Begin typing your search above and press return to search.

కొన్ని క‌ల‌లు.. కొన్ని గొప్ప‌లు.. బాబు స్పీచ్‌

By:  Tupaki Desk   |   30 May 2017 4:22 AM GMT
కొన్ని క‌ల‌లు.. కొన్ని గొప్ప‌లు.. బాబు స్పీచ్‌
X
మూడు రోజుల మ‌హానాడు ముచ్చ‌ట ముగిసింది. అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించిన మ‌హానాడు కార్య‌క్ర‌మంలో అధికార పార్టీ హ‌డావుడి స్ప‌ష్టంగా క‌నిపించింది. ప‌దేళ్లు ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు నిర్వ‌హించిన మ‌హానాడుల‌కు.. ప‌వ‌ర్ లోకి వ‌చ్చాక నిర్వ‌హిస్తున్న మ‌హానాడులో వ్య‌త్యాసం తాజా మ‌హానాడులో మ‌రోసారి క‌నిపించింది.

టీడీపీ కేంద్ర క‌మిటీ అధ్య‌క్షుడిగా నారా చంద్ర‌బాబు నాయుడు వ‌రుస‌గా రెండోసారి ఎన్నిక‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పార్టీ నేత‌లు.. కార్య‌క‌ర్త‌లు.. అభిమానుల్ని ఉద్దేశించి ప్ర‌సంగించారు. మ‌హానాడు జ‌రిగిన మూడు రోజులూ మాట్లాడిన చంద్ర‌బాబు.. చివ‌రి రోజు త‌న సందేశాన్ని వినిపించిన వైనం చూసిన‌ప్పుడు బాబు మార్కు స్ప‌ష్టంగా క‌నిపించింది. కాసిన్ని క‌ల‌లు.. మ‌రికాసిన్ని గొప్పలు.. వెర‌సి చంద్ర‌బాబు ప్ర‌సంగంగా చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌హానాడు జ‌రిగిన తీరు గురించి చెప్పుకున్న ఆయ‌న ప్ర‌సంగాన్ని చూస్తే..

= విశాఖలో సింహాద్రి అప్పన్న సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశా. ఈ మహానాడులో 34 తీర్మానాలు ప్రవేశపెట్టాం. 94 మంది మాట్లాడారు. 27 గంటలు చర్చలు జరిగాయి.

= మారిన పరిస్థితులకు త‌గ్గ‌ట్లు ప్రపంచంలో వస్తున్న వాటిని చర్చించి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలని ఆలోచించే విశిష్టత టీడీపీ సొంతం. ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను. విశాఖలో మహానాడు చాలా బాగా జరిగింది. ఇంత బ్రహ్మాండంగా ఏ మహానాడూ జరగలేదు.

= వేదిక దగ్గర నుంచి కార్య‌క్ర‌మాల్ని బ్రహ్మాండంగా నిర్వ‌హించారు. ఏపీకి జీవనాడి పోలవరం ద్వారా రాష్ట్రంలో కరవు లేకుండా చేసేందుకు త్వరితగతిన ముందుకెళ్తున్నాం. విశాఖలో హుద్‌హుద్‌ తుపానులో పూర్తిగా దెబ్బ తిన్నాం. అయినా.. న‌మ్మ‌కంతో ముందుకెళ్లాం.

= విశాఖ అంటే ఒక నమ్మకం. ఇక్కడి ప్రజలు చాలా మంచి వాళ్లు. విశాఖ ఉక్కు కోసం ఎలా పోరాడారో.. తుపాను ధాటికి ధ్వంసమైన నగరాన్ని మళ్లీ బ్రహ్మాండమైన నగరంగా తీర్చిదిద్దాలని ఉక్కు సంకల్పంతో ముందుకొచ్చారు. ఇదో గొప్ప విజయం.

= కష్టాలొస్తే దిగులుబడిపోతాం. మనవల్ల కాదనుకుంటాం. ఏం చేయగలుగుతాం లే అనుకుంటాం. అది ఇంతేన‌నే ఆలోచనలు వస్తాయి. కానీ ఈ రోజు చూస్తే.. విశాఖ వాసులు ముందుకొచ్చారు. విశాఖను సుందర నగరంగా తిర్చిదిద్దుకొని ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నిజ‌మైన‌ అవసరం వచ్చినప్పుడు ముందుకు రావడం నా నైజం.

