ఏపీలోనే దిక్కు లేదు - తెలంగాణపై ఆశ!

Thu May 24 2018 22:07:32 GMT+0530 (IST)

ఏపీలో చంద్రబాబు తాజా పరిస్థితి ఏంటని ఎవరినీ అడగాల్సిన అవసరం లేదు. కొన్నాళ్లుగా చంద్రబాబు బాడీ లాంగ్వేజ్ లో - మాటల్లో వచ్చిన మార్పును గమనిస్తే చాలు. ప్రత్యేక హోదా విషయంలో ఆ పార్టీ పూర్తిగా డిఫెన్సులో పడిపోయింది. జనాల్ని మభ్యపెట్టాలని చూసి- ప్రతిపక్ష నేత జగన్ నిరంతర పోరాటంతో అది సాధ్యం కాక తనే జగన్ రూట్లోకి వచ్చాడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. జన్మభూమి - నీరు చెట్టుతో కార్యకర్తలకు దోచిపెట్టడం అమరావతి-పోలవరం విషయంలో మాట తప్పడం - డ్వాక్వా -రైతు రుణమాఫీలకు అనేక షరుతులు విధించి వారికి అన్యాయం చేయడం ఫీజు రీఎంబర్స్ మెంట్ ను నిర్వీర్యం చేయడం - అడ్డగోలు ధరల పెంపు - అంగన్ వాడీలకు అన్యాయం - ఉద్యోగుల సమస్యలు గాలికొదిలేయడం.. ఇలా ఏ వర్గాన్ని కదిలించినా ఏపీలో ముఖ్యమంత్రిపై అసంతృప్తే. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గానికి 25 కోట్లు ఖర్చును టార్గెట్  పెట్టి మరీ సంపాదనకు తలుపు బార్లా తెరిచిన చంద్రబాబు ఇమేజ్ ఏపీలో దారుణంగా పడిపోయింది.అనుభవజ్ఞుడని నమ్మి అధికారం ఇస్తే కనీసం అసెంబ్లీ కట్టలేకపోయిన చంద్రబాబు ఈరోజు హైదరాబాదులో జరిగిన తెలంగాణ మహానాడులో మళ్లీ పాత క్యాసెట్ వేశారు. హైదరాబాదును నిర్మించింది తానే అని మరోసారి సిగ్గులేకుండా చెప్పేసుకున్నారు. పైగా అమరావతిలో ఒక్క శాశ్వత నిర్మాణానికి కాంపౌండ్ వాల్ కూడా వేయని బాబు హైదరాబాద్ తో పాటు తెలంగాణను కూడా అన్ని రంగాల్లో అభివృద్ది చేసింది టీడీపీ ప్రభుత్వమే గొప్పలు చెప్పారు. ఇందులో బాబు ఇచ్చిన అతిపెద్ద షాక్ ఏంటంటే... సివిల్ ఫస్ట్ ర్యాంకర్ ఘనతను కూడా తన అక్కౌంట్లో వేసేసుకున్నారు. *నాలెడ్జ్ అకాడమిక్ ఫౌండేషన్ వేయడంతోనే మెట్ పల్లి వాసికి సివిల్స్‌లో నెంబర్ వన్ ర్యాంక్ వచ్చిందని - శ్రీకాకుళం వ్యక్తికి జేఈఈలో నెం.1కి వచ్చిందని* వ్యాఖ్యానించి అందరినీ విస్మయానికి గురిచేశారు చంద్రబాబు.

టీడీపీ పుట్టింది హైదరాబాద్ లోనే కాబట్టి అలాంటి పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఒక వింత లాజిక్ ను చెప్పారు చంద్రబాబు. అంతేకాదండోయ్ దేశంలో తెలుగుదేశం పార్టీ గెలవడం చారిత్రక అవసరమన్నారు. తెలంగాణలో టీడీపీ నుంచి నాయకులు పోయారు గానీ - కార్యకర్తలు పార్టీ వెంటే ఉన్నారని చంద్రబాబు అన్నారు. సంవత్సరం పాటు పార్టీ కోసం పనిచేస్తామని ఇంట్లో చెప్పేయండని కుటుంబసభ్యులకు బాధ్యతలు అప్పగించండని టీడీపీ జెండా రెపరెపలాడిన తర్వాతే విశ్రాంతి తీసుకోవాలని టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు ఇచ్చిన పిలుపులో కొంత ఉత్సాహం కనిపించింది. ఏంటా అని ఆరా తీస్తే..  ఆ ఆనందం వెనుక కర్ణాటక డ్రీమ్స్ ఉన్నాయంటున్నారు. ఈసారి టీఆర్ ఎస్ కు గతం కంటే తక్కువ వస్తాయని అంచనా వేస్తున్న బాబు... కర్ణాటకలో మాదిరే తెలంగాణలో కూడా హంగ్ వచ్చి తెలుగుదేశం జేడీఎస్‌లాగా అధికారంలోకి తేవాలని నేతలకు చెప్పారు. 119లో కేవలం 30 సీట్లకు టార్గెట్ పెట్టుకోండి చాలు అధికారం మనదే నాయకులకు సూచించారట. ఇదంతా చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో ఏపీలో విజయావకాశాలపై చంద్రబాబుకు కూడా నమ్మకం సన్నగిల్లినట్టుంది. ఏదో ఇక్కడైనా చక్రం తిప్పే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. కానీ గమత్తు ఏంటంటే... ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్ పై పోటీ చేయడానికి ఆ పార్టీకి డిపాజిట్లు గెలుచుకోగల నాయకులు దొరకడం లేదని సమాచారం. ఎవరి కర్మకు వారే బాధ్యులు అంటే ఇదే. ఓడలు బళ్లు బళ్లు ఓడలు అవ్వడం చంద్రబాబుకు స్వానుభవం కానంది ఏపీలో!