌ధానిని క‌డిగేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు.

రాష్ట్రానికి జ‌రుగుతున్న అన్యాయం.. కేంద్రం చేసిన అన్యాయంపై నీతిఆయోగ్ మీటింగ్ లో ప్ర‌ధాని మోడీని నిల‌దీయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లుగా చెబుతున్నారు.

ఈ మ‌ధ్య‌న టీడీపీ.. బీజేపీ మ‌ధ్య పోరు ముఖాముఖిగా మారింది. మొన్న‌టివ‌ర‌కూ ప్ర‌ధాని మోడీపై బాబు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. రాష్ట్రానికి మోడీ చేసిన అన్యాయాన్ని అదే ప‌నిగా ప్ర‌స్తావిస్తున్నారు. రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో ప్ర‌ధాని ఇచ్చిన మాట‌ను త‌ప్పుతున్నారంటూ వీడియోలు వేసి మ‌రీ చూపిస్తున్న ప‌రిస్థితి.

ఇలాంటి వేళ‌.. బాబుపై ఎదురుదాడిని ఏపీ బీజేపీ నేత‌లు మొద‌లు పెట్టారు. ఏపీ బీజేపీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన క‌న్నా.. గొంతు స‌వ‌రించుకొని బాబుపై తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు. తాజాగా క‌న్నా చేసిన వ్యాఖ్య‌ల్ని చూస్తే.. ఆయ‌న ఫుల్లీ లోడెడ్ గ‌న్ మాదిరి మారార‌ని చెప్పాలి. ఈ మ‌ధ్య కాలంలో బాబును ఇంత తీవ్ర‌స్థాయిలో తిట్టిన నేత‌ల్లో క‌న్నా తొలివ‌రుస‌లో ఉన్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.

త‌న‌పై ఎదురుదాడి చేస్తున్న క‌మ‌ల‌నాథుల‌కు క‌రెంట్ షాక్ త‌గిలేలా.. త‌న రాజ‌కీయ వ్యూహాలు ఎలా ఉంటాయో ప్ర‌ధాని మోడీకే చూపించాల‌న్న ఆలోచ‌న‌లో చంద్ర‌బాబు ఉన్న‌ట్లు చెబుతున్నారు. రాజ‌కీయ విమ‌ర్శ‌ల మాదిరి కాకుండా.. ఏపీకి జ‌రిగిన అన్యాయాన్ని అంద‌రి ముఖ్య‌మంత్రుల ముందు ప్ర‌స్తావించ‌టం ద్వారా మోడీ నోట మాట రాకుండా చేయ‌టం.. త‌న‌పైనా.. త‌న రాష్ట్రం పైనా సానుభూతి పొంగిపొర్లేలా చేయాల‌న్న‌ది బాబు ఆలోచ‌న‌గా చెబుతున్నారు.

మోడీపై ముఖాముఖి పోరుకు సిద్ధ‌మ‌న్న విష‌యాన్ని ఇప్ప‌టికే త‌న ప్ర‌క‌ట‌న‌లతో స్ప‌ష్టం చేస్తున్న చంద్ర‌బాబు.. నీతి ఆయోగ్ స‌మావేశంలోనూ అదే వైఖ‌రిని ప్ర‌ద‌ర్శించాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

కేంద్రం నుంచి వ‌చ్చిన నిధుల్ని ఇష్టారాజ్యంగా ఖ‌ర్చు చేయ‌టం.. దుబారా చేస్తున్న‌ట్లుగా క‌మ‌లనాథులు చేస్తున్న వాద‌న‌ను తిప్పి కొట్ట‌టంతో పాటు.. వివిధ కేంద్ర ప‌థ‌కాల కింద రాష్ట్రానికి వ‌చ్చిన సాయం.. రావాల్సిన పెండింగ్ లెక్క‌ల్ని ప్ర‌స్తావిస్తూ మోడీని ఇరుకున ప‌డేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

నీతి ఆయోగ్ స‌మావేశంలో మాట్లాడేందుకు వీలుగా స‌న్నాహాక స‌మావేశాన్ని నిర్వ‌హించిన చంద్ర‌బాబు.. రాష్ట్రం త‌ర‌పున ఏయే అంశాల్ని లేవ‌నెత్తాల‌న్న దానిపై ఉన్న‌తాధికారుల‌తోనూ.. కొన్ని శాఖ‌ల అధిప‌తుల‌తో మీటింగ్ నిర్వ‌హించారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. బీజేపీతో క‌టీఫ్ త‌ర్వాత మోడీ.. బాబు ఇద్ద‌రూ ఎదురు ప‌డుతున్న తొలి స‌మావేశం ఇదే. ఈ నేప‌థ్యంలో మోడీ విష‌యంలో బాబు తీరు ఎలా ఉంటుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.