Begin typing your search above and press return to search.

బాబును ఎవరూ ఓడించలేదట!

By:  Tupaki Desk   |   4 Dec 2016 8:00 AM GMT
బాబును ఎవరూ ఓడించలేదట!
X
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొన్ని అంశాలను విశ్లేషించే తీరు చూస్తేంటే ఒక్కో సారి ఆశ్చర్యం వేయక మానదు. పరస్పర విరుద్ధమైన భావాలను వెల్లడించడంలో బాబుది అందెవేసిన చేయి అని ఆయన విమర్శకులు అనేక సందర్భాల్లో తప్పుపట్టిన సంగతి తెలిసిందే. అలాంటి అవకాశమే మరోమారు ఇచ్చేలా చంద్రబాబు మాట్లాడారు. ఢిల్లీలో జరుగుతున్న నాయకత్వ సదస్సుకు హాజరైన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తనను ఇప్పటివరకు ఎవరూ ఓడించలేదని ప్రకటించేశారు. మరి 2004 - 2009 తొమ్మిది ఎన్నికల పరాజయం సంగతి ఏమిటని ప్రశ్నిస్తే...'ఆ ఓటమి నా చర్యల ఫలితం' అని చంద్రబాబు స్వయంగా విశ్లేషించారు.

నాయకత్వ సదస్సుపై జరిగిన ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ... తన జీవితంలో ఓటమి ఎరుగనని ప్రకటించారు. 2004 -2009 ఎన్నికల్లో తన సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ వైఫల్యానికి తన చర్యలు కారణంగా చంద్రబాబు తెలిపారు. తదనంతర కాలంలో తన చర్యలను సమీక్షించుకున్నానని తద్వారా ప్రజలకు చేరువ అయి అధికారాన్ని సాధించానని చంద్రబాబు వివరించారు. అత్యంత ఆసక్తికరంగా ఓటమికి మాత్రం కారణాలు చూపి...గెలుపును తన ఖాతాలో జమచేసుకున్నారని చంద్రబాబు విమర్శకులు అంటున్నారు. పరిపాలనలో ముఖ్యమంత్రిగా - అధ్యక్షుడిగా పార్టీకి గెలుపు-ఓటములకు బాధ్యత వహించాల్సిన వ్యక్తి ఇలా విభిన్న వాదనలు వినిపించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 2004 వరకు కొనసాగిన బాబు పాలనను ప్రజలు తిరస్కరించి మరో దఫా అవకాశం ఇవ్వకపోవడం బాబు వైఫల్యం కాకా మరేమిటని ధర్మసందేహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ప్రతిపక్ష నేతగా అయినా చంద్రబాబు ప్రజల పక్షాన నిలిచి ఉంటే 2009లో వారే గద్దె ఎక్కించే వారు కదా అంటూ ఆశ్చర్యపోతున్నారు. అది కూడా జరగకుండా 294 సీట్లలో కేవలం 40 సీట్లకే పరిమితం అయిపోవడానికి బాబుది బాధ్యత కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు.

చంద్రబాబు తరచూ చెప్పే మరోమాట సింగపూర్ తరహాలో ఒకే పార్టీ ఎన్నికల్లో విజయం సాధించడం. ఏపీలో కూడా అదే ట్రెండ్ సెట్ చేయాలని పార్టీ నేతలకు తరచూ బాబు బోధిస్తుంటారు. అలాంటి అనూహ్య, అత్యద్భుత విజయం సాధించాలంటే ఇలా గెలుపు నా సొంతం..ఓటమి సమిష్టి వైఫల్యం అనే నాయకత్వంలో ఎలా సాధ్యమని పార్టీ వర్గాలు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి. పైగా ఇప్పటికీ తెలంగాణలో టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో అయితే...పోటీ కూడా చేయలేదు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అయితే ఏకైక సీటుతో ఉనికిని కాపాడుకున్న శృంగభంగం. వీటన్నింటికీ ఎవరు బాధ్యులు అవుతారని తటస్థుల ప్రశ్న. తమ నాయకుడిలాగా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే ఇక టీం వర్క్ అనే పదానికి అర్థం ఏముంటుంది అనేది వారి సందేహం. నిజమే కదా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/