Begin typing your search above and press return to search.

చంద్రబాబు ఐదు వేలు సరే, ఆ ఐదు కోట్ల మాటేంటి?

By:  Tupaki Desk   |   22 Jun 2017 10:42 AM GMT
చంద్రబాబు ఐదు వేలు సరే, ఆ ఐదు కోట్ల మాటేంటి?
X
రాజకీయాల్లో పతనం అవుతున్న విలువల గురించి మరొకసారి తీరికగా బాధపడ్డారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ సారి బాబు ప్రజల మీద అక్కసు వెల్లగక్కారు. ప్రజలు ఓటుకు నోటు తీసుకుంటున్నారని బాబు తెగబాధపడిపోయారు. ప్రజలు ఓటును వెయ్యికి రెండు వేల రూపాయలకు అమ్ముకుంటున్నారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో బాబు ప్రజలకు క్లాసు పీకారు. అంతేనా.. తను అనుకుంటే ఓటుకు వెయ్యి - రెండు వేల రూపాయలు కాదు.. ఐదు వేల రూపాయలైనా ఇవ్వగలను అని బాబుగారు చెప్పుకురావడం కొసమెరుపు.

అంత డబ్బును ఇవ్వగలను కానీ, ఇవ్వను అని బాబు చెప్పుకొచ్చారు. అలా ఇస్తే.. తను ప్రజల నుంచే ఆ డబ్బును వసూలు చేయాల్సి వస్తుందని.. అందుకే తను డబ్బును పంచను అని బాబు నీతుల శతకకర్తలా మాట్లాడారు. నిజమే.. రాజకీయాల్లో ధన ప్రవాహాన్ని నియంత్రించాలి. ఓటుకు నోటు మంచిది కాదు. బాబు చెబుతున్నవన్నీ నిజాలే. మరి బాబుగారు తను ఓటుకు ఐదు వేల రూపాయలు ఇవ్వగలను కానీ, ఇవ్వను అని నీతులు చెబుతుండటమే విడ్డూరం.

ఎవరు కాదన్నా.. ఔనన్నా.. రాజకీయాల్లో ధన ప్రవాహం అనేది తీవ్రమైనది చంద్రబాబు హయాం మొదలయ్యాకే అని అనేక మంది రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉంటారు. ఏపీలో ఓటుకు నోటిచ్చే సంప్రదాయానికి ఆద్యులు చంద్రన్నే అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. మరి అంత వరకూ ఎందుకండీ... తెలంగాణలో ఓటుకు నోటు ఇవ్వబోయి ఇరుక్కున్నది ఎవ్వరు? అనే ప్రశ్నకు సమాధానం చాలు బాబుగారి తీరేంటో అర్థం చేసుకోవడానికి.

ఓటు ఏదనేది ప్రధానం కాదు.. కొనబోయింది నిజమా అబద్ధమా? ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఓటును ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కొనబోయారు తెలుగుదేశం వాళ్లు.ఆ ఆపరేషన్ లో రేవంత్ రెడ్డి ప్రత్యక్ష భాగస్వామి కాగా.. చంద్రబాబు ఫోన్ లైన్ ద్వారా హామీ ఇచ్చి ఇరుక్కుపోయారు. ఆ వాయిస్ మీదేనా అంటే బాబుగారి ఎంత డొంకతిరుగుడుడా మాట్లాడతారో వేరే వివరించనక్కర్లేదు. ఆ ప్రశ్న వేశామంటే.. నా ఫోన్ ను ఎలా ట్యాప్ చేస్తారు? అంటూ మొదలుపెట్టి.. నాకూ ఏసీబీ ఉంది, నాకూ హైదరాబాద్ లో హక్కుంది, నేనూ పోలిస్ స్టేషన్లను పెడతా.. అంటూ ఏదేదో మాట్లాడతారు కానీ, ఆ వాయిస్ తనది కాదు అని మాత్రం బాబుగారు చెప్పనే చెప్పలేదు ఇంత వరకూ.

మరి ఆ కేసు ఇంకా విచారణలోనే ఉంది. ఏకంగా ఐదు కోట్లను ఆఫర్ చేసి అందులో ఐదు లక్షల రూపాయల అడ్వాన్స్ ను ఇచ్చి తెలుగుదేశం అధినేత కూడా కేసును నెత్తిపైకి తెచ్చుకున్నారు. మరి అలాంటాయన రాజకీయాల్లో విలువల గురించి, ఓటుకు నోటు గురించి ప్రజలకు నీతులు చెబుతుంటే .. ఈ ప్రహసనాన్ని గమనిస్తే నవ్వురాకమానదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/