బాబుకు ఉన్న ఒక్క సీటూ కూడా పోతుందా?

Sat Jan 13 2018 16:25:49 GMT+0530 (IST)

ఇది తెలంగాణలో తెలుగుదేశం సంగతి. అయినా ఒక్క సీటే అంటున్నారేమిటి? తెలంగాణలో తెలుగుదేశానికి ఉన్న బలం ఇద్దరు ఎమ్మెల్యేలు కదా? అని ఎవరికైనా అనిపించవచ్చు. కానీ లెక్కల్లో ఇద్దరే అయినా.. వాస్తవంలో ఒక్కరే. ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తనకు పార్టీతో అసలు సంబంధమే లేదని పదేపదే చెబుతుంటారు. కాబట్టి సాంకేతికంగా రెండు అయినా.. పార్టీ బలం పరంగా ఉన్నది ఒక్కటే. ఈసారి ఎన్నికలు జరిగితే.. ఉన్న ఆ ఒక్క సీటును కూడా తెలుగుదేశం కోల్పోవాల్సి వస్తుందని ఇప్పడు తెరాస నాయకులు సెటైర్లు వేస్తున్నారు.శుక్రవారం నాడు ప్రధానితో భేటీ అయిన చంద్రబాబు.. విభజన తర్వాత.. విభజన చట్టంలోని లోపాల వల్ల తెలంగాణ కు ఎక్కువ లాభాలు వస్తున్నాయని పదేపదే ప్రస్తావించారని.. తెలంగాణ సంపన్న రాష్ట్రంగా ఉండడం చూసి ఓర్చుకోలేక ఇలాంటి కుట్రలు చేయడాన్ని ఆయన తగ్గించుకోవాలని తెరాస నాయకులు అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నది తెదేపా కూడా భాగస్వామిగా ఉన్న ఎన్డీయే పార్టీనే కాబట్టి.. తమ మాట చెల్లుబాటు అవుతందని చంద్రబాబునాయుడు భావిస్తే పప్పులో కాలేయడమే అవుతుందని తెలంగాణ నాయకులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత.. తెలంగాణ తమకు దక్కవలసిన పూర్తి లాభాలను - ప్రయోజనాలను పొందగలుగుతున్నదని.. కాబట్టే మిగులు బడ్జెట్ తో ఉన్నదని.. చంద్రబాబునాయుడు ఈ వాస్తవాన్ని గుర్తించకుండా.. కేంద్రంతో కలిసి తెలంగాణ ప్రయోజనాలకు గండికొట్టాలని చూస్తే.. ప్రజలు ఛీత్కరించుకుంటారని.. తెలంగాణలో ప్రస్తుతం మిగిలిన ఒక్క అసెంబ్లీ సీటు  కూడా ఈసారి గెలుచుకోలేరని వారు హెచ్చరిస్తున్నారు.

తెదేపాకు తెలంగాణలో ప్రస్తుతం బలం పూర్తిగా సన్నగిల్లింది. చాలా నియోజకవర్గాల్లో పార్టీ కమిటీలు వేయడానికి కూడా కార్యకర్తలు లేని పరిస్థితి. పార్టీలో మిగిలిన అతి కొద్ది మంది నాయకుల్లో ఎవ్వరూ ప్రజలను ప్రభావితం చేసి.. రాష్ట్రంలో పార్టీకి సీట్లు రాబట్టగల కరిష్మా లేని వాళ్లే. కనీసం కార్యకర్తలు ఇతర పార్టీల్లోకి వలసలు వెళ్లిపోతోంటే.. వారికి భరోసా ఇచ్చి ఆపగల తెగువ ఉన్న నాయకులు కూడా లేరు. ఇలాటి పరిస్థితిలో తెలంగాణ తెలుగుదేశం అత్యంత విషమ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నదనే చెప్పాలి. ఈ పరిస్థితుల్లో తెలంగాణ బాగుపడిపోతున్నదంటూ.. చంద్రబాబు మోడీ వద్ద బోలెడు పితూరీలో చెప్పడంతో ఇక్కడి నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.