Begin typing your search above and press return to search.

టీడీపీ అటాక్ షురూ!...అమంచి బ్ర‌ద‌ర్ అరెస్టేనా?

By:  Tupaki Desk   |   18 Feb 2019 2:00 PM GMT
టీడీపీ అటాక్ షురూ!...అమంచి బ్ర‌ద‌ర్ అరెస్టేనా?
X
వ‌రుస‌గా నేత‌లంతా క్యూ క‌ట్టి పార్టీకి రాజీనామా చేయ‌డంతో పాటుగా విప‌క్ష వైసీపీలోకి చేరుతున్న వైనంపై ఏపీలో అధికార పార్టీ టీడీపీ ఏం చేయాలో కూడా పాలుపోని స్థితిలో ప‌డిపోయింది. అస‌లు వ‌ల‌స‌ల‌ను ఆపేదెలా అంటూ మొన్న‌టి పొలిట్ బ్యూరో భేటీ పెట్టి మ‌రీ బుర్ర‌ల‌కు ప‌దును పెట్టిన టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు... ఏ ఒక్క‌ సొల్యూష‌న్ కూడా దొర‌క‌క‌పోవ‌డంతో త‌ల ప‌ట్టుకున్నార‌ట‌. అయితే పార్టీ మారిన నేత‌లను ల‌క్ష్యంగా చేసుకుని దాడులు చేయిస్తే ఎలా ఉంటుంద‌న్న కోణంలో వ‌చ్చిన ఓ చిన్న ఆలోచ‌న‌ను ఇప్పుడు టీడీపీ అమ‌ల్లోకి పెట్టేసింద‌ట‌. ఈ ప్లాన్ లో భాగంగా ప్ర‌కాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌ మోహ‌న్ నుంచి మొద‌లైపోయింద‌న్న వాద‌న కూడా ఇప్పుడు బ‌లంగానే వినిపిస్తోంది. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ఇండిపెండెంట్‌ గా పోటీ చేసిన ఆమంచి టీడీపీకి పెద్ద షాకిస్తూ ఘ‌న విజ‌యం సాధించారు.

ఆ త‌ర్వాత మారిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఆమంచి టీడీపీ గూటికి చేరిపోయారు. ఈ క్ర‌మంలో ఆమంచికి ఏం కావాలో చూడాలంటూ పార్టీ నేత‌ల‌కు చంద్ర‌బాబు సూచించార‌ట‌. మొత్తంగా ఇండిపెండెంట్‌ గా విజ‌యం సాధించిన ఆమంచిని టీడీపీ నేత‌లు అన్ని ర‌కాలుగా బాగానే చూసుకున్నారు. అయితే ఆ త‌ర్వాత ఆమంచికి చెక్ పెట్టే దిశ‌గా టీడీపీ త‌న‌దైన శైలి య‌త్నాల‌ను కూడా చేప‌ట్టింది. ఈ య‌త్నాల‌న్నింటినీ గ‌మ‌నించిన ఆమంచి... టీడీపీలో ఉంటే ఇక త‌న ప‌ని అయిపోయిన‌ట్టేన‌ని భావించి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. టీడీపీకి రాజీనామా చేసేసి... వైసీపీలో చేరిపోయారు. దీంతో ఒక్క‌సారిగా షాక్ తిన్న టీడీపీ.. ఇప్పుడు ఆమంచిని టార్గెట్ చేస్తూ త‌న‌దైన మంత్రాంగానికి ప‌దును పెట్టిన‌ట్టుగా తెలుస్తోంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో - ఆ త‌ర్వాత ఆమంచి వ‌ర్గం పై ప‌లు కేసులు న‌మోద‌య్యాయి.

ప్ర‌త్యేకించి ఆమంచి సోద‌రుడు ఆమంచి స్వాములు పై ప‌లు క్రిమినల్ కేసులున్న విష‌యాన్ని నిన్న‌టిదాకా ఉద్దేశ‌పూర్వ‌కంగానే మ‌రిచిన టీడీపీ... ఇప్పుడు ఆ కేసుల‌న్నింటినీ తిర‌గ‌దోడేందుకు రంగం సిద్ధం చేసింద‌ని ఆమంచి వ‌ర్గీయులు చెబుతున్నారు. ఆమంచి పార్టీ మారిన వెంట‌నే చీరాల మునిసిపాలిటితో పాటుగా నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా ఉన్న ఆయ‌న ఫ్లెక్సీ లన్నీ మాయ‌మైపోయాయ‌ట‌. అంతేకాకుండా ఆమంచితో పాటు ఆయ‌న వ‌ర్గం మొత్తం పైనా టీడీపీ స‌ర్కారు ప్ర‌త్యేక నిఘా పెట్టింద‌ట‌. మారుతున్న ప‌రిణామాల‌ను ప‌రిశీలిస్తున్న ఆమంచి వ‌ర్గం ఇప్పుడు తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆమంచిని టార్గెట్ చేసే క్ర‌మంలో ఆయ‌న సోద‌రుడు స్వాములును ఏకంగా అరెస్ట్ చేసినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న వ‌ర్గీయులు చెబుతున్నారు. మొత్తంగా ఇప్పుడు చీరాల‌లో ఆమంచి టార్గెట్‌ గా టీడీపీ అనుస‌రిస్తున్న న‌యా వ్యూహంపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.