Begin typing your search above and press return to search.

కొద‌మ‌సింహాల్లా పోరాటం చేయ‌మంటున్న బాబు

By:  Tupaki Desk   |   25 May 2017 4:24 AM GMT
కొద‌మ‌సింహాల్లా పోరాటం చేయ‌మంటున్న బాబు
X
తెలంగాణ‌ టీడీపీ నిర్వ‌హించిన‌ మహానాడులో తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కార్య‌క‌ర్త‌ల్లో ఉత్సాహం నింపే ప్ర‌సంగం చేశారు. టీడీపీ వచ్చాకే తెలంగాణలో అనేక మార్పులు వచ్చాయి. హైదరాబాద్‌ అభివృద్ధికి ఆనాడే గట్టి పునాదులు వేశామ‌ని, ప్రాజెక్టుల నిర్మాణాలు త‌మ హయాంలోనే ప్రారంభించామ‌ని చంద్ర‌బాబు వివ‌రించారు. ప్ర‌భుత్వం తీరుపై ఈ రెండేళ్లు పోరాటం చేయాల‌ని పిలుపునిచ్చిన బాబు మీకు అండగా నేనుంటానని భ‌రోసా ఇచ్చారు. తెలంగాణలో టీడీపీ జెండా రెపరెపలాడే వరకూ పోరాటం కొన‌సాగించాల‌ని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. తెలంగాణ ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పని చేయాలని, తెలంగాణలో ప్రతీ కార్యకర్త కొదమసింహాల్లా దూసుకెళ్తున్నారని బాబు ప్ర‌శంసించారు.

పోరాటాల సమయంలో కష్టం, సుఖం వచ్చినప్పుడు మీతోనే ఉన్నానని చంద్ర‌బాబు గుర్తు చేశారు. కష్టపడటం వల్లే మన పార్టీ బాగుపడుతోందని తెలిపారు. తెలంగాణలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది టీడీపీయేనన్నారు. తెలుగువారికి ఏ కష్టమొచ్చినా అండగా ఉండే పార్టీ మనదని చంద్ర‌బాబు చెప్పారు. టీడీపీ ఎక్కడున్నా.. ప్రజల కోసం పనిచేస్తుందన్నారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాటాలు ఆపేది లేదని చెప్పారు. కేవలం 50రోజుల్లో 7.5లక్షల మంది సభ్యత్వ నమోదు చేసిన తెలంగాణ టీడీపీ నేత‌లు అంతా ఏకతాటిపై నడుస్తూ...నడిపిస్తూ ముందుకెళ్లాలని చంద్ర‌బాబు అన్నారు.

ఈ సంద‌ర్భంగా టీ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి అమరుల కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. కేవలం 500 అమరుల కుటుంబాలను ఆదుకుని చేతులు దులుపుకుందన్నారు. కేజీ నుంచి పీజీ విద్య ఇంతవరకు అమలు కాలేదన్నారు. ఫీజు రీయింబర్స్‌ అందకపోవడంతో అర్థాంతరంగా చదువు ఆపేస్తున్నారన్నారు. ఇప్పటి వరకు ఒక్క టెట్‌ అయినా నిర్వహించలేదన్నారు. తెలంగాణ వచ్చాకే సిర్పూర్‌, రేయన్స్‌ ఫ్యాక్టరీలు మూతపడ్డాయన్నారు. రోజుకు ముగ్గురు రైతుల చొప్పున ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. 2లక్షల ఖాళీలను భర్తీ చేయకుంటే.. ప్రభుత్వంపై యుద్దం చేస్తామని ప్ర‌క‌టించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/