Begin typing your search above and press return to search.

పిట్ట‌క‌థ‌ల‌తో ఎంజాయ్ చేస్తే దెబ్బే బాబు!

By:  Tupaki Desk   |   9 May 2018 5:22 AM GMT
పిట్ట‌క‌థ‌ల‌తో ఎంజాయ్ చేస్తే దెబ్బే బాబు!
X
అధికారంలో ఉన్న వారికి ఎలాంటి పొగ‌డ్త‌లు వ‌స్తుంటాయో అస్స‌లు ఊహించ‌లేరు. ఓప‌క్క ప్ర‌జ‌లు చెడామ‌డా తిడుతున్నా.. వాటిని ద‌రి చేర‌కుండా అధినేత మ‌న‌సుల్ని దోచుకునేలా చెప్పే మాట‌లు చూస్తే.. ముఖ్య‌నేత‌లు రాంగ్ ట్రాక్ ఎలా ఎక్కుతారో ఇట్టే తెలిపే ఘ‌ట‌న‌గా ఈ ఉదంతాన్ని చెప్పాలి.

సాధార‌ణంగా ప‌వ‌ర్లో ఉన్న వారిని ఇంద్రుడు.. చంద్రుడు అంటూ కీర్తిస్తుంటారు. అయితే.. ఇలాంటి పొగ‌డ్త‌ల‌కు ప‌డిపోకుండా వ్య‌వ‌హ‌రించిన వారే అధికారంలో కంటిన్యూ అవుతారు. ఏ మాత్రం త‌ల‌కెక్కినా ఫ‌లితం ఇబ్బందిక‌రంగా ఉంటుంది. పీక‌ల్లోతు ఆర్థిక క‌ష్టాలు.. అంత‌కు మించిన అవినీతి.. బంధుప్రీతితో తీవ్ర విమ‌ర్శ‌ల్లో చిక్కున్న ఏపీ స‌ర్కారు ముచ్చ‌ట ఎలా ఉన్నా.. క్షేత్ర స్థాయిలో ఏం జ‌రుగుతుందో అధికారులు బాబు ద‌రికి తీసుకెళ్ల‌ర‌న్న మాట బ‌లంగా వినిపిస్తూ ఉంటుంది.

నిత్యం పొగ‌డ్త‌ల‌తో కాల‌క్షేపం చేయ‌ట‌మే మిన‌హా.. గ్రౌండ్ లెవ‌ల్లో త‌న మీద ఉన్న‌వ్య‌తిరేక‌త ఎంత‌న్న‌ది బాబు లాంటోళ్ల‌కు అస్స‌లు ప‌ట్ట‌ద‌ని చెబుతుంటారు. తెలుగు త‌మ్ముళ్లు సైతం ఇదే ఆవేద‌న‌ను లోగుట్టుగా వ్య‌క్తం చేస్తుంటారు. రానున్న‌ది ఎల‌క్ష‌న్ ఇయ‌ర్ అని.. త‌ప్పుడు మాట‌ల్ని వినే చంద్ర‌బాబు క్షేత్ర‌స్థాయిలో ఎలాంటి ప‌రిస్థితి ఉంద‌న్న విష‌యాన్ని అస్స‌లు ప‌ట్టించుకోవ‌టం లేద‌న్న మాట బ‌లంగా వినిపిస్తూ ఉంటుంది. దీనికి త‌గ్గ‌ట్లే ఆయ‌న చుట్టు ఉండే భ‌జ‌న బృందం ఆయ‌న్ను ఎప్ప‌టిక‌ప్పుడు రాంగ్ ట్రాక్ లోకి తీసుకెళుతున్న‌ట్లు చెబుతారు.

తాజాగా ఏపీలో క‌లెక్ట‌ర్ల సద‌స్సు జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా పంచాయితీరాజ్ ముఖ్య‌కార్య‌ద‌ర్శి రామాంజ‌నేయులు మాట్లాడుతూ.. చంద్రబాబును ఏకంగా శ్రీ‌రాముడితో పోల్చేశారు. అదే టైంలో క‌లెక్ట‌ర్ల‌ను రామ‌భ‌క్త ఆంజ‌నేయుడిగా పోల్చేస్తూ క‌థ చెప్పారు. స్వాతంత్య్రం వ‌చ్చాక ఎప్పుడూ సాధించ‌ని రీతిలో ఎడీఎఫ్ ను సాధిస్తున్న‌ట్లు చెప్పుకొచ్చారు. చిత్తూరు క‌లెక్ట‌ర్ ప్ర‌ద్యుమ్న భారీ ఎత్తున వ్య‌క్తిగ‌త మ‌రుగుదొడ్ల‌ను నిర్మించిన‌ట్లు చెప్పారు.

ఆంజ‌నేయుడు స‌ముద్రం దాటి లంక‌కు వెళ్ల‌గ‌ల‌మా అని భ‌య‌ప‌డ్డాడ‌ని.. కానీ మ‌న‌సులో రాముడిని త‌ల‌చుకోగానే.. ఆత్మ‌విశ్వాసం పెరిగి గాల్లోకి ఎగిరి దాటాడ‌ని.. అదే విధంగా ముఖ్య‌మంత్రి పేరును త‌ల‌చుకోగానే క‌లెక్ట‌ర్ల ల‌క్ష్యాన్ని అధిగ‌మిస్తున్నార‌ని రామాంజ‌నేయులు చెప్ప‌టంతో బాబుతో స‌హా అక్క‌డున్న ఉన్న‌తాధికారులంతా న‌వ్వేశారు. అప్ప‌టికి వాతావ‌ర‌ణం బాగానే ఉన్నా.. రామాంజ‌నేయులు లాంటోళ్ల మాట‌లు బాబు లాంటి నేత‌ల మీద తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తుంటాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.