Begin typing your search above and press return to search.

బాబుగారు త‌ప్పు ఒప్పుకొన్న‌ట్లేనా?

By:  Tupaki Desk   |   24 April 2017 6:13 AM GMT
బాబుగారు త‌ప్పు ఒప్పుకొన్న‌ట్లేనా?
X
చిత్తూరు జిల్లా ఏర్పేడులో జ‌రిగిన లారీ ప్ర‌మాదం ఘటన కొత్త మలుపు తిరిగింది. ఇప్పటి వరకు డ్రైవర్‌ తప్ప తాగి లారీ నడపడం వల్లే ప్రమాదం జరిగిందని అధికార తెలుగుదేశం పార్టీ నేత‌లు చెబుతున్న విషయం తెలిసిందే! అయితే స్థానికులు, ప్ర‌తిప‌క్షాలు మాత్రం టీడీపీ నేత‌ల మాఫియా చేసిన అరాచ‌క‌మే ఈ ప‌రిస్థితి అని మండిప‌డుతున్నారు. కాగా, తాజాగా ఈ ఘటనలో టీడీపీ నేతలకు సంబంధముందన్న విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి, టీడీపీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు అంగీకరించారు. చిత్తూరు జిల్లాకు చెందిన‌ తెలుగుదేశం పార్టీ నాయకులు ధనుంజయనాయుడు, చిరంజీవినాయుడును పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వారిని అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

ఢిల్లీలో జరిగిన నీతి అయోగ్‌ పాలక మండలి మూడో సమావేశం ముగిసిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం చంద్ర‌బాబు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా ఏర్పేడులో జరిగిన ప్రమాదం చాలా దురదృష్టకరమని అన్నారు. ప్రమాద ఘటనపై సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి నేతృత్వంలో విచారణ జరిపిస్తామని వెల్లడించారు. ఈ నివేదిక వచ్చిన తర్వాత ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇసుక మాఫియా విష‌యంలో సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమైన తహశిల్దార్‌ ను సస్పెండ్‌ చేస్తున్నట్లు చంద్రబాబు ప్ర‌క‌టించారు. ఈ వ్యవహారంలో ఎంతపెద్ద నేతలున్నా వదిలేది లేదని బాబు తేల్చిచెప్పారు. ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఏర్పేడు దుర్ఘ‌టనలో ప్రమేయమున్న వారిని పదేళ్లపాటు జైల్లో పెడితేకానీ బుద్ధిరాదని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ఎవరో చెప్పారని తానీ చర్యల్ని చేపట్టడం లేదని ప‌రోక్షంగా ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ డిమాండ్‌ ను చంద్ర‌బాబు ప్ర‌స్తావించారు. ఎవరైనా ప్రజల అభీష్టం మేరకే నడుచుకోవాలని హితవు పలికారు. ఇకపై మద్యం తాగి వాహనాలు నడిపేవారి లైసెన్సుల్ని రద్దు చేసేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రమాదాన్ని కారణంగా తీసుకుని కొందరు జిందాబాద్‌ కొట్టించుకోవాలని చూశారని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డిని పరోక్షంగా విమర్శించారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/