= రెండు రాష్ట్రాల్లో టీడీపీ శాశ్వతంగా ఉండాలి. విశాఖను నెంబర్‌ వన్‌ సిటీగా తీర్చిదిద్దుతాం. గోదావరి నీటిని విశాఖకు తీసుకొస్తాం. ముఠా రాజకీయాలు, హత్యా రాజకీయాలకు టీడీపీ వ్యతిరేకం. తెలుగువారు ఎక్కడున్నా అత్యున్నతమైన స్థానంలో ఉండాలి. టీడీపీని దెబ్బ తీసేందుకే విభజన వాదాన్ని కాంగ్రెస్‌ తీసుకొచ్చింది. రాష్ట్ర విభజనతో ఎన్నో సమస్యలు వచ్చాయి. ఒక్కొక్కటిగా సమస్యలను అధిగమిస్తున్నాం. రైతు రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రం ఏపీనే.

= శ్రీకాకుళం, నాగావళి, వంశధారలను అనుసంధానం చేస్తాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఫేజ్‌ -1ను ప్రారంభిస్తున్నాం. రూ.2వేల కోట్లతో ఏడాదిలోగా పూర్తి చేస్తాం. 2018లోగా 1.30 ల‌క్ష‌ల ఎకరాలకు నీరు అందేలా చర్యలు తీసుకుంటాం. కోటవురట్ల.. నర్సీపట్నం ప్రాంతాలకు సుజల స్రవంతి ద్వారా నీరందిస్తాం.

= ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా అంతే మొత్తంలో ప్యాకేజీ ఇస్తామంటే అంగీకరించాం. రాజధాని కోసం ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా 33వేల ఎకరాలు సేకరించాం. ఉత్తరాంధ్రకు రైల్వే జోన్‌ రావాలని అడిగాం, తప్పకుండా తెస్తాం. వెనుకబడిన జిల్లాలకు నిధులు రావాలి.

= పొత్తు పెట్టుకున్న తర్వాత ఒకరినొకరు విమర్శించుకోవడం మంచిది కాదు. బీజేపీ నేతలు విమర్శించినా టీడీపీ నేతలు విమర్శించొద్దు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ తిరిగి కోలుకునే పరిస్థితి లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దేనిపైనా స్పష్టత లేదు. అనుభవం లేదు. రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతంరం శ్రమిస్తా. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే ఏకైక పార్టీ టీడీపీనే’ అన్నారు.

= టీడీపీకి సుదీర్ఘ చ‌రిత్ర ఉంది. ప్రతి కార్యకర్త నిరంతరం పార్టీ కోసం పని చేశారు. ఇబ్బందులున్నా వెనుతిరిగి చూడలేదు. ప్రాణాలు పోయినా తెలుగుదేశంలో ఉండాలని కోరుకున్న కార్యకర్తలందరికీ వందనం. అందరం సమష్టిగా పని చేయడమే ఈ విజయానికి కారణం.

= సమాజం కోసం పనిచేయాలి. అదే సమయంలో పార్టీ కార్యకర్తలకు గౌరవం ఇవ్వాలి. వారిని ఆదుకోవాలి. వారి మనోభావాలను అర్థంచేసుకొని పని చేయాల్సిన గురుతర భాద్యత నాయకులపై ఉంది. మహానాడులు మనకు కొత్త కాదు. చాలా చేశాం. . ఏడాదికేడాది అనేక మార్పులు వస్తున్నాయి. టెక్నాలజీ మారుతోంది. కొత్త సమస్యలు వస్తున్నాయి. నాలెడ్జ్‌ ఎకానమీ వస్తోంది.

= రాజకీయ పార్టీ నేతలుగా, కార్యకర్తలుగా ఆలోచించాల్సింది.. పరిస్థితులకు అనుగుణంగా మారడం ఎలా అనేది. విజ్ఞాన సమాజం కోసం పని చేయాలి. అప్పుడే పార్టీ మనుగడ సాధ్యం. మారకపోతే పరిస్థితులు వారిని మారుస్తాయి. మారలేనప్పుడు వారిని మార్చేసి వేరే వారిని తీసుకుంటాయి. కాలం ఎవరి కోసం వేచిచూడదు.

= తెలుగు వాళ్లు ఎక్కడ ఉన్నా గొప్పస్థాయిలో ఉండాలని కోరుకుంటా.అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించారు. రాష్ట్ర విభజన జరిగి మూడేళ్లు పూర్తయినా ఇంకా అనేక సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోయి ఉన్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/