Begin typing your search above and press return to search.

అది మిస్సయితే... బతిమాలు, బెదిరించు

By:  Tupaki Desk   |   25 July 2017 5:30 PM GMT
అది మిస్సయితే... బతిమాలు, బెదిరించు
X
నంద్యాలలో ఓటర్లను లోబరచుకోవడం ఎలా? రాష్ట్రవ్యాప్తంగా పరువు పోకుండా గట్టున పడడం ఎలా? ఏదో భూమా కుటుంబంలోనే టికెట్ ఇస్తే ఏకగ్రీవం అయిపోతుందనుకున్న పరిస్థితి కాస్తా ఎన్నిక దాకా వెళ్లిపోగానే.. తెలుగుదేశం నాయకులందరిలోనూ సాగుతున్న చర్చ ఇదే! చంద్రబాబు నాయుడు తనకు అలవాటుగా , అందరూ ఆయన గురించి అనుకునే వ్యూహాన్నే ఇక్కడ కూడా అనుసరిస్తున్నారు. సాధారణంనగా జనాభిప్రాయం చంద్రబాబు ఎప్పుడూ ఒకటే వ్యూహాన్ని రాజకీయంగా అనుసరిస్తుంటారు! ‘‘మభ్యపెట్టు - మభ్యపెట్టు - మభ్యపెట్టు’’ అనేదే! జనానికి ఎరవేయడం మాత్రమే ఆయనకు తెలిసిన ఏకైక మంత్రం అనేది ఆయనను ఎరిగిన పలువురు చెప్పేమాట!

కాన నంద్యాల ఉప ఎన్నిక విషయంలో పరిస్థితి కాస్త భిన్నంగా కనిపిస్తోంది. అదొక్కటే మంత్రం ప్రయోగిస్తే వర్కవుట్ అవుతుందా? లేదా? అనే చర్చ పార్టీలో సాగుతోంది. కేవలం పథకాలు ప్రకటించడం, ఇళ్లు కట్టిస్తాం అని చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదేమో.. ఇంకా ఏమైనా అవసరం అవుతుందేమో అనే అనుమానం పార్టీలో తొలినుంచి మెదలుతోంది. ఈ నేపథ్యంలోనే.. చంద్రబాబు నంద్యాల ఎన్నికల బరిలో ద్వివిధ సూత్రాన్ని అనుసరిస్తున్నారు. అదే ‘‘బతిమాలు- బెదిరించు’’ సిద్దాంతం.

సాధారణంగా ఎవ్వరైనా సరే తమ కార్యం చక్కబెట్టుకోవడానికి అందితే జుట్టు, అందకుంటే కాళ్లు పట్టుకుంటారనేది సామెత. అంటే కుదిరితే బెదిరిస్తారు, లేకుంటే బతిమాలుతారు అనేది భావం. కానీ నంద్యాల లో ఎన్నికల సమరాంగణం గనుక.. చంద్రబాబు వ్యూహం రివర్సులో సాగుతోంది. ముందు బతిమాలడం- ఆ తర్వాత మాత్రమే బెదిరించడం.

కాకపోతే.. బతిమాలడాలు - మభ్యపెట్టడాలు లాంటివి పథకాల రూపంలో ఉంటాయి గనుక.. మీడియా ద్వారా ప్రపంచానికి తెలుస్తున్నాయి గానీ.. వాస్తవంలో బెదిరింపులు మాత్రం లోలోపల జరిగిపోతున్నాయనే ప్రచారం నడుస్తోంది. కులాల పరంగా - మతాల పరంగా పెద్దలను పిలిపించి... వారి వారి వర్గాల నుంచి ఓట్లన్నిటినీ గంపగుత్తగా తమ పార్టీకే వేయించడం గురించి, వేయకపోతే వాటిల్లగల పర్యవసానాల గురించి సుతిమెత్తటి హెచ్చరికలు నోటిఫికేషన్ కంటె ముందే మొదలెట్టేసారని ఇక్కడ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. అధికారం ప్రస్తుతం వారి చేతుల్లోనే ఉండవచ్చు.. చంద్రబాబు స్ట్రాటజీలు ఇక్కడ పనిచేస్తాయా, బెదిరింపులు నంద్యాల పౌరులమీద పనిచేస్తాయో లేదో చూడాలి.