Begin typing your search above and press return to search.

ఎంపీ సీటు తాయిలమే- ‘జేపీ-చంద్ర బంధమా!’

By:  Tupaki Desk   |   23 Feb 2018 8:15 AM GMT
ఎంపీ సీటు తాయిలమే- ‘జేపీ-చంద్ర బంధమా!’
X
సోషల్ మీడియా బాగా యాక్టివ్ గా ఉన్న ఈ రోజుల్లో రోజుకు కొన్నివందల కొత్త విషయాలు నిజానిజాలతో నిమిత్తం లేకుండా ప్రచారంలోకి వచ్చేస్తుంటాయి. వాటిలో నమ్మడానికి వీలుగా ఉన్నవి కొన్ని ఎక్కువ ప్రచారానికి నోచుకుంటాయి. లేనివి మరుగున పడిపోతాయి. అయతే తాజా రాజకీయాల విషయంలో అనేక హేతువుల ఆధారంగా జరుగుతున్న సోషల్ మీడియా ప్రచారం.. లోక్‌సత్తా జయప్రకాష్ నారాయణ్ కు రాజ్యసభ ఎంపీ స్థానాన్ని కట్టబెట్టేస్తోంది. రాబోయే రాజ్యసభ ఎన్నికల సమయానికి ఆయనను తెలుగుదేశం పార్టీ ఏపీ నుంచి బరిలో దించి.. ఎమ్మెల్యేల ఓట్లతో రాజ్యసభకు సభ్యునిగా పంపబోతున్నట్లు పుకార్లు వ్యాప్తిలోకి వస్తున్నాయి. అందుకు చాలా కారణాలు - సంకేతాలు కూడా ప్రచారం అవుతున్నాయి.

రాజ్యసభ ఎంపీ పదవి అంటే చిన్న విషయం ఎంత మాత్రమూ కాదు. గతంలో తెలుగుదేశం పార్టీకి ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు అదివరలో సుదీర్ఘకాలం పాటూ పార్టీ ఇబ్బందులు లేకుండా నడవడానికి ఉపయోగపడిన వ్యయప్రయాసలను భరించిన వారనే ఉద్దేశంతో సుజనా చౌదరి - సీఎం రమేష్ కు చంద్రబాబు అవకాశం కల్పించారు. వారి ఎంపిక మీదనే పెద్దస్థాయిలో పార్టీలోనే అంతర్గతంగా విమర్శలు వచ్చాయి. పార్టీకి ఎంతో అనుపమాన సేవలు చేసిన వారికి, డైరక్టుగా ప్రజాక్షేత్రంలో గెలిచే వీలులేని వారికి కేటాయించే రాజ్యసభ సీట్లను చంద్రబాబునాయుడు పారిశ్రామిక వేత్తలకు అమ్మేసుకున్నారంటూ పార్టీ వాళ్లే ప్రెవేటు సంభాషణల్లో విమర్శించినట్లుగా ప్రచారం జరిగింది. అలాంటి ఆరోపణలకు మరింత బలం ఇచ్చేలాగా.. ఆ తర్వాత రోజుల్లో దక్కిన మరో అవకాశాన్ని చంద్రబాబునాయుడు మరో పారిశ్రామికవేత్త టీజీ వెంకటేష్ కు కట్టెబెట్టారు.

అలాంటి చంద్రబాబు, ఎంతో ‘విలువైన’ రాజ్యసభ ఎంపీ స్థానాన్ని అప్పనంగా జయప్రకాష్ నారాయణ్ చేతికి ఇస్తారా? అనే సందేహం చాలా మందిలో ఉంది. జేపీకి మాత్రం ఎంపీ కావాలని - దేశంలో అత్యున్నత నిర్ణాయక వ్యవస్థ అయిన చట్టసభలో తన గళం వినిపించాలనే కోరిక పుష్కలంగా ఉంది. గత ఎన్నికల్లో ఆయన మల్కాజ్ గిరి ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. ఆయనకు కోరిక ఉన్నంత మాత్రాన చంద్రబాబునాయుడు ఇస్తారా అనేది అనుమానమే. అయితే ఆ పదవికి సంబంధించి డీల్ కుదిరిందని, అందుకే జేపీ - తెదేపా అనుకూల ప్రకటనలు చేస్తున్నారని, చంద్రబాబుకు ఇబ్బంది లేకుండా ప్రస్తుత పరిస్థితుల్ని విశ్లేషిస్తున్నారని సోషల మీడియాలో విస్తృత ప్రచారం సాగుతోంది. ఏది ఏమైనా.. జేపీ ప్రమాణస్వీకారం జరిగే వరకు ఇలాంటి పుకార్లను నమ్మడం వృథా అని ఎక్కువమంది భావిస్తున్నారు.