Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ తాయిలం పెట్టె తెరిచిన చంద్ర‌బాబు

By:  Tupaki Desk   |   12 Feb 2019 8:00 AM GMT
మ‌ళ్లీ తాయిలం పెట్టె తెరిచిన చంద్ర‌బాబు
X
ఐదేళ్లు ఎలా పాలించినా ఫ‌ర్లేదు.. ఎన్నిక‌లు ముంగిట్లోకి వ‌చ్చిన వేళ‌లో తాయిలం పెట్టె బ‌య‌ట‌కు తీసి..ప‌ప్పు బెల్లాలు పంచిన‌ట్లుగా సంక్షేమ ప‌థ‌కాల్ని అమ‌లు చేస్తున్న తీరు ఏపీలో ఇప్ప‌టికే హాట్ టాపిక్ గా మారింది. డ్వాక్రా మ‌హిళ‌ల‌కు సాయం.. ప‌సుపుకుంకుమ పేరుతో మ‌హిళ‌ల‌కు ఆర్థిక వెసులుబాటు.. డ‌బుల్ బెడ్రూం ఇళ్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఏ వ‌ర్గానికి ఆ వ‌ర్గానికి అంతో ఇంతో మేలు క‌లిగించే ప‌నుల్ని వ‌రుస పెట్టి చేస్తున్న చంద్ర‌బాబు స‌ర్కారు తాజాగా జీవో 49ను విడుద‌ల చేసింది.

ప్ర‌భుత్వం అన్నాక జీవోలు జారీ చేయ‌టం మామూలే. కానీ.. ఏపీ స‌ర్కారు తాజాగా విడుద‌ల చేసిన జీవో 49 ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఎందుకంటే.. ఈ జీవోతో ఇప్ప‌టివ‌ర‌కూ 65 ఏళ్లు నిండిన వారికి మాత్ర‌మే ఇచ్చే వృద్ధాప్య పింఛ‌న్ల‌ను ఈ జీవోతో 50 ఏళ్ల‌కు కుదించిన‌ట్లు అవుతుంది. అన్ని వ‌ర్గాల వారికి కాదు కానీ.. గిరిజ‌నుల పింఛ‌న్ అర్హ‌త వ‌య‌సు 50కు మారుతుంది. దీంతో.. దాదాపు 15 వేల మంది ల‌బ్థి పొందుతార‌ని చెబుతున్నారు.

తాజా ప‌థ‌కంతో అత్యంత వెనుక‌బ‌డిన గిరిజ‌నుల్లో 15 వేల మంది అద‌నంగా కొత్త పింఛ‌న్లు జారీ కానున్నాయి. ఇది కూడా కేవ‌లం విశాఖ జిల్లాలోనే. ఈ లెక్క‌న ఏపీ వ్యాప్తంగా ఉండే గిరిజ‌నుల‌సంఖ్య భారీగా ఉండ‌నుంది. వ‌చ్చే నెల నుంచి పింఛ‌న్ల సొమ్ము పంపిణీ కానుంది. ఎన్నిక‌ల నాటికి ఈ ప‌థ‌కం బాబు స‌ర్కారుకు ప్ర‌యోజ‌నంగా మారుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల కావ‌టానికి ముందే యుద్ధ ప్రాతిప‌దిక‌న గ‌తంలో తాను ఇచ్చిన హామీలు అమ‌లు చేస్తున్న బాబు తీరుపై ఏపీ ప్ర‌జ‌లు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.