బాబు...ఇప్పుడు శ్వేతపత్రం విడుదల చేయండి

Fri Sep 29 2017 07:00:01 GMT+0530 (IST)

రాష్ట్ర విభజన జరిగి..నవ్యాంధ్రప్రదేశ్ రథసారథిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన ఆసక్తికరమైన చర్య ఒకటి గుర్తుండే ఉంటుంది. అదే శ్వేతపత్రం విడుదల చేయడం.  ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. ఏపీలోని కీలక అంశాలన్నింటిపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేశారు. వరుస బెట్టి పలు అంశాలపై ఈ కాగితాలు రిలీజ్ చేశారు. అయితే శ్వేతపత్రం ఎపుడు - ఎందుకు విడుదల చేస్తారు అనేది కూడా బాబుకు తెలియదా అని కొన్ని రాజకీయపక్షాలు విరుచుకుపడ్డాయి. ఒక నాయకుడు పరిపాలించిన తర్వాత చేసే పనిని... పగ్గాలు చేపట్టిన వెంటనే చేశాయని తప్పుపట్టాయి. అయితే ఏపీ అప్పులు - నిధులు - ప్రణాళికలు ఇలా అన్నీ వివరించేందుకు భవిష్యత్ కార్యాచరణకు ఇలా చేశామని టీడీపీ నేతలు అప్పుడు చెప్పుకొచ్చారు.అయితే ఇప్పుడు అదే రీతిలో ఏపీ సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని పలు వర్గాల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పుడు ఎందుకు అంటే... ప్రధానంగా కేంద్రం నిధుల కేటాయింపు...విడుదల కోణంలో. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు..ఇప్పటివరకు ఇచ్చిన నిధుల గురించి తేల్చేందుకు. ఎందుకంటే...తాజాగా ఢిల్లీ పర్యటన సందర్భంగా రాష్ట్ర విభజన జరిగి మూడున్న రేళ్లవుతున్నా ఏపీకి కేంద్రం ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టున్నాయని స్వయంగా ముఖ్యమంత్రే ఢిల్లీ పెద్దలకు ఏకరువు పెట్టుకోవాల్సి వచ్చింది కాబట్టి. ఈ నేపథ్యంలో బాబు శ్వేతపత్రం ప్రకటిస్తే....ఇటు రాష్ట్ర  ప్రజలకు స్పష్టతతో పాటు అటు బీజేపీ ప్రచారం కూడా తెలుస్తుందని అంటున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా - పలువురు రాష్ట్ర బీజేపీ నాయకులు ఏపీకి కేంద్రం సుమారు రూ.లక్షన్నర కోట్లు మంజూరు చేసిందని బల్లగుద్ది మరి ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు అసలు నిధులే రావట్లేదంటున్నారు సీఎం చంద్రబాబు. వీరి సంవాదంతో ప్రజలు గందరగోళ పడుతున్నారు.

పోలవరం ప్రాజెక్టుకయ్యే పూర్తి వ్యయాన్ని భరిస్తామని కేంద్రం పేర్కొన్నప్పటికీ ఎన్ని నిధులిస్తుందో స్పష్టత లేదు. రాష్ట్రం రూ.54 వేల కోట్లకు అంచనా వేసింది. విభజనకు ముందు రాష్ట్రం ఖర్చు పెట్టిన రూ.5 వేల కోట్లు ఇమ్మంటే కుదరదు పొమ్మంది కేంద్రం. తాజా అంచనాల్లో ఏ మేరకు మంజూరు చేస్తుందో తెలీదు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఆరు నూరైనా వచ్చే రెండేళ్లలో పోలవరం పూర్తి చేసి తీరతామని సంవత్సరంలో కాఫర్ డ్యాం నిర్మించి గ్రావిటీ ద్వారా నీరిస్తామంటున్నారు. కేంద్రం ఇచ్చే నిధుల లెక్క తేలకుండా అదెలా సాధ్యమో సీఎంకే తెలియాలి. రాజధాని అమరావతి నిర్మాణ వ్యయం తొలుత రూ.ఐదు లక్షల కోట్లు అని పేర్కొని కుదించి కుదించి ఇప్పుడేమో రూ.20 వేల కోట్లు అడుగుతున్నారు. మూడున్నరేళ్లలో కేంద్రం ఇచ్చింది రూ.వెయ్యి కోట్లు. రైల్వేజోన్ - కేంద్ర విద్యా సంస్థలు - ఇండస్ట్రియల్ కారిడార్లు - జల హారాలు - పెట్రో కెమికల్ - టూరిజం - లాజిస్టిక్ - ఐటి హబ్ ల అడ్రస్ లేదుఅలా కాకుండా రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన నిధుల విడుదలను విషయంలో ఎంతో గందరగోళం ఉంది.  అందుకే... ప్రజల్లో అయోమయం పోవాలంటే కేంద్రం రాష్ట్రం అధికారికంగా శ్వేతపత్రం విడుదల చేయాలి. అప్పుడే ఎవరి చిత్తశుద్ధి ఏమిటో బయట పడుతుందని విశ్లేషకులు చెప్తున్నారు.