Begin typing your search above and press return to search.

లోకేశ్ పేరు వాడుకున్నందుకు వేటు పడింది

By:  Tupaki Desk   |   3 Oct 2015 12:04 PM GMT
లోకేశ్ పేరు వాడుకున్నందుకు వేటు పడింది
X
కొత్త రాష్ట్రంలో ఉద్యోగులు చేయాల్సింది చాలా ఉన్నందున వారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు... దీంతో ఉద్యోగులు దారితప్పుతూ ప్రజా వ్యతిరేకత వస్తున్నా కూడా ఆయన చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కోసారి మంత్రులు, ఎమ్మెల్యేల కంటే కూడా ఉద్యోగులకే ఎక్కువ వెయిట్ ఇస్తున్నారు. అయితే...బ్యూరోక్రాట్లు ఆ విలువ ఉంచుకోవడం లేదని తాజా ఘటనలు చెబుతున్నాయి. ఆబ్కారీ శాఖలో కొద్ది నెలలుగా రచ్చరచ్చ సాగుతున్న సంగతి ఆ శాఖలోను, బయటా కూడా తెలుస్తోంది. ఏపీ ఎక్సైజ్ శాఖ అధికారుల అంతర్గత కుమ్ములాటలతో నవ్వుల పాలవుతోంది. ఎక్సైజ్ విధానం మార్చడం... ప్రభుత్వమే అమ్మకాలు చేపట్టడం వంటి మార్పుల నేపథ్యంతో అధికారులు చాలా వ్యవహారాలు నడిపించారన్న ఆరోపణలున్నాయి. పలు డిపోల్లో సరకు పెద్ద మొత్తంలో మాయమైనా కూడా చర్యలు లేవు. ఇటీవల ఆ శాఖలో బదిలీల విషయంలోనూ పెద్ద ఎత్తున పైరవీలు జరిగాయి... సూట్ కేసులు మారాయి. వీటన్నిటి నేపథ్యంలో చంద్రబాబు ఇక లాభం లేదని భావించి ఆ శాఖ కమిషనర్ శ్రీనివాస్ శ్రీనరేశ్ - డైరెక్టర్ దామోదర్లపై వేటేశారు. వారిద్దరినీ వెయిటింగులో పెట్టి ఆ రెండు బాధ్యతలనూ సీనియర్ ఐఏఎస్ అజయ్ కల్లంకు అప్పగిస్తూ జీఓ జారీ చేశారు. దీంతో కుమ్ములాటల అధికారులు... వారి వెనుక ఉన్న ఉద్యోగులకు ఒక్కసారిగా షాక్ తగిలింది.

ఎక్సయిజ్ శాఖలో వ్యవహారాలు మరింత శ్రుతిమించుతూ ప్రభుత్వ పెద్దలు - టీడీపీలో కీలక నేతలపైనా ఆరోపణలు చేస్తూ, వారి పేర్లను వాడుకుంటూ వివాదాలు రేగడం చంద్రబాబు దృష్టికి వచ్చింది. ఇటీవల ఓ జిల్లా ఎక్సయిజ్ సూపరింటిండెంట్ ను నుంచి నెలవారీ వాటాల విషయంలో వివాదమేర్పడిన సందర్బంలో పదవి పోగొట్టుకున్న ఉన్నతాధికారుల్లో ఒకరు సంచలనాత్మక వ్యాఖ్య చేసినట్లు చెబుతున్నారు. నేను లోకేశ్ కు నెలనెలా పంపించాలి... మీరంతా కలెక్ట్ చేసి ఇవ్వకపోతే ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి అని ఆయన అన్నట్లు చెబుతున్నారు. ఈ విషయం చంద్రబాబు చెవినపడిందని.... దానిపై ఆరా తీసి లోకేశ్ పేరు వాడుకుంటూ మామూళ్లు వసూలు చేస్తున్నారని గుర్తించి వేటు వేశారని చెబుతున్నారు.