Begin typing your search above and press return to search.

రౌడీలు బెదిరించటం ఏమిటి చంద్రబాబు?

By:  Tupaki Desk   |   29 May 2016 4:50 AM GMT
రౌడీలు బెదిరించటం ఏమిటి చంద్రబాబు?
X
కొన్ని మాటలు కొందరి నోటి నుంచి రావటం అస్సలు సూట్ కావు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి రౌడీలు బెదిరిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేయటం అభ్యంతరకరమే. సీఎం స్థాయి వ్యక్తి రౌడీలు బెదిరిస్తున్నారన్న మాట చెప్పటం ఏమిటి? వారి పీచమణిచేలా చర్యలు తీసుకోవాలే తప్పించి.. వివరణ ఇవ్వటం ఏమాత్రం బాగోలేదన్న భావన వ్యక్తమవుతోంది. ఈ తరహా చర్య రాజకీయాలకు కొత్తగా వచ్చి.. ముఖ్యమంత్రిగా బాధ్యతల్ని తాజాగా తీసుకున్న అధినేత నోటి నుంచి ఇలాంటి మాటలు వస్తే కాస్త అర్థం చేసుకోవచ్చు. కానీ.. రాజకీయాల్లో తలపండిన చంద్రబాబు లాంటి నేత నుంచి వచ్చిన మాటలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తిరుపతిలో తాజాగా జరుగుతున్న మహానాడులో ప్రసంగించిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు.. పారిశ్రామికవేత్తలను.. వ్యాపారులను రౌడీలు బెదిరిస్తున్నారని వ్యాఖ్యానించారు. గతంలో తన పాలనలో రౌడీలు రాష్ట్రం విడిచి పారిపోయినట్లుగా గొప్పలు చెప్పుకున్న బాబు.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేయటం గమనార్హం. తుని రైలు ఘటన గురించి ప్రస్తావిస్తూ ఆవేదన వ్యక్తం చేసిన బాబు.. తుని రైలు దహనం కేసులో బాధ్యులైన వారిపై ఎందుకు కేసులు పెట్టలేదన్న విషయానికి సూటి సమాధానం చెబితే బాగుండేది.

నిత్యం బుల్లెట్ లా దూసుకెళతానని చెప్పే చంద్రబాబు.. నేరస్తుల విషయంలోనూ ఆలానే దూసుకెళ్లాలి. కానీ.. అందుకు భిన్నంగా రౌడీలు బెదిరిస్తున్నారని చెప్పటం ఏ మాత్రం సరికాదని చెప్పాలి. తాను గతంలో చేసిన పనుల గురించి గొప్పలు చెప్పే బాబు.. ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఎందుకు అలాంటి పనులు చేయటం లేదు? తుని ఘటనే తీసుకుంటే.. రైలు తగలబెట్టిన కేసులో నిందితుల్లో ఒక్కరినైనా ఎందుకు అదుపులోకి తీసుకోలేదు? లాంటి ప్రశ్నలు వేయించుకునే అవకాశం ఇవ్వటం ఏమిటో..